
Kadapa Cricket Stadium: చుట్టూ ఎత్తైన కొండలు, కంటికి పచ్చదనం పరిచే వాతావరణం, అంతర్జాతీయ ప్రమాణాలతో మెరిసిపోతున్న పిచ్.. ఈ దృశ్యాలు చూస్తుంటే హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాల స్టేడియమో లేదా న్యూజిలాండ్ మైదానమో గుర్తొస్తుందా? అయితే మీరు పొరబడినట్లే! పకృతి ఒడిలో పరవళ్లు తొక్కుతున్న ఈ అద్భుతమైన క్రికెట్ మైదానం మరెక్కడో లేదు, మన ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ హృదయమైన కడప జిల్లాలోనే ఉంది.
ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా ఒక అద్భుతమైన వీడియో తెగ వైరల్ అవుతోంది. పచ్చని కొండల మధ్య నిర్మించిన ఒక సుందరమైన క్రికెట్ స్టేడియం డ్రోన్ దృశ్యాలు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. అసలు మన దేశంలో ఇలాంటి లొకేషన్‌లో ఇంత మంచి స్టేడియం ఉందా అని చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరైతే ఇది విదేశాల్లోని మైదానమేమో అని భ్రమపడుతున్నారు. కానీ ఇది వందకు వంద శాతం మన కడప వైఎస్ రాజారెడ్డి క్రికెట్ స్టేడియం అని తెలియడంతో తెలుగు క్రీడా అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (APL) మ్యాచ్‌లు ప్రస్తుతం ఈ వేదికగా జరుగుతుండటంతో ఈ మైదానం విశేషాలు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాయి. ఈ టోర్నీ పుణ్యమా అని దేశవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ప్రేమికులకు ఆంధ్రాలోని ఈ అందమైన క్రీడా ప్రాంగణం గురించి తెలిసింది. ఇక్కడి లొకేషన్ చూసిన వారంతా ఇది భారతదేశంలోనే అత్యంత అందమైన మైదానాల్లో ఒకటిగా నిలుస్తుందని ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
కడప నగరానికి దాదాపు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న పుట్లంపల్లె ప్రాంతంలోని రిమ్స్ ఆసుపత్రి సమీపంలో ఈ స్టేడియం కొలువై ఉంది. ప్రస్తుతం ఈ మైదానంలో ఒకేసారి 15 వేల మంది ప్రేక్షకులు కూర్చుని మ్యాచ్‌లను ప్రత్యక్షంగా వీక్షించేలా గ్యాలరీలను తీర్చిదిద్దారు. కేవలం బాహ్య సౌందర్యమే కాకుండా, ఆట పరంగానూ ఈ మైదానం ఎంతో ప్రత్యేకమైనది.
ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లను అత్యంత సులువుగా నిర్వహించేందుకు వీలుగా ఇక్కడ 85 గజాల భారీ బౌండరీ లైన్‌ను ఏర్పాటు చేశారు. అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగా రూపొందించిన పిచ్, నాణ్యమైన అవుట్‌ఫీల్డ్ క్రీడాకారులకు సరికొత్త అనుభూతిని ఇస్తున్నాయి. దీనితో పాటు ఇక్కడే ఒక అధునాతన రెసిడెన్షియల్ క్రికెట్ అకాడమీ కూడా నడుస్తోంది. ఇది భవిష్యత్తులో రాయలసీమ ప్రాంతం నుంచి ఎంతో మంది ప్రతిభావంతులైన యువ క్రికెటర్లను జాతీయ స్థాయికి పరిచయం చేయడానికి దోహదపడుతోంది.
కడప క్రికెట్ స్టేడియం అద్భుత దృశ్యాలను చూసిన నెటిజన్లు, మాజీ క్రీడాకారులు సోషల్ మీడియా ద్వారా ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్‌కు కొన్ని కీలక సూచనలు చేస్తున్నారు. ఈ మైదానాన్ని మరింతగా ఆధునీకరించి, ప్రేక్షకుల కూర్చునే సామర్థ్యాన్ని పెంచితే ఇక్కడ అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్‌లు, వన్డేలు, ఐపీఎల్ మ్యాచ్‌లను కూడా ఘనంగా నిర్వహించవచ్చని అభిప్రాయపడుతున్నారు. ప్రకృతి అందాల నడుమ మ్యాచ్ వీక్షించే అనుభూతిని క్రికెట్ అభిమానులకు అందించడానికి ఈ వేదిక ఎంతో అనుకూలమైనదని వారు స్పష్టం చేస్తున్నారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..