
Who is Amit Passi: ప్రస్తుతం జరుగుతున్న సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (SMAT) 2025లో ఒక యువ బ్యాటర్ సంచలనం సృష్టించాడు. తన తొలి టీ20 మ్యాచ్‌లోనే ఏకంగా సెంచరీతో చెలరేగి, భారత క్రికెట్ చరిత్రలో అరుదైన ఘనత సాధించాడు. ఆ ఆటగాడి పేరు ‘అమిత్ పాసీ’. బరోడా జట్టు తరపున ఆడుతున్న ఈ వికెట్ కీపర్-బ్యాటర్, సర్వీసెస్‌తో జరిగిన మ్యాచ్‌లో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు.
హైదరాబాద్‌లోని జింఖానా గ్రౌండ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో బరోడా తొలుత బ్యాటింగ్ చేసింది. క్రీజులోకి వచ్చిన అమిత్ పాసీ సర్వీసెస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం బౌండరీల (ఫోర్లు, సిక్సర్లు) ద్వారానే అతను 94 పరుగులు రాబట్టడం విశేషం. పాసీ అద్భుత ఇన్నింగ్స్‌తో బరోడా జట్టు 20 ఓవర్లలో 220 పరుగుల భారీ స్కోరు సాధించింది. చివరకు ఈ మ్యాచ్‌లో బరోడా 13 పరుగుల తేడాతో విజయం సాధించింది.
మొత్తంగా 55 బంతుల్లో 114 పరుగులు చేశాడు. కేవలం 44 బంతుల్లోనే శతకం పూర్తి చేసుకున్నాడు ఈ యువ సంచలనం. ఇందుల 10 ఫోర్లు, 9 సిక్సర్లు ఉన్నాయి.
తన అరంగేట్ర టీ20 మ్యాచ్‌లోనే అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా అమిత్ పాసీ ప్రపంచ రికార్డును సమం చేశాడు. 2015లో పాకిస్థాన్ ఆటగాడు బిలాల్ ఆసిఫ్ తన అరంగేట్రంలో 114 పరుగులు చేశాడు. ఇప్పుడు పాసీ ఆ రికార్డును సమం చేయడమే కాకుండా, అరంగేట్రంలోనే ఇంత భారీ స్కోరు చేసిన తొలి భారతీయ క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, టీమిండియా వికెట్ కీపర్ జితేష్ శర్మ దక్షిణాఫ్రికా సిరీస్ కోసం జాతీయ జట్టుకు ఎంపికవడంతో, బరోడా జట్టులో అతని స్థానంలో అమిత్ పాసీకి అవకాశం దక్కింది. వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకున్న ఈ యువ కెరటం, తన మొదటి మ్యాచ్‌లోనే రికార్డుల మోత మోగించాడు. బరోడా ప్రీమియర్ లీగ్‌లో కేవలం 100 పరుగులు మాత్రమే చేసినప్పటికీ, సెలెక్టర్లు అతనిపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయలేదు. భారత క్రికెట్‌కు మరో సత్తా ఉన్న వికెట్ కీపర్-బ్యాటర్ దొరికాడని క్రీడా విశ్లేషకులు ప్రశంసిస్తున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..