140 సెంచరీలు.. 36వేలకు పైగా పరుగులు.. సచిన్‌నే మించినోడు.. క్రీజులోకి దిగితే ఊచకోతే! ఎవరంటే?

|

Mar 07, 2023 | 4:56 PM

అతడు క్రీజులోకి దిగితే బౌలర్లు వణికిపోతారు. ప్రతీ షాట్ బౌండరీనే. సిక్సర్లు, ఫోర్లతో బెంబేలెత్తిస్తాడు. ఆ ప్లేయర్ మరెవరో కాదు..

140 సెంచరీలు.. 36వేలకు పైగా పరుగులు.. సచిన్‌నే మించినోడు.. క్రీజులోకి దిగితే ఊచకోతే! ఎవరంటే?
Cricket
Follow us on

అతడు క్రీజులోకి దిగితే బౌలర్లు వణికిపోతారు. ప్రతీ షాట్ బౌండరీనే. సిక్సర్లు, ఫోర్లతో బెంబేలెత్తిస్తాడు. ఆ ప్లేయర్ మరెవరో కాదు.. వెస్టిండీస్ దిగ్గజ బ్యాటర్, మాజీ కెప్టెన్ వివియన్ రిచర్డ్స్. నేడు ఆయన పుట్టినరోజు. మార్చి 7, 1952న ఆంటిగ్వాలో జన్మించిన వివియన్ రిచర్డ్స్‌కు 71 సంవత్సరాలు. 1974-91 కాలంలో అంతర్జాతీయ క్రికెట్‌ను శాసించాడు. ఈ సమయంలో అతడు అనేక రికార్డులను సృష్టించడమే కాదు.. ఎన్నో అరుదైన రికార్డులను సైతం బద్దలు కొట్టాడు. మరి ఈ దిగ్గజ ఆటగాడి క్రికెట్ కెరీర్ గురించి ఓసారి తెలుసుకుందామా.?

నిరుపేద కుటుంబంలో జన్మించిన వివియన్ రిచర్డ్స్ 18 సంవత్సరాల వయస్సులో, ఒక రెస్టారెంట్‌లో పని చేశాడు. ఆ తర్వాత ప్రపంచ క్రికెట్‌ను శాసించాడు. అతడు ఉద్యోగం చేస్తున్న సమయంలో.. రెస్టారెంట్ యజమాని డార్సీ విలియమ్స్.. రిచర్డ్స్ మంచి క్రికెటర్ అవుతాడనుకున్నాడు. ఈ క్రమంలోనే క్రికెట్ కిట్‌ను బహుమతిగా ఇచ్చాడు. ఆ తర్వాత వివియన్ రిచర్డ్స్ సెయింట్ జాన్స్ క్రికెట్ క్లబ్‌లో చేరి.. డొమెస్టిక్ క్రికెట్‌లో సంచలనాలు సృష్టించాడు. అనంతరం 3 ఏళ్ల తర్వాత వెస్టిండీస్ జాతీయ జట్టులోకి అరంగేట్రం చేశాడు.

వివియన్ టెస్ట్ కెరీర్ మొదట నెమ్మదిగా సాగింది. 1974 సంవత్సరంలో, ఈ ఆటగాడు 3 మ్యాచ్‌లలో 261 పరుగులు చేశాడు. ఆ తర్వాతి సంవత్సరంలో వివియన్ 19 సగటుతో 210 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అనంతరం రిచర్డ్స్ విజృంభించాడు. 1976లో, వివియన్ 7 సెంచరీలు కొట్టాడు. అతడి బ్యాట్ 90 సగటుతో 1710 పరుగులు చేసింది.

వివియన్ రిచర్డ్స్ మొత్తంగా 121 టెస్ట్ మ్యాచ్‌ల్లో 50కి పైగా సగటుతో 8540 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతడి బ్యాట్ నుంచి 24 సెంచరీలు, 45 అర్ధ సెంచరీలు, 3 డబుల్ హండ్రడ్స్ వచ్చాయి. అటు వన్డేల్లో ఈ ఆటగాడు 6721 పరుగులు చేశాడు. ఇందులో 11 సెంచరీలు, 45 అర్ధ సెంచరీలు ఉన్నాయి.

ఇక వివియన్ ఫస్ట్ క్లాస్ కెరీర్ విషయానికొస్తే.. మొత్తం 507 మ్యాచ్‌లలో 36212 పరుగులు చేశాడు. ఇందులో 114 సెంచరీలు ఉన్నాయి. ఇక లిస్ట్-ఏలో ఈ ఆటగాడు 26 సెంచరీలతో 16995 పరుగులు చేశాడు. ఇలా రిచర్డ్స్ తన క్రికెట్ కెరీర్‌లో మొత్తం 140 సెంచరీలు సాధించాడు. కాగా, వివియన్ రిచర్డ్స్ గొప్ప బ్యాట్స్‌మెన్ మాత్రమే కాదు.. అద్భుతమైన కెప్టెన్ కూడా. 50 టెస్టు మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించిన రిచర్డ్స్.. 27 మ్యాచ్‌ల్లో తన జట్టుకు విజయాన్ని అందించాడు. కేవలం 8 టెస్టుల్లో ఓటమిని ఎదుర్కున్నాడు. అయితే వివియన్ రిచర్డ్స్ మాత్రం కెప్టెన్‌గా ఏ టెస్టు సిరీస్‌ను కోల్పోలేదు.