LSG vs DC, IPL 2022: మెరిసిన డికాక్‌.. హ్యాట్రిక్ విజయాలతో మురిసిన లక్నో..

LSG vs DC, IPL 2022: ఐపీఎల్‌లో కొత్తగా అడుగుపెట్టిన లక్నో సూపర్‌ జెయింట్స్‌ మొదటి మ్యాచ్‌లోనే పరాజయం పాలైంది. అయితే ఆతర్వాత కోలుకున్న రాహుల్‌ సేన వరుసగా విజయాలు సాధించింది.

LSG vs DC, IPL 2022: మెరిసిన డికాక్‌.. హ్యాట్రిక్ విజయాలతో మురిసిన లక్నో..
Lsg Vs Dc

Updated on: Apr 08, 2022 | 12:09 AM

LSG vs DC, IPL 2022: ఐపీఎల్‌లో కొత్తగా అడుగుపెట్టిన లక్నో సూపర్‌ జెయింట్స్‌ మొదటి మ్యాచ్‌లోనే పరాజయం పాలైంది. అయితే ఆతర్వాత కోలుకున్న రాహుల్‌ సేన వరుసగా విజయాలు సాధించింది. తాజగా ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లోనూ 6 వికెట్ల తేడాతో విజయం సాధించి టోర్నీలో హ్యాట్రిక్‌ గెలుపును నమోదు చేసుకుంది. ఓపెనర్‌ క్వింటన్‌ డికాక్‌(80) అర్ధసెంచరీతో రాణించడంతో రెండు బంతులు ఉండగానే 150 పరుగుల లక్ష్యాన్ని అందుకుంది. ఈ విజయంతో లక్నో పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. కాగా టోర్నీ ముందు వరకు బలమైన జట్టుగా భావించిన ఢిల్లీ క్యాపిటల్స్‌ ఈ మ్యాచ్‌ల్లో అన్ని విభాగాల్లో నిరాశపర్చింది. తొలుత బ్యాటింగ్ చేసిన రిషబ్ సేన లక్నో బౌలర్ల ధాటికి భారీస్కోరు చేయలేకపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 149 పరుగులు చేసింది. లక్నో కూడా ఈ స్కోరును ఛేదించడానికి కాస్త కష్టపడాల్సి వచ్చినా చివరి ఓవర్‌లో ఆయుష్ బదోనీ వరుసగా రెండు బంతుల్లో ఫోర్, సిక్స్ కొట్టి రాహుల్‌ సేనకు విజయాన్ని అందించాడు.

ఢిల్లీని కట్టడి చేసిన లక్నో బౌలర్లు..

కాగా ఈ మ్యాచ్‌లో మొదట టాస్ గెలిచిన లక్నో ఢిల్లీని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఓపెనర్‌ పృథ్వీ షా ఎదుర్కొన్న మొదటి బంతి నుంచే దూకుడుగా ఆడాడు. టోర్నీలో తొలిసారి ఆడుతోన్న మరో ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ క్రీజులో తంటాలు పడ్డాడు. కాగా పవర్‌ప్లేలో లక్నో బౌలర్లను ఓ ఆటాడుకున్నాడు పృథ్వీషా. ప్రతి బౌలర్‌ను టార్గెట్ చేసిన అతను కేవలం 30 బంతుల్లోనే ఈ సీజన్‌లో తొలి అర్ధ సెంచరీని నమోదు చేశాడు. మొత్తం మీద 34 బంతుల్లో 61 పరుగులు చేసిన ఈ రైట్‌ హ్యాండ్ బ్యాటర్‌ ఎనిమిదో ఓవర్‌లో కృష్ణప్ప గౌతమ్‌కు చిక్కాడు. కాగా షా ఔటయ్యే సమయానికి ఢిల్లీ స్కోరు 68 పరుగులు కాగా.. అప్పటికీ వార్నర్ కేవలం 4 పరుగులు మాత్రమే చేశాడు. భారీషాట్‌ కు యత్నించే క్రమంలో రవి బిష్ణోయ్‌కు బలి అయ్యాడు డేవిడ్‌. ఆ తర్వాత వచ్చిన రోవ్‌మన్ పావెల్‌ కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు. దీంతో కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌, సర్ఫరాజ్‌ ఖాన్‌ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే బాధ్యత తీసుకున్నారు. వీరు క్రీజులో స్వేచ్ఛగా కదిలిన్పటికీ భారీ షాట్‌లు కొట్టడంలో విఫలమయ్యారు. దీంతో స్కోరు వేగం బాగా మందగించింది. ఇద్దరూ 11వ ఓవర్ నుంచి 20వ ఓవర్ క్రీజులో ఉన్నా 57 బంతుల్లో కేవలం 75 పరుగులను మాత్రమే జోడించారు. లక్నో బౌలర్లు అద్భుతంగా బౌలింగ్‌ చేసి పంత్‌, సర్ఫరాజ్‌ను కట్టడి చేశారు. పంత్ 36 బంతుల్లో 39 పరుగులతో నాటౌట్‌గా నిలవగా.. సర్ఫరాజ్ 28 బంతుల్లో 36 పరుగులు చేశాడు. లక్నో బౌలర్లలో బిష్ణోయ్ (2/22), గౌతమ్ (1/23) అద్భు్తంగా బౌలింగ్‌ చేశారు.

Also Read: Russia Suspended: ఐక్యరాజ్యసమితిలో రష్యాకు ఎదురుదెబ్బ.. మానవ హక్కుల మండలిలో సభ్యత్వం రద్దు!

Telangana Schools: తెలంగాణ విద్యార్థులకు సూచన.. మరో సారి మారిన పాఠశాల సమయాలు..

Viral Video: మేకతో ఫైట్‌ చేశాడు !! ఇంతకీ గెలుపు ఎవరిదో తెలుసా ??