New Zealand vs Pakistan, 35th Match: గతేడాది రన్నరప్ న్యూజిలాండ్ జట్టుకు భారీ షాక్ తగిలింది. ఇప్పటికే న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ గాయంతో కొన్ని మ్యాచ్‌లకు దూరంగా ఉంటున్నాడు. ఈ క్రమంలో తాజాగా మరో భారీ షాక్ తగిలింది. పేసర్ మాట్ హెన్రీ 2023 ప్రపంచకప్‌నకు దూరమయ్యాడు. హెన్రీ స్థానంలో కైల్ జేమీసన్‌ను జట్టులోకి తీసుకున్నారు. ఈ మేరకు న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు శుక్రవారం ట్వీట్ చేసింది.
ICC పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ 2023 ఈవెంట్ టెక్నికల్ కమిటీ ఈ మార్పును ఆమోదించిందని బోర్డు ట్వీట్ చేసింది. పాకిస్థాన్‌తో శనివారం జరగనున్న మ్యాచ్‌కు ముందు జేమీసన్ గురువారం అర్థరాత్రి బెంగళూరు చేరుకున్నాడు.
నవంబర్ 1న సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో హెన్రీ బౌలింగ్ చేస్తున్నప్పుడు గాయపడ్డాడు. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ 27వ ఓవర్ మూడో బంతికి ఫాస్ట్ బౌలర్ స్నాయువు స్ట్రెయిన్‌కు గురయ్యాడు. ఆ తర్వాత మైదానం నుంచి వెళ్లిపోయాడు. 27వ ఓవర్‌ను జిమ్మీ నీషమ్ పూర్తి చేశాడు.
కాగా, న్యూజిలాండ్ జట్టులోని మరో ముగ్గురు ఇప్పటికే ఆటగాళ్లు గాయపడ్డారు. కేన్ విలియమ్సన్, లాకీ ఫెర్గూసన్, మార్క్ చాప్‌మన్ కూడా గాయం కారణంగా జట్టుకు దూరంగా ఉన్నారు. అక్టోబర్ 13న బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ గాయపడ్డాడు. అతని బొటనవేలు ఫ్రాక్చర్ అయింది. గాయం కారణంగా చివరి నాలుగు మ్యాచ్‌లు కూడా ఆడలేకపోయాడు. అతని స్థానంలో టామ్ లాథమ్ కెప్టెన్‌గా ఉన్నాడు. అయితే గత కొద్ది రోజులుగా నెట్స్ లో బ్యాటింగ్ ప్రాక్టీస్ ప్రారంభించడం కాస్త ఊరట కలిగించే విషయమే.
ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ జట్టు పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. తొలి నాలుగు మ్యాచ్‌ల్లో న్యూజిలాండ్ జట్టు వరుసగా విజయం సాధించింది. అయితే గత మూడు మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. మొత్తంగా ఏడు మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలు, మూడు ఓటములతో 8 పాయింట్లతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. న్యూజిలాండ్ లీగ్ దశలో ఇంకా రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. నవంబర్ 4న పాకిస్థాన్‌తో, నవంబర్ 9న శ్రీలంకతో ఆడాల్సి ఉంది.
న్యూజిలాండ్ జట్టు: డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ లాథమ్(కెప్టెన్/కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ సాంట్నర్, టిమ్ సౌథీ, జేమ్స్ నీషమ్, ట్రెంట్ బౌల్ట్, కైల్ జేమీసన్, ఇష్ సోధి, మార్క్ చాప్‌మన్, లాకీ ఫెర్గూసన్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..