MI vs CSK IPL 2022 Match Prediction: నిలవాలంటే గెలవాల్సిందే.. రోహిత్‌ సేనకు చావోరేవో.. నేడు చెన్నైతో కీలక పోరు..

| Edited By: Phani CH

Apr 21, 2022 | 9:46 AM

Mumbai Indians vs Chennai Super Kings Match Preview: ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన జట్టుగా గుర్తింపు తెచ్చుకున్న ముంబై ఇండియన్స్‌ (MI) ఈ సీజన్‌లో గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది.

MI vs CSK IPL 2022 Match Prediction: నిలవాలంటే గెలవాల్సిందే.. రోహిత్‌ సేనకు చావోరేవో.. నేడు చెన్నైతో కీలక పోరు..
Mi Vs Csk
Follow us on

Mumbai Indians vs Chennai Super Kings Match Preview: ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన జట్టుగా గుర్తింపు తెచ్చుకున్న ముంబై ఇండియన్స్‌ (MI) ఈ సీజన్‌లో గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లోనూ ఓటమిపాలైన ఆ జట్టు ఎలిమినేషన్‌ అంచున నిలిచింది. ఈక్రమంలో టోర్నీలో నిలవాంటే గురువారం (ఏప్రిల్‌21) చెన్నైతో జరిగే కీలక మ్యాచ్‌ (MI vs CSK)లో రోహిత్‌ సేన తప్పక విజయం సాధించాల్సిందే. ఒకవేళ ఓడితే మాత్రం ట్రోఫీపై ఆశలు వదులుకోవాల్సిందే. మరోవైపు డిపెండింగ్‌ ఛాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ (CSK) పరిస్థితి కూడా ఏమంత బాగోలేదు. ఆడిన 6 మ్యాచ్‌ల్లో ఐదింటిలో పరాజయం పాలైంది. ముంబైతో ఓడిపోతే ఆ జట్టు కూడా ఎలిమినేషన్ రేస్‌లోకి వస్తుంది.

ముంబై జట్టులో మార్పులు..

ముంబైను బాగా ఇబ్బంది పెడుతున్న అంశం కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్. ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లు ఆడిన హిట్‌మ్యాన్‌ కేవలం114 పరుగులు మాత్రమే చేశాడు. చెన్నైకు భారీ లక్ష్యం విధించాలన్నా, టార్గెట్‌ ను ఛేదించాలన్నా రోహిత్ భారీ ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంటుంది. ఇక ఇషాన్ కిషన్ కూడా మెరుగ్గా రాణించాల్సి ఉంటుంది. ఆరంభంలో రెండు అర్ధసెంచరీలు చేసిన అతను ఆ తర్వాత పూర్తిగా తేలిపోయాడు. డెవాల్డ్ బ్రెవిస్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ సమష్ఠిగా మిడిల్‌ ఆర్డర్‌ బాధ్యతలు పంచుకోవాలి. ఇక ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్ కూడా తనకున్న మ్యాచ్ విన్నర్ పేరును నిలబెట్టుకోవాల్సి ఉంది. ఇక రోహిత్‌ సేనకు బ్యాటింగ్‌ కంటే బౌలింగ్‌ చాలా ఆందోళన కలిగిస్తుంది. జస్ప్రీత్ బుమ్రాకు సహకారమందించే బౌలర్లే కనిపించడం లేదు. టైమల్ మిల్స్, జయదేవ్ ఉనద్కత్, బాసిల్ థంపి, మురుగన్ అశ్విన్ ఏ మాత్రం ప్రభావం చూపడం లేదు. దీంతో వీరి స్థానాల్లో రిలే మెరిడిత్‌, మయాంక్ మార్కండేలకు జట్టులో చోటు కల్పించే అవకాశం ఉంది.

వారికి అవకాశం..

