Cheque Bounce Case : రూ.లక్ష చెక్ బౌన్స్ వివాదం.. కోర్టులో టీమిండియా స్టార్ బౌలర్‎కు ఊరట

Cheque Bounce Case : మహమ్మద్ షమీ తన భార్యకు ఇంటి ఖర్చుల కోసం రూ.లక్ష విలువైన ఒక చెక్కును ఇచ్చారని, అయితే బ్యాంక్‌కు వెళ్తే అది బౌన్స్ అయిందంటూ గతంలో హసీన్ జహాన్ అలీపూర్ కోర్టును ఆశ్రయించారు. షమీ ఉద్దేశపూర్వకంగానే తనకు తప్పుడు చెక్ ఇచ్చి మోసం చేశారని ఆమె ఆరోపించారు.

Cheque Bounce Case : రూ.లక్ష చెక్ బౌన్స్ వివాదం.. కోర్టులో టీమిండియా స్టార్ బౌలర్‎కు ఊరట
Mohammed Shami

Updated on: May 20, 2026 | 8:20 PM

Cheque Bounce Case : భారత క్రికెట్ జట్టు స్టార్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీకి న్యాయస్థానంలో భారీ విజయం లభించింది. గత నాలుగేళ్లుగా కోర్టులో నలుగుతున్న ఒక వివాదాస్పద చెక్ బౌన్స్ కేసు నుంచి షమీని కోల్‌కతాలోని అలీపూర్ కోర్టు పూర్తిగా నిర్దోషిగా ప్రకటిస్తూ బుధవారం సంచలన తీర్పునిచ్చింది. షమీకి, ఆయనకు దూరంగా ఉంటున్న భార్య హసీన్ జహాన్‌కు మధ్య గత కొన్నేళ్లుగా తీవ్రమైన కుటుంబ కలహాలు, కోర్టు గొడవలు నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భార్య పెట్టిన ఒక కేసు నుంచి షమీకి క్లీన్ చిట్ లభించడంతో ఆయన అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

అసలు ఏం జరిగిందంటే?

మహమ్మద్ షమీ తన భార్యకు ఇంటి ఖర్చుల కోసం రూ.లక్ష విలువైన ఒక చెక్కును ఇచ్చారని, అయితే బ్యాంక్‌కు వెళ్తే అది బౌన్స్ అయిందంటూ గతంలో హసీన్ జహాన్ అలీపూర్ కోర్టును ఆశ్రయించారు. షమీ ఉద్దేశపూర్వకంగానే తనకు తప్పుడు చెక్ ఇచ్చి మోసం చేశారని ఆమె ఆరోపించారు. ఈ కేసు గత నాలుగు సంవత్సరాలుగా కోర్టులో విచారణ దశలో పెండింగ్‌లో ఉంది. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం.. చివరకు షమీపై మోపబడిన అన్ని ఆరోపణలను కొట్టివేస్తూ, ఆయనను ఈ కేసు నుండి పూర్తిగా విముక్తుడిని చేసింది.

జస్టిస్ అజయ్ కుమార్ ముఖర్జీ కీలక ఆదేశాలు

గతంలో ఈ వివాదానికి సంబంధించిన భరణం కేసులో కోల్‌కతా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అజయ్ కుమార్ ముఖర్జీ ఒక కీలక ఉత్తర్వు జారీ చేశారు. కేసు పూర్తిగా తేలేవరకు హసీన్ జహాన్, ఆమె కుమార్తెకు ఆర్థిక ఇబ్బందులు కలగకుండా ఉండటానికి.. భార్యకు ప్రతి నెలా రూ.1.5 లక్షలు, అలాగే కుమార్తె చదువు, ఇతర ఖర్చుల కోసం మరో రూ.2.5 లక్షలు కలిపి మొత్తం నెలకు రూ.4 లక్షల భరణాన్ని షమీ చెల్లించాలని ఆదేశించారు. ఈ ఆదేశాలు ఇప్పటికీ అమలులోనే ఉంటాయని కోర్టు స్పష్టం చేసింది.

కూతురిపై ప్రేమ ఉంటే అదనంగా ఇచ్చుకోవచ్చు

అలీపూర్ కోర్టు తన తాజా తీర్పులో మరొక ఆసక్తికరమైన విషయాన్ని కూడా పేర్కొంది. కోర్టు నిర్ణయించిన రూ.4 లక్షల భరణం కాకుండా, ఒకవేళ తండ్రిగా మహమ్మద్ షమీ తన కుమార్తె భవిష్యత్తు కోసం, అదనపు సహాయం కోసం తన సొంత ఇష్టంతో మరింత డబ్బు ఇవ్వాలనుకుంటే.. ఆయనకు పూర్తి స్వేచ్ఛ ఉంటుందని న్యాయమూర్తి వెల్లడించారు. దీనిపై ఎలాంటి చట్టపరమైన అభ్యంతరాలు ఉండబోవని కోర్టు స్పష్టం చేసింది.

సుప్రీం కోర్టును ఆశ్రయించిన హసీన్ జహాన్

కోర్టు కేటాయించిన రూ.4 లక్షల భరణంపై హసీన్ జహాన్ సంతృప్తి చెందలేదు. షమీ అంతర్జాతీయ క్రికెటర్ కావడంతో కోట్లాది రూపాయల ఆదాయం ఉందని, కాబట్టి ఈ మొత్తాన్ని నెలకు రూ.10 లక్షలకు పెంచాలని డిమాండ్ చేస్తూ ఆమె దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు తలుపు తట్టారు. ఒకవైపు భరణం పెంచాలంటూ ఆమె సుప్రీం కోర్టులో పోరాడుతుండగా.. మరోవైపు అలీపూర్ కోర్టులో ఉన్న చెక్ బౌన్స్ కేసులో షమీ నిర్దోషిగా తేలడం హసీన్ జహాన్‌కు గట్టి ఎదురుదెబ్బగా భావిస్తున్నారు.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us