
Team India 2027 World Cup Plan: భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI), టీమ్ మేనేజ్‌మెంట్ కేవలం రాబోయే టీ20 ప్రపంచ కప్ 2026 పైనే కాకుండా, దక్షిణాఫ్రికా వేదికగా జరగనున్న 2027 వన్డే ప్రపంచ కప్ (ODI World Cup 2027) పై కూడా దృష్టి సారించాయి. తాజా నివేదికల ప్రకారం, టీమిండియా 2026 టీ20 ప్రపంచ కప్ జట్టులో ఉండే ఆటగాళ్లలో కేవలం ఐదుగురు మాత్రమే 2027 వన్డే ప్రపంచ కప్‌కు ఎంపికయ్యే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.
భారత క్రికెట్‌లో సీనియర్ల శకం ముగియనుండటంతో, వన్డే ఫార్మాట్ కోసం ప్రత్యేకంగా యువ జట్టును సిద్ధం చేయాలని సెలక్టర్లు భావిస్తున్నారు. 2026 టీ20 ప్రపంచ కప్ జట్టులోని అందరు ఆటగాళ్లు వన్డే ఫార్మాట్‌కు సరిపోరని, అందుకే కేవలం ‘ఆల్-ఫార్మాట్’ ప్లేయర్లను మాత్రమే కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ప్రస్తుత అంచనాల ప్రకారం, రెండు ప్రపంచ కప్‌లలోనూ చోటు దక్కించుకునే అవకాశం ఉన్న ఐదుగురు ఆటగాళ్లు వీరే:
జస్ప్రీత్ బుమ్రా: టీమ్ ఇండియా ప్రధాన పేసర్, నమ్మదగ్గ బౌలర్.
హార్దిక్ పాండ్యా: ఆల్‌రౌండర్‌గా జట్టుకు సమతుల్యతను అందించే కీలక ఆటగాడు.
అక్షర్ పటేల్: నిలకడైన ప్రదర్శనతో టీ20 వైస్ కెప్టెన్‌గా ఎదిగిన అక్షర్, వన్డేల్లోనూ కీలకం.
శుభ్‌మన్ గిల్: టీ20 జట్టులో చోటు కోల్పోయినప్పటికీ, వన్డేల్లో భారత్‌కు కాబోయే కెప్టెన్‌గా గిల్‌ను పరిగణిస్తున్నారు.
కుల్దీప్ యాదవ్: స్పిన్ విభాగంలో కుల్దీప్ చైనామన్ బౌలింగ్ వన్డే ఫార్మాట్‌కు అత్యంత అవసరం.
టీ20ల్లో ప్రపంచ నంబర్ 1 బ్యాటర్‌గా, జట్టు కెప్టెన్‌గా ఉన్న సూర్యకుమార్ యాదవ్ వన్డే ప్రపంచ కప్ రేసులో వెనుకబడినట్లు కనిపిస్తోంది. అతని వయస్సు (35 ఏళ్లు), గత వన్డే రికార్డులను పరిగణనలోకి తీసుకుంటే, 2027 నాటికి అతను వన్డే జట్టులో ఉండటం కష్టమేనని విశ్లేషకులు భావిస్తున్నారు.
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ 2027 వన్డే ప్రపంచ కప్ ఆడతారా లేదా అనేది ఇంకా సస్పెన్స్‌గానే ఉంది. ఒకవేళ వారు రిటైర్మెంట్ ప్రకటించకపోతే, జట్టులో కచ్చితంగా మార్పులు ఉంటాయి. కానీ మేనేజ్‌మెంట్ మాత్రం యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ వంటి యువకులను 50 ఓవర్ల ఫార్మాట్ కోసం సిద్ధం చేస్తోంది.
ఈ మెగా ప్లాన్ టీమిండియాను భవిష్యత్తులో మరింత బలోపేతం చేస్తుందని బోర్డు భావిస్తోంది. 2026 టీ20 వరల్డ్ కప్ ముగిసిన వెంటనే వన్డే జట్టుపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..