ఇక చెన్నై విషయానికొస్తే.. రుతురాజ్ గైక్వాడ్ ఫామ్ లోకి రావడం సీఎస్కేకి సానుకూలాంశం. రాబిన్ ఉతప్ప మరింత నిలకడగా ఆడాల్సి ఉంది. అంబటి రాయుడు, మొయిన్ అలీతో పాటు మిడిల్ ఆర్డర్‌లో దూబే మరింత బాధ్యతగా ఆడాల్సి ఉంది. ఇక కెప్టెన్ రవీంద్ర జడేజా, మహేంద్ర సింగ్ ధోనీ ఫినిషర్ పాత్రను పోషించాలి. ముంబై బ్యాటర్ల దూకుడును తగ్గించాలంటే జడేజా బౌలింగ్‌లోనూ సత్తా చాటాల్సి ఉంది. ఇక జట్టులో డ్వేన్ బ్రావో, స్పిన్నర్ మహేశ్ తీక్షణ తప్ప మిగతా బౌలర్లు రాణించలేకపోతున్నారు. ముకేశ్ చౌదరి, క్రిస్ జోర్డాన్ ధారాళంగా పరుగులు ఇస్తున్నారు. అందుకే వీరి స్థానాల్లో దక్షిణాఫ్రికాకు చెందిన డ్వేన్ ప్రిటోరియస్‌, అండర్‌-19 స్టార్‌ రాజ్‌వర్ధన్‌ హెంగెర్‌గేకర్‌కు ఫైనల్‌-XI లో చోటు దక్కవచ్చు.

ముంబైదే పైచేయి…

కాగా ఐపీఎల్ లో  ఇప్పటివరకు మొత్తం 34  సార్లు ముంబై, చెన్నై తలపడ్డాయి.  చెన్నై 14 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా.. ముంబై 20 మ్యాచ్ ల్లో గెలుపొందింది..

 

ఇరు జట్ల ప్లేయింగ్ – XI ఎలా ఉండొచ్చంటే..

చెన్నై సూపర్ కింగ్స్: రవీంద్ర జడేజా (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, రాబిన్ ఉతప్ప, మొయిన్ అలీ, అంబటి రాయుడు, శివమ్ దూబే, మహేంద్ర సింగ్ ధోని (వికెట్‌ కీపర్‌), డ్వేన్ బ్రావో, డ్వేన్ ప్రిటోరియస్, ముఖేష్ చౌదరి, మహేష్ తీక్షణ.

ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, డెవాల్డ్ బ్రెవిస్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, కీరన్ పొలార్డ్, ఫాబియన్ అలెన్, జయదేవ్ ఉనద్కత్, మయాంక్ మార్కండే, జస్ప్రీత్ బుమ్రా, టైమల్ మిల్స్.

ఎక్కడ చూడొచ్చంటే..

ముంబై ఇండియన్స్ మరియు చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్‌ను స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ఛానెల్‌లలో వివిధ భాషలలో చూడవచ్చు. అదేవిధంగా డిస్నీ+హాట్‌స్టార్‌లో సబ్‌స్ర్కిప్షన్‌తో వీక్షించొచ్చు. వీటితో పాటు https://tv9telugu.com/ ద్వారా ఎప్పటికప్పుడు మ్యాచ్‌ అప్‌డేట్స్‌ను తెలుసుకోవచ్చు.

Also Read: Kieron Pollard: కీరన్‌ పొలార్డ్‌ సంచలన నిర్ణయం.. అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు.. ఆందోళనలో ముంబై ఫ్యాన్స్‌..

Sri Lanka: మరింతగా రగిలిపోతున్న లంక.. 3,800 కోట్ల డాలర్ల ఆర్ధిక సాయం ప్రకటించిన భారత్..

Yadadri: యాదాద్రిలో శివాలయ పునరుద్ఘాటనకు ముహూర్తం ఖరారు.. ఈ నెల 25 వరకు మహాకుంభాభిషేక మహోత్సవాలు