Catch Of The Season : ఐపీఎల్ హిస్టరీలోనే గ్రేటెస్ట్ క్యాచ్.. కోహ్లీ రియాక్షన్ చూశారా?

Catch Of The Season : ఐపీఎల్ 2026లో మనీష్ పాండే పట్టిన అద్భుతమైన క్యాచ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టిమ్ డేవిడ్‌ను అవుట్ చేసిన ఈ క్యాచ్ చూసి విరాట్ కోహ్లీ కూడా షాక్ అయ్యాడు. రాయ్‌పూర్ స్టేడియంలో ఆర్‌సీబీ ఛేజింగ్ సమయంలో ఈ అద్భుతం చోటుచేసుకుంది.

Catch Of The Season : ఐపీఎల్ హిస్టరీలోనే గ్రేటెస్ట్ క్యాచ్.. కోహ్లీ రియాక్షన్ చూశారా?
Manish Pandeys Catch

Updated on: May 14, 2026 | 8:39 AM

Catch Of The Season : ఐపీఎల్ 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) మధ్య జరిగిన మ్యాచ్ ఫలితం కంటే కూడా ఒక క్యాచ్ గురించి సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. కేకేఆర్ సీనియర్ ఆటగాడు మనీష్ పాండే పట్టిన అద్భుతమైన క్యాచ్ ఇప్పుడు క్యాచ్ ఆఫ్ ది సీజన్‎గా నిలిచిపోతుందని అభిమానులు అంటున్నారు. గాల్లోకి డైవ్ చేస్తూ ఒకే చేత్తో అతను బంతిని అందుకున్న తీరు చూసి సాక్షాత్తూ కింగ్ కోహ్లీ కూడా షాక్ అయ్యాడు.

రాయ్‌పూర్ స్టేడియంలో ఆర్‌సీబీ ఛేజింగ్ సమయంలో ఈ అద్భుతం చోటుచేసుకుంది. ఇన్నింగ్స్ 18వ ఓవర్ చివరి బంతికి కార్తీక్ త్యాగి వేసిన షార్ట్ లెంగ్త్ బంతిని టిమ్ డేవిడ్ పాయింట్ దిశగా బలంగా కట్ షాట్ ఆడాడు. బంతి రాకెట్ వేగంతో బౌండరీకి వెళ్తుందని అందరూ అనుకున్నారు. కానీ బ్యాక్ వర్డ్ పాయింట్‌లో ఉన్న మనీష్ పాండే చిరుతపులిలా స్పందించాడు. తన ఎడమ వైపుకు (నాన్-డామినెంట్ హ్యాండ్) అసాధ్యమైన రీతిలో డైవ్ చేసి, గాల్లో ఉండగానే ఒకే చేత్తో బంతిని ఒడిసి పట్టాడు.

మనీష్ పాండే ఆ క్యాచ్ పట్టగానే స్టేడియం ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయింది. బౌలర్ కార్తీక్ త్యాగి తన తల పట్టుకుని ఆశ్చర్యంతో అలాగే ఉండిపోగా, అవుట్ అయిన టిమ్ డేవిడ్ నమ్మలేక కాసేపు క్రీజులోనే నిలబడిపోయాడు. ఇక నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న విరాట్ కోహ్లీ అయితే నోరు తెరిచి, కళ్లు పెద్దవి చేసి ఆ రిప్లేను చూస్తూ ఉండిపోయాడు. మనీష్ పాండే వయస్సు పెరుగుతున్నా ఫిట్‌నెస్‌లో తనేంటో మరోసారి నిరూపించుకున్నాడు. తన వీక్ హ్యాండ్‌తో అంతటి వేగవంతమైన క్యాచ్ పట్టడం నిజంగా అద్భుతమనే చెప్పాలి.

మనీష్ పాండే అంతటి అద్భుతమైన క్యాచ్ పట్టినా, చివరికి కేకేఆర్ ఓటమిపాలవ్వడం అతనికి కొంత నిరాశను మిగిల్చింది. విరాట్ కోహ్లీ బాదిన వీరోచిత శతకం (105*) ధాటికి కోల్‌కతా నిర్దేశించిన 193 పరుగుల లక్ష్యం చిన్నదైపోయింది. ఆర్‌సీబీ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించి ప్లే ఆఫ్స్ రేసులో మరింత దూసుకుపోయింది. అయితే మ్యాచ్ ఫలితం ఏదైనా, మనీష్ పాండే పట్టిన ఆ ఫ్లయింగ్ క్యాచ్ మాత్రం ఈ సీజన్ కే హైలైట్‌గా నిలిచిపోనుంది.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us