Champions Trophy: మార్కరమ్‌ను గ్రౌండ్‌లోనే తోసేసిన ఆఫ్ఘనిస్థాన్‌ బౌలర్‌! ఈ వీడియో చూశారా?

దక్షిణాఫ్రికా ఆఫ్ఘనిస్థాన్‌ను 107 పరుగుల తేడాతో ఓడించింది. రికెల్టన్ 103 పరుగులతో సెంచరీ చేయగా, మార్కరమ్, బవుమా, వాన్ డర్ డసెన్ హాఫ్ సెంచరీలు చేశారు. ఆఫ్ఘనిస్థాన్‌ తరఫున రెహమత్ షా 90 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో ఫజల్ హక్ ఫరూఖీ, ఎయిడెన్ మార్కరమ్‌ను గ్రౌండ్‌లో తోశాడు, ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Champions Trophy: మార్కరమ్‌ను గ్రౌండ్‌లోనే తోసేసిన ఆఫ్ఘనిస్థాన్‌ బౌలర్‌! ఈ వీడియో చూశారా?
Sa Vs Afg

Updated on: Feb 22, 2025 | 12:46 PM

ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025లో భాగంగా శుక్రవారం సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్థాన్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరిగింది. కరాచీలోని నేషనల్‌ క్రికెట్‌ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఘన విజయం సాధించింది. ఏకంగా 107 పరుగుల భారీ తేడాతో ఈ మ్యాచ్‌ గెలిచింది. అయితే.. ఈ మ్యాచ్‌లో ఓ ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. ఆఫ్ఘనిస్థాన్‌ పేసర్‌ ఫజల్‌హక్‌ ఫరూఖీ, సౌతాఫ్రికా స్టార్‌ బ్యాటర్‌ ఎయిడెన్‌ మార్కరమ్‌ను గ్రౌండ్‌లోనే పక్కకతోసేశాడు. ఈ ఘటన సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌ చివరి ఓవర్‌ రెండో బాల్‌ తర్వాత చోటు చేసుకుంది. ఫరూఖీ బౌలింగ్‌లో రెండో బంతికి సింగిల్‌ తీసుకున్న మార్కరమ్‌ నాన్‌స్ట్రైక్‌ ఎండ్‌కి వచ్చి నిల్చుంటాడు. మూడో బాల్‌ వేసేందుకు రన్నప్‌ కోసం వెళ్తున్న క్రమంలో ఫరూఖీకి మార్కరమ్‌ అడ్డుగా వస్తాడు. దీంతో ఫరూఖీ పక్క నుంచి వెళ్లకుండా మార్కరమ్‌ను ఏకంగా రెండు చేతులతో బలవంతంగా పక్కకు తోసేస్తాడు.

ఈ సీన్స్‌ చూసి.. ఇద్దరి మధ్య ఫైట్‌ జరుగుతుందని అనిపిస్తుంది. మార్కరమ్‌ కూడా తన బ్యాట్‌ను ఫరూఖీని వెనుక టచ్‌ చేస్తాడు. దీంతో ఇద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ చిన్న స్మైల్‌ ఇవ్వడంతో ఇదంతా ఫ్రెండ్లీగా జరిగిందని అంతా ఊపిరిపీల్చుకున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియో మాత్రం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్‌ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 315 పరుగులు చేసింది. ఓపెనర్‌ రికెల్టన్‌ ఏకంగా సెంచరీతో చెలరేగాడు. 106 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్స్‌తో 103 పరుగులు చేశాడు. ఇక కెప్టెన్‌ బవుమా(58), వాన్‌ డర్‌ డసెన్‌(52), మార్కరమ్‌(52 నాటౌట్‌) ముగ్గురు కూడా హాఫ్‌ సెంచరీలతో రాణించారు.

ఆఫ్ఘాన్‌ బౌలర్లలో నబీ 2, ఫరూఖీ, అజ్మతుల్లా, నూర్‌ అహ్మద్‌ చెరో వికెట్‌ తీశారు. స్టార్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ 10 ఓవర్లు వేసి 59 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్‌ కూడా తీయకపోవడం గమనార్హం. ఇక భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్థాన్‌ 43.3 ఓవర్లలో కేవలం 208 పరుగులకే ఆలౌట్‌ అయింది. రెహమత్‌ షా ఒక్కడే 90 పరుగులతో రాణించాడు. మిగతా బ్యాటర్లు పెద్దగా ప్రభావం చూపలేదు. సౌతాఫ్రికా బౌలర్లలో రబాడా 3, లుంగీ ఎన్గిడి, వియాన్ ముల్డర్ చెరో రెండు, మార్కో యాన్సెన్‌, కేశవ్‌ మహరాజ్ చెరో వికెట్‌ తీసుకున్నారు.