
Ishan Kishan vs Zeeshan Ansari Video: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 సీజన్ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టు ముమ్మరంగా సిద్ధమవుతోంది. గత సీజన్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేక లీగ్ దశలోనే నిష్క్రమించిన ఆరెంజ్ ఆర్మీ, ఈసారి ఎలాగైనా టైటిల్ గెలవాలనే పట్టుదలతో ఉంది. అయితే, సీజన్ ఆరంభానికి ముందే జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. వెన్ను గాయం కారణంగా రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ తొలి కొన్ని మ్యాచ్‌లకు అందుబాటులో ఉండటం లేదు. దీంతో జట్టు యాజమాన్యం తాత్కాలిక సారథ్య బాధ్యతలను స్టార్ ఓపెనర్ ఇషాన్ కిషన్‌కు అప్పగించింది.
ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జట్టు సభ్యులు రెండు టీంలుగా విడిపోయి ప్రాక్టీస్ మ్యాచ్ ఆడారు. ఈ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ అద్భుతమైన ఫామ్‌లో కనిపించాడు. బౌండరీల వర్షం కురిపిస్తూ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని సెంచరీ దిశగా దూసుకెళ్తున్నాడు. ఈ క్రమంలో ఇన్నింగ్స్ ఎనిమిదో ఓవర్ వేసిన స్పిన్నర్ జీషన్ అన్సారీ బౌలింగ్‌లో ఇషాన్ తొలి నాలుగు బంతుల్లో రెండు సిక్సర్లు, రెండు ఫోర్లు బాదాడు.
అయితే, అదే ఓవర్ ఐదో బంతికి అన్సారీ ఒక తెలివైన ఫుల్ డెలివరీతో ఇషాన్‌ను బోల్తా కొట్టించాడు. స్క్వేర్ లెగ్ వైపు భారీ షాట్‌కు ప్రయత్నించిన ఇషాన్ అక్కడ ఉన్న ఫీల్డర్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. వికెట్ తీసిన వెంటనే జీషన్ అన్సారీ అత్యుత్సాహం ప్రదర్శించాడు. ఇషాన్ కిషన్ వైపు వేలు చూపిస్తూ, ‘నువ్వు అవుట్ అయ్యావు, ఇక వెళ్ళిపో’ అన్నట్లుగా దురుసుగా సైగ చేశాడు. కెప్టెన్ అని కూడా చూడకుండా ఒక యువ ఆటగాడు ఇలా ప్రవర్తించడం చూసి మైదానంలోని వారు, అభిమానులు షాక్‌కు గురయ్యారు.
అన్సారీ అంతలా రెచ్చిపోయినప్పటికీ, ఇషాన్ కిషన్ మాత్రం చాలా హుందాగా వ్యవహరించాడు. అతని ప్రవర్తనను సీరియస్‌గా తీసుకోకుండా కేవలం నవ్వుతూ పెవిలియన్ వైపు నడిచాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇది కేవలం ఆటలో భాగంగా జరిగిన సరదా సంఘటనా లేక జట్టు సభ్యుల మధ్య నిజంగానే ఏవైనా విభేదాలు ఉన్నాయా అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..