
మరో నెల రోజుల్లో ఐపీఎల్ 2024 ప్రారంభం కానుంది. అయితే ఇంతలోనే గుజరాత్ టైటాన్స్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు ప్రధాన బౌలరైన టీమిండియా పేసర్ మహమ్మద్ షమీ టోర్నీ మొత్తానికి దూరం కానున్నట్టు తెలుస్తోంది. అతడికి మడమనొప్పి తీవ్రతరం కావడంతో.. లండన్‌లో సర్జరీ చేయించుకునేందుకు వెళ్తున్నట్టు బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే.. వన్డే ప్రపంచకప్ 2023 తర్వాత షమీ ఆటకు దూరమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న టెస్ట్ సిరీస్‌కు కూడా షమీ దూరమైన విషయం విదితమే.
మరోవైపు వన్డే వరల్డ్‌కప్ 2023లో మహమ్మద్ షమీ ఇరగదీసే పెర్ఫార్మన్స్ ఇచ్చి.. అందరినీ ఆశ్చర్యపరిచాడు. మూడుసార్లు ఐదు వికెట్లతో సహా మొత్తంగా 24 వికెట్లు పడగొట్టాడు. ఆ టోర్నమెంట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అవార్డు అందుకున్నాడు. అయితే ఆ సమయంలోనే షమీ ఎడమకాలి మడమ నొప్పితో బాధపడుతున్నాడని.. పెయిన్ కిలర్స్ వాడి బరిలోకి దిగాడని సమాచారం. ఈ ఐసీసీ టోర్నమెంట్ తర్వాత ఆ నొప్పి మరింతగా పెరగడంతో.. అటు సఫారీ పర్యటనకు.. ఇటు స్వదేశంలో ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న టెస్ట్ సిరీస్‌కు దూరమయ్యాడు షమీ. ఇక ఇప్పుడు ఐపీఎల్ నుంచి కూడా వైదొలిగాడు. ఇటీవల అర్జున అవార్డు పొందిన 33 ఏళ్ల షమీ చివరిసారిగా గతేడాది ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే ప్రపంచకప్ ఫైనల్‌లో భారత్ తరఫున ఆడాడు.
“షమీ జనవరి చివరి వారంలో చీలమండ ఇంజెక్షన్లు తీసుకోవడానికి లండన్‌కి వెళ్లాడు. అవి తీసుకున్న మూడు వారాల తర్వాత అతడు తేలికగా పరిగెత్తడం ప్రారంభించవచ్చునని డాక్టర్లు చెప్పారు. కానీ ఆ ఇంజెక్షన్లు పని చేయలేదు. ఇక ఇప్పుడున్న ఫైనల్ ఆప్షన్ సర్జరీ మాత్రమే. అందుకోసం కొద్దిరోజుల్లో యూకే వెళ్లనున్నాడు షమీ. అతడు ఐపీఎల్ 2024లో ఆడటం కష్టమే.” అని బీసీసీఐ అధికారి ఒకరు జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. కాగా, ఈ ఏడాది చివర్లో బంగ్లాదేశ్, న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరిగే టెస్ట్ మ్యాచ్‌లలో కూడా మహమ్మద్ షమీ పాల్గొనే ఛాన్స్‌లు తక్కువగానే కనిపిస్తున్నాయి.