Video: జిమ్మీ పేరుతో కెలికిన బెయిర్‌స్టో.. గట్టిగా ఇచ్చిపడేసిన గిల్‌.. సర్ఫరాజ్ ఎంట్రీతో ముదిరిన మాటల యుద్ధం..

IND vs ENG: ధర్మశాల టెస్ట్ మ్యాచ్ మూడో రోజు ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్‌లో జానీ బెయిర్‌స్టో, శుభ్‌మన్ గిల్ మధ్య గొడవ జరిగింది. ఇందులో సర్ఫరాజ్ ఖాన్ కూడా ఎంట్రీ ఇవ్వడంతో ఈ వ్యవహారం మరింత ముదిరింది. దీనికి సంబంధించిన వీడియో వైరలవుతోంది.

Video: జిమ్మీ పేరుతో కెలికిన బెయిర్‌స్టో.. గట్టిగా ఇచ్చిపడేసిన గిల్‌.. సర్ఫరాజ్ ఎంట్రీతో ముదిరిన మాటల యుద్ధం..
Bairstow Gill Heated Words

Updated on: Mar 09, 2024 | 3:49 PM

India Vs England 5th Test: ధర్మశాలలో భారత్‌తో జరిగిన ఐదో, చివరి టెస్టులో ఇంగ్లండ్ మూడో రోజునే ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 218 పరుగులకు ఆలౌట్ అయింది. దీనికి సమాధానంగా భారత్ తన తొలి ఇన్నింగ్స్‌ను 477 పరుగుల వద్ద ముగించింది. ఈ విధంగా భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 259 పరుగుల భారీ ఆధిక్యం సాధించింది. ఇటువంటి పరిస్థితిలో ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లోనూ పేలవ ప్రదర్శన కొనసాగించింది. బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు ఇంగ్లండ్ జట్టుపై ఒత్తిడి ఉంది. ఈ ఒత్తిడి కారణంగా, ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్స్ ఒక్కొక్క వికెట్ కోల్పోతూనే ఉన్నారు. అయితే, ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ సమయంలో కీలక సన్నివేశం చోటు చేసుకుంది. ఈ సమయంలో ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్ బెయిర్ స్టో భారత ఫ్యూచర్ స్టార్‌తో మాటల యుద్దానికి దిగాడు.

ఈ సమయంలో ఇంగ్లండ్ 36 పరుగుల వద్ద మూడు వికెట్లు కోల్పోయింది. దీని తర్వాత, తన 100వ టెస్ట్ ఆడుతున్న జానీ బెయిర్‌స్టో బజ్ బాల్ గేమ్ మొదలుపెట్టాడు. కానీ, బెయిర్‌స్టో ఈ తుఫాన్ ఇన్నింగ్స్ ఎక్కువసేపు నిలవలేదు. అతడిని 39 పరుగుల వద్ద కుల్దీప్ యాదవ్ అవుట్ చేశాడు. అయితే, ఈ సమయంలో అలాంటి ఘటనే చోటు చేసుకోగా, దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

బెయిర్‌స్టో, గిల్‌ మాటల యుద్దం..

జానీ బెయిర్‌స్టో రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు, అతను శుభమాన్ గిల్‌తో వాగ్వాదానికి దిగాడు. బెయిర్‌స్టో మొదట గిల్‌ని వెటకారపు మాటలతో ఆటపట్టించాడు. జేమ్స్ ఆండర్సన్‌ను తక్కువ అంచనా వేశావా. ఆయన అలసిపోయాడనుకున్నావా. నిన్ను ఔట్ చేశాడు కదా అంటూ వెక్కిరించాడు. ఆ తర్వాత, గిల్ కూడా మౌనం వహించలేదు. అతను కూడా తిరిగి స్పందించాడు. నాకేం కాలేదు కదా.. 100 పరుగులు చేసిన తర్వాత నన్ను అవుట్ చేశాడు, మీరు ఇక్కడ ఎన్ని సెంచరీలు సాధించారంటూ ఘాటుగా స్పందించాడు.

సర్ఫరాజ్ కూడా..

బెయిర్‌స్టో, శుభ్‌మాన్ మధ్య వాగ్వాదం జరుగుతుండగా, సర్ఫరాజ్ ఖాన్ కూడా మధ్యలో ఎంటరయ్యాడు. బెయిర్‌స్టోతో మాట్లాడుతూ.. చేసింది కొన్ని పరుగులే.. కానీ, ఎగిరి ఎగిరి పడుతున్నావ్ అంటూ ఇచ్చిపడేశాడు. ఈ వాగ్వాదం తర్వాత బెయిర్ స్టో కుల్దీప్ బౌలింగ్‌లో 39 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద పెవిలియన్ చేరాడు. మొత్తానికి గిల్, సర్ఫరాజ్ ఇద్దరూ కలిసి బెయిర్ స్టో మాటల దాడికి తగిని సమాధానం ఇచ్చారు.

ఇంగ్లండ్‌తో జరుగుతున్న ధర్మశాల టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో గిల్ సెంచరీ సాధించాడు. 110 పరుగుల ఇన్నింగ్స్ ఆడి అవుటయ్యాడు. ఈ సిరీస్‌లో రెండో సెంచరీ సాధించాడు. టెస్టుల్లో శుభ్‌మన్ గిల్‌కి ఇది నాలుగో సెంచరీ. ఇంగ్లండ్‌తో జరిగిన ఈ ఐదు టెస్టుల సిరీస్‌లో శుభ్‌మన్ 400 పరుగులు కూడా పూర్తి చేశాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..