గ్యాప్ తీసుకున్నాడని టీమిండియా నుంచి తీసేశారు.. కట్‌చేస్తే.. తుఫాన్ ఇన్నింగ్స్‌తో సెలెక్టర్లకు ఇచ్చిపడేశాడుగా

Ishan Kishan Played in County Cricket: భారత వికెట్ కీపర్ కం బ్యాట్స్‌మన్ ఇషాన్ కిషన్ విదేశీ జట్టు తరపున అరంగేట్రం చేస్తూ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. టీమ్ ఇండియాలో అవకాశం రాకపోవడంతో అతను ఈ జట్టులో చేరాడు. ప్రత్యేకత ఏమిటంటే అతను ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో ఆడుతున్నాడు.

గ్యాప్ తీసుకున్నాడని టీమిండియా నుంచి తీసేశారు.. కట్‌చేస్తే.. తుఫాన్ ఇన్నింగ్స్‌తో సెలెక్టర్లకు ఇచ్చిపడేశాడుగా
Ishan Kishan

Updated on: Jun 23, 2025 | 6:45 PM

Ishan Kishan Played in County Cricket: ఇషాన్ కిషన్ తీసుకున్న గ్యాప్ కారణంగా టీమిండియా నుంచి బయటకు పంపించేశారు. ఆ తర్వాత భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ, సెలెక్టర్లు మాత్రం అతనిని పట్టించుకోవడం లేదు. తాజాగా భారత్, ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్‌లోనూ అతనిని పరిగణించలేదు. భారత జట్టులోకి పునరాగమనం కోసం తీవ్రంగా శ్రమిస్తున్న యువ డైనమైట్, వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ ఇషాన్ కిషన్ తన లక్ష్యం దిశగా బలమైన అడుగు వేశాడు. ఇంగ్లష్ కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో తన అరంగేట్ర మ్యాచ్‌లోనే అద్భుతమైన ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. నాటింగ్‌హామ్‌షైర్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్, యార్క్‌షైర్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 13 పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకున్నప్పటికీ, 87 పరుగుల దూకుడైన ఇన్నింగ్స్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు.

కౌంటర్‌ అటాకింగ్‌తో అదరగొట్టిన వైనం..

ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో, నాటింగ్‌హామ్‌షైర్ జట్టు కాస్త కష్టాల్లో ఉన్నప్పుడు ఇషాన్ కిషన్ క్రీజ్‌లోకి వచ్చాడు. తన సహజసిద్ధమైన దూకుడును ప్రదర్శిస్తూ, ప్రత్యర్థి బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. ఇంగ్లండ్ పరిస్థితులకు కొత్త అయినప్పటికీ, ఏమాత్రం బెరుకు లేకుండా స్వేచ్ఛగా బ్యాట్ ఝుళిపించాడు. కేవలం 98 బంతులు ఎదుర్కొన్న కిషన్, తన ఇన్నింగ్స్‌లో 12 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 87 పరుగులు సాధించాడు. అతని దూకుడైన బ్యాటింగ్‌తో నాటింగ్‌హామ్ షైర్ జట్టు పటిష్టమైన స్కోరు దిశగా పయనించింది.

తొలి రోజు ఆట ముగిసే సమయానికి 44 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన కిషన్, రెండో రోజు కూడా అదే జోరును కొనసాగించాడు. సునాయాసంగా సెంచరీ పూర్తి చేసేలా కనిపించినప్పటికీ, డొమ్ బెస్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి ఔటయ్యాడు. శతకం మిస్ అయినప్పటికీ, అతని పోరాట పటిమ, దూకుడైన ఆటతీరు క్రీడా విశ్లేషకుల నుంచి ప్రశంసలు అందుకుంటోంది.

ఇవి కూడా చదవండి

టెస్ట్ జట్టులో చోటే లక్ష్యంగా..

గత కొంతకాలంగా బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోయి, జాతీయ జట్టుకు దూరమైన ఇషాన్ కిషన్, తన కెరీర్‌ను తిరిగి గాడిలో పెట్టుకునేందుకు కౌంటీ క్రికెట్‌ను ఎంచుకున్నాడు. ముఖ్యంగా టెస్ట్ క్రికెట్‌లో తన సత్తా చాటాలని, సుదీర్ఘ ఫార్మాట్‌కు తాను కూడా సరిపోతానని నిరూపించుకోవాలని భావిస్తున్నాడు. ఈ నేపథ్యంలో, కఠినమైన ఇంగ్లీష్ పిచ్‌లపై ఆడిన ఈ ఇన్నింగ్స్ అతని ఆత్మవిశ్వాసాన్ని