
Cricket Records: సౌతాఫ్రికా యువ ఆల్‌రౌండర్ మార్కో జాన్సెన్ (Marco Jansen) ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో అద్భుతమైన ఆల్‌రౌండ్ ప్రదర్శనతో సరికొత్త చరిత్ర సృష్టించారు. కేవలం బ్యాటింగ్, బౌలింగ్‌తోనే కాకుండా ఫీల్డింగ్‌లోనూ అదరగొట్టిన ఆయన, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న అరుదైన రికార్డును సమం చేశారు. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన మార్కో జాన్సెన్, ప్రపంచ క్రికెట్‌లో ఈ ఘనత సాధించిన ఐదో ఆటగాడిగా, సౌతాఫ్రికా తరఫున తొలి క్రికెటర్‌గా రికార్డులకెక్కారు.
ఒక వన్డే మ్యాచ్‌లో 50కి పైగా పరుగులు సాధించడంతో పాటు, కనీసం 1 వికెట్ పడగొట్టి, సరిగ్గా 4 క్యాచ్‌లు అందుకోవడం అంత సులువైన విషయం కాదు. ఇంతకుముందు ఈ అరుదైన ఫీట్‌ను మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 1998లో పాకిస్థాన్‌పై సాధించారు. ఆ తర్వాత యూనిస్ ఖాన్, మైకేల్ క్లార్క్, మార్నస్ లబుషేన్ వంటి దిగ్గజాలు ఈ జాబితాలో చేరారు. ఇప్పుడు తాజాగా ఆస్ట్రేలియాపై 75 పరుగులు చేసి, 1 వికెట్ తీసి, 4 క్యాచ్‌లు పట్టిన మార్కో జాన్సెన్ ఆ క్లబ్‌లో ఐదో ఆటగాడిగా తన పేరును లిఖించుకున్నారు.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా జట్టు మ్యాథ్యూ బ్రీట్జ్‌కే అద్భుతమైన సెంచరీ (106 బంతుల్లో 106 పరుగులు) సహాయంతో నిర్ణీత ఓవర్లలో 297 పరుగులు చేసింది. ఈ ఇన్నింగ్స్‌లో మార్కో జాన్సెన్ సైతం అద్భుతంగా ఆడి 75 కీలక పరుగులు చేసి బ్రీట్జ్‌కేతో కలిసి ఆరో వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆస్ట్రేలియా బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న ఈ జోడీ సౌతాఫ్రికా జట్టుకు గౌరవప్రదమైన స్కోరును అందించడంలో ప్రధాన పాత్ర పోషించింది.
298 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టుకు కెప్టెన్ మిచెల్ మార్ష్ (60 పరుగులు), ట్రావిస్ హెడ్ (36 పరుగులు) కలిసి అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. ఒక దశలో ఆసీస్ జట్టు సులభంగా గెలిచేలా కనిపించింది. అయితే సౌతాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహారాజ్ తన మాయాజాలంతో ఆసీస్ బ్యాటర్లను కోలుకోలేని దెబ్బతీశాడు. వరుస వికెట్లు పడగొట్టి ఒత్తిడి పెంచడంతో ఆస్ట్రేలియా జట్టు కేవలం 230 పరుగులకే ఆలైట్ అయింది. దీంతో సౌతాఫ్రికా అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..