
Mohammed Siraj : భారత్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య ముల్లన్‌పూర్‌లో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో మూడో రోజు ఆట కోపతాపాలు, హైడ్రామాకు వేదికైంది. భారత స్టార్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ మైదానంలో తీవ్ర అసహనానికి లోనయ్యాడు. ఆఫ్ఘన్ బ్యాటర్ల వింత ఆటతీరుతో విసిగిపోయిన సిరాజ్.. క్రీజులో ఉన్న రహ్మత్ షాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఒకానొక దశలో సిరాజ్ అగ్రెసివ్ లుక్‌తో బ్యాటర్ వైపు దూసుకెళ్లడం మ్యాచ్‌లో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఆఫ్ఘనిస్తాన్ రెండో ఇన్నింగ్స్ ఆడుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. క్రీజులో ఉన్న ఆఫ్ఘన్ బ్యాటర్ షరాఫుద్దీన్ అష్రఫ్ గాయం కారణంగా వికెట్ల మధ్య పరిగెత్తలేని పరిస్థితి ఏర్పడింది. దీనివల్ల అవతలి ఎండ్‌లో బాగా సెట్ అయిన రహ్మత్ షా కూడా సింగిల్స్ తీయడానికి ఇష్టపడలేదు. ఫలితంగా ఇద్దరు బ్యాటర్లు పరుగుల కోసం ప్రయత్నించకుండా, కనీసం బౌండరీలు కొట్టకుండా వచ్చిన ప్రతి బంతిని కేవలం బ్లాక్ చేస్తూ కూర్చున్నారు. దీనివల్ల మ్యాచ్ చాలా బోర్ కొట్టడమే కాకుండా ఎలాంటి రన్ రేట్ లేకుండా సాగింది.
ఆఫ్ఘన్ బ్యాటర్లు క్రీజులో ఉండి టైం వేస్ట్ చేస్తున్నారని భావించిన సిరాజ్‌కు ఒక్కసారిగా ఓపిక నశించింది. రహ్మత్ షా ఒక బంతిని డిఫెన్స్ చేసి నేరుగా సిరాజ్ వైపు నెట్టాడు. ఆ బంతిని అందుకున్న సిరాజ్.. కోపంతో రహ్మత్ షా వైపు వేగంగా నడుచుకుంటూ వెళ్లాడు. అతనిపై వేలు చూపిస్తూ నువ్వు అసలు ఏం చేస్తున్నావు? ఏం ఆట ఇది? అన్నట్లుగా గట్టిగా నిలదీశాడు. అయితే సిరాజ్ అంత కోపంగా ఉన్నా.. రహ్మత్ షా మాత్రం ఏమీ అనకుండా కేవలం నవ్వుతూ ఉండిపోయాడు.
— Nihari Korma (@NihariVsKorma) June 8, 2026
ఈ ఘటన జరిగినప్పుడు కామెంట్రీ బాక్స్‌లో ఉన్న ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్ పూర్తిగా సిరాజ్‌కు సపోర్ట్ చేశాడు. ‘ఇంకా 250 ఓవర్ల ఆట మిగిలి ఉంది. ఇలాంటి సమయంలో అసలు క్రికెట్ ఆడాలనే ఉద్దేశం లేకుండా కేవలం బంతులను బ్లాక్ చేయడం హాస్యాస్పదం. సిరాజ్ స్థానంలో ఎవరున్నా ఇలాగే కోపడతారు, నాకు సిరాజ్ మీద పూర్తి సానుభూతి ఉంది’ అని స్వాన్ అన్నాడు. అదే సమయంలో టీవీ స్క్రీన్‌పై ఆఫ్ఘన్ సపోర్ట్ స్టాఫ్ డ్రెస్సింగ్ రూమ్‌లో నవ్వుకుంటూ కనిపించడం మరింత డ్రామాను క్రియేట్ చేసింది. మాజీ ఇండియన్ స్పిన్నర్ మురళీ కార్తీక్ కూడా ఆఫ్ఘన్ బ్యాటర్ల మైండ్ సెట్‌ను అర్థం చేసుకోవడం కష్టమని అన్నాడు.
ఈ చిన్న వివాదాన్ని పక్కన పెడితే.. మ్యాచ్‌లో భారత యువ స్పిన్నర్ మానవ్ సుతార్ 6 వికెట్లతో అద్భుత ప్రదర్శన చేశాడు. అతని దెబ్బకు ఆఫ్ఘనిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 152 పరుగులకే ఆలౌట్ కాగా, భారత్ ఫాలో-ఆన్ విధించింది. అంతకుముందు టాస్ గెలిచిన భారత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ బ్యాటింగ్ ఎంచుకోగా.. గిల్ (126), కేఎల్ రాహుల్ (100) సెంచరీలతో చెలరేగారు. సాయి సుదర్శన్, రిషభ్ పంత్ చెరో 81 పరుగులు చేయడంతో భారత్ 564/8 స్కోరు వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. చివరకు భారత్ ఇన్నింగ్స్, 300 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి