Team India Captain : హిస్టరీ రిపీట్స్.. కప్పు గెలిచిన కెప్టెన్లపైనే బీసీసీఐ వేటు ఎందుకు.. అసలు ఏం జరుగుతోంది?

Team India Captain : వరుసగా రెండోసారి భారత్‌కు వరల్డ్ కప్ అందించి, కేవలం మూడు నెలలు కూడా గడవక ముందే సూర్యను కెప్టెన్సీ నుంచి తప్పిస్తుండటం అందరినీ షాక్‌కు గురిచేస్తోంది. అయితే ఐసీసీ ట్రోఫీ గెలిచిన కెప్టెన్‌ను తొలగించడం భారత క్రికెట్‌లో ఇదే మొదటిసారి కాదు.

Team India Captain : హిస్టరీ రిపీట్స్.. కప్పు గెలిచిన కెప్టెన్లపైనే బీసీసీఐ వేటు ఎందుకు.. అసలు ఏం జరుగుతోంది?
Team India Captain

Updated on: Jun 04, 2026 | 6:54 PM

Team India Captain : ఐపీఎల్ 2026 సీజన్ ముగిసిన తర్వాత భారత క్రికెట్ అభిమానులు అంతర్జాతీయ మ్యాచుల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఊహించని విధంగా టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ను ఆ పదవి నుంచి తొలగించబోతున్నారనే వార్త ఒక్కసారిగా సంచలనం సృష్టించింది. రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత సూర్యకుమార్ యాదవ్‌కు కెప్టెన్సీ పగ్గాలు దక్కాయి. అతని నాయకత్వంలో భారత్ వరుసగా ఎనిమిది ద్విపాక్షిక సిరీస్‌లు గెలవడమే కాకుండా, 2025 ఆసియా కప్, ఇటీవల మార్చి 2026లో జరిగిన టీ20 వరల్డ్ కప్‌ను కూడా గెలుచుకుంది. వరుసగా రెండోసారి భారత్‌కు వరల్డ్ కప్ అందించి, కేవలం మూడు నెలలు కూడా గడవక ముందే సూర్యను కెప్టెన్సీ నుంచి తప్పిస్తుండటం అందరినీ షాక్‌కు గురిచేస్తోంది. అయితే ఐసీసీ ట్రోఫీ గెలిచిన కెప్టెన్‌ను తొలగించడం భారత క్రికెట్‌లో ఇదే మొదటిసారి కాదు.

ఐసీసీ ట్రోఫీ గెలిచినా రోహిత్ శర్మకు తప్పని ఉద్వాసన

ఐసీసీ ట్రోఫీ గెలిచిన తర్వాత కూడా కెప్టెన్సీ పదవి నుంచి తొలగించబడిన చివరి భారత కెప్టెన్ మరెవరో కాదు.. లెజెండరీ బ్యాటర్ రోహిత్ శర్మ. విరాట్ కోహ్లీ తప్పుకున్న తర్వాత 2021 డిసెంబర్‌లో రోహిత్ శర్మ వన్డే జట్టుకు పూర్తి స్థాయి కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. అప్పటి బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ నేతృత్వంలోని మేనేజ్‌మెంట్ వైట్-బాల్ క్రికెట్ (వన్డే, టీ20) రెండింటికీ ఒకే కెప్టెన్ ఉండాలని భావించి రోహిత్‌కు బాధ్యతలు అప్పగించింది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో వన్డేల్లో భారత్ అద్భుతమైన విజయాలను సాధించింది. 2018, 2023 ఆసియా కప్‌లను గెలవడంతో పాటు, 2023 వన్డే వరల్డ్ కప్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైనల్ చేరింది. ఆ తర్వాత దుబాయ్‌లో జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్‌ను ఓడించి భారత్‌ను విజేతగా నిలిపాడు. వన్డే కెప్టెన్‌గా రోహిత్ ఏకంగా 75 శాతం విన్ పర్సంటేజ్ (56 మ్యాచ్‌ల్లో 42 విజయాలు) కలిగి ఉన్నాడు.

భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే రోహిత్‌పై వేటు

రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత్ మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచి, అత్యధిక సార్లు ఈ కప్పు గెలిచిన జట్టుగా ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టి చరిత్ర సృష్టించింది. ఇంతటి అద్భుతమైన ట్రాక్ రికార్డ్ ఉన్నప్పటికీ, అదే ఏడాది రోహిత్ శర్మ వన్డే కెప్టెన్సీకి అకస్మాత్తుగా ఎండ్ కార్డ్ పడింది. దీనిపై చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ స్పందిస్తూ.. రోహిత్‌ను తొలగించడానికి అతని కెప్టెన్సీ ఫామ్ కారణం కాదని, జట్టు భవిష్యత్తును, యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్‌ను కెప్టెన్‌గా తీర్చిదిద్దేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. 2027 వన్డే వరల్డ్ కప్ వచ్చేసరికి రోహిత్‌కు 40 ఏళ్లు పైబడతాయని, ఆ సమయంలో ఫిట్‌నెస్ సమస్యలు వస్తే జట్టు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే ముందుగానే గిల్‌కు పగ్గాలు అప్పగించారు.

సూర్యకుమార్ యాదవ్ విషయంలోనూ అదే ఫార్ములా

రోహిత్ శర్మను వన్డే కెప్టెన్సీ నుంచి ఎలాగైతే భవిష్యత్తు కోసం తొలగించారో, ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ విషయంలోనూ సెలక్టర్లు అదే ఫార్ములాను అమలు చేయబోతున్నట్లు తెలుస్తోంది. వరుసగా ఐసీసీ ట్రోఫీలు గెలిపించినప్పటికీ వయసు, భవిష్యత్తు ప్రణాళికల నేపథ్యంలో సీనియర్లను పక్కన పెట్టి యువ రక్తాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా బీసీసీఐ అడుగులు వేస్తోంది. అందుకే సూర్యకుమార్ యాదవ్ స్థానంలో ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)కు టైటిల్ అందించి, మంచి కెప్టెన్సీ రికార్డు ఉన్న శ్రేయస్ అయ్యర్‌ను కొత్త టీ20 కెప్టెన్‌గా తీసుకురావడానికి రంగం సిద్ధమైంది. సక్సెస్ ఫుల్ కెప్టెన్లను మార్చే ఈ కొత్త ట్రెండ్ టీమిండియాకు ఎలాంటి ఫలితాలను ఇస్తుందో వేచి చూడాలి.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us