
Kolkata Knight Riders: ఐపీఎల్ 2026 మినీ-వేలానికి ముందు కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) తమ రిటెన్షన్ జాబితాపై ఆలోచిస్తున్న తరుణంలో, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ ఒక సంచలన సలహా ఇచ్చారు. స్టార్ ఇండియన్ ఆల్‌రౌండర్ వెంకటేష్ అయ్యర్‌ను జట్టులో కొనసాగించాలని ఫించ్ సూచించినప్పటికీ, అతని ప్రస్తుత ధర ₹23.75 కోట్లతో కాదు అనే షరతు పెట్టడం గమనార్హం. దీని వెనుక ఉన్న వ్యూహాత్మక ట్విస్ట్ ఏమిటంటే, అయ్యర్‌ను వేలంలోకి పంపి, తక్కువ ధరకు తిరిగి కొనుగోలు చేయాలని ఫించ్ సూచించాడన్నమాట.
వెంకటేష్ అయ్యర్ కోల్‌కతా జట్టులో అత్యంత ఖరీదైన ఆటగాడిగా ఉన్నాడు (రూ. 23.75 కోట్లు). గత IPL 2025 సీజన్‌లో అతను 11 మ్యాచ్‌లలో కేవలం 142 పరుగులు మాత్రమే చేశాడు. ఈ నేపథ్యంలో ఫించ్ మాట్లాడుతూ.. “వెంకటేష్ అయ్యర్ లాంటి ఆటగాడికి రూ. 23.75 కోట్లు చెల్లించడం చాలా ఎక్కువ. ముఖ్యంగా అతని బౌలింగ్‌ను సరిగ్గా ఉపయోగించుకోకుండా కేవలం మిడిల్-ఆర్డర్ బ్యాటర్‌గా అతన్ని వాడుతున్నారు” అంటూ సూచించాడు.
కోల్‌కతా 2024లో టైటిల్ గెలవడంలో అయ్యర్ కీలక పాత్ర పోషించినప్పటికీ, అతని స్థానం స్థిరంగా లేకపోవడం, అతని అధిక ధర జట్టు సమతుల్యతకు సరిపోవడం లేదని ఫించ్ వాదించారు.
అయ్యర్‌ను విడుదల చేయడం ద్వారా కేకేఆర్ పర్స్‌లో పెద్ద మొత్తంలో డబ్బు (సుమారు ₹23.75 కోట్లు) ఖాళీ అవుతుంది. గత వేలంలో KKR వద్ద కేవలం రూ. 0.05 కోట్లు మాత్రమే మిగిలాయి. వేలంలో అయ్యర్‌ను తిరిగి కొనుగోలు చేయడానికి KKR ప్రయత్నించాలి. అతని ప్రస్తుత టీమ్ రోల్‌కు తగిన మరింత సమర్థనీయమైన ధరకు అయ్యర్‌ను తిరిగి దక్కించుకోవచ్చు.
కాగా, కేకేఆర్ తమ నిధుల కొరతను అధిగమించి, జట్టులోని ఇతర లోటుపాట్లను సరిదిద్దుకోవడానికి ఈ అదనపు పర్స్‌ను ఉపయోగించవచ్చని ఫించ్ సూచించారు. రింకూ సింగ్ (రూ.13 కోట్లు) కేకేఆర్‌లో అయ్యర్ తర్వాత రెండో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..