
WPL 2026: రెండుసార్లు మహిళా ప్రీమియర్ లీగ్ ఛాంపియన్ అయిన ముంబై ఇండియన్స్, WPL 2026 సీజన్ కోసం ఒక స్ట్రాంగ్ స్క్వాడ్‌ను సిద్ధం చేసింది. వేలానికి ముందు ఐదుగురు కీలక ఆటగాళ్లను రిటైన్ చేసుకున్న ముంబై ఇండియన్స్, వేలంలో న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ అమెలియా కెర్ కోసం ఏకంగా రూ.3 కోట్ల భారీ మొత్తాన్ని వెచ్చించింది. పాత ఆటగాళ్లైన షబ్నిమ్ ఇస్మాయిల్, సంస్కృతి గుప్తా, సజన సజీవన్ మళ్లీ జట్టులోకి రావడంతో ముంబై జట్టు మరింత పటిష్టంగా కనిపిస్తోంది. ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీ యజమాని నీతా అంబానీ, తాము గతేడాది జట్టులోని ఎక్కువ మంది ఆటగాళ్లను తిరిగి కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
గత గురువారం (నవంబర్ 27) జరిగిన మహిళా ప్రీమియర్ లీగ్ వేలం గురించి మాట్లాడిన ముంబై ఇండియన్స్ సహ-యజమాని నీతా అంబానీ, వేలం రోజు చాలా ఉత్సాహంగా, కొన్నిసార్లు టెన్షన్‌గా కూడా గడిచిందని అన్నారు. 2025లో ఛాంపియన్‌గా నిలిచిన జట్టులోని ఎక్కువ మంది ఆటగాళ్లను తిరిగి కొనుగోలు చేయడమే తమ ప్రధాన వ్యూహమని ఆమె వెల్లడించారు. కీలకమైన ఆటగాళ్లు తిరిగి జట్టులోకి రావడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు. వేలంలో అమెలియా కెర్ తిరిగి జట్టులోకి రావడం అలాగే షబ్నిమ్ ఇస్మాయిల్, సైకా ఇషాక్, సజన సజీవన్, సంస్కృతి గుప్తా వంటి నలుగురు భారతీయ ప్లేయర్లు మళ్లీ రావడం ముంబై ఇండియన్స్‌కు పెద్ద బలం అని ఆమె అన్నారు. అంతేకాకుండా రాహిలా ఫిర్దౌస్, నల్లా క్రాంతి రెడ్డి, త్రివేణి వశిష్ఠ వంటి యువ ప్రతిభావంతులతో పాటు, పూనమ్ ఖేమ్నార్, మిల్లీ ఇల్లింగ్‌వర్త్, నికోలా కేరీలను కూడా ముంబై ఇండియన్స్ ఫ్యామిలీలోకి స్వాగతించారు.
ముంబై ఇండియన్స్ జట్టు ఇప్పటికే కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌తో పాటు, నాట్ సైవర్-బ్రంట్, హేలీ మాథ్యూస్, అమన్‌జోత్ కౌర్, జి కమలిని వంటి ఐదుగురు కీలక ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. వేలంలో ఇటీవల టీ20 ప్రపంచ కప్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచిన అమెలియా కెర్, ఫాస్ట్ బౌలర్ షబ్నిమ్ ఇస్మాయిల్ తిరిగి రావడం కోర్ టీమ్‌ను మరింత పటిష్టం చేసింది. ప్రపంచ కప్ విజేత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ కూడా న్యూఢిల్లీలో జరిగిన వేలానికి హాజరై, వేలం టేబుల్‌పై వ్యూహాలను రచించడంలో కీలక పాత్ర పోషించారు.
వేలంలో తన అనుభవం గురించి కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ మాట్లాడుతూ.. “నేను మొదట్లో కొంచెం కంగారు పడ్డాను, కానీ మేము ప్రణాళిక చేసిన విధానం, అందరి భాగస్వామ్యం నాకు చాలా బాగా నచ్చింది. నీతా అంబానీ ఎప్పుడూ జట్టుకు సపోర్టుగా ఉండి మాకు అండగా నిలుస్తారు. మా పాత సహచరులలో ఎక్కువ మందిని మేము తిరిగి పొందాము. ఇది ఆ ఆటగాళ్లపై జట్టుకు ఉన్న నమ్మకాన్ని చూపుతుంది” అని అన్నారు.
ముంబై ఇండియన్స్ విజయాలలో సైకా, సజన, సంస్కృతి వంటి ఇండియన్ ప్లేయర్లు కీలక పాత్ర పోషించారు. వారు టోర్నమెంట్‌లో ఎదుగుతున్న స్టార్ ప్లేయర్‌లుగా నిలిచారు. ముంబై ఇండియన్స్ జట్టు.. అనేక ప్రపంచ కప్‌ల విజేత అయిన నికోలా కేరీ, యువ ఫాస్ట్ బౌలర్ మిల్లీ ఇల్లింగ్‌వర్త్ అనే ఆస్ట్రేలియన్ జోడీని కూడా తమ జట్టులో చేర్చుకుంది. అలాగే యంగ్ ఇండియన్ టాలెంటుకు సపోర్ట్ ఇచ్చే తమ విధానానికి అనుగుణంగా, భారతీయ ఆల్‌రౌండర్‌లు నల్లా క్రాంతి రెడ్డి, త్రివేణి వశిష్ఠ్‌లను కూడా కొనుగోలు చేసింది. వీరిద్దరూ తొలిసారి డబ్ల్యూపీఎల్ లో ఆడనున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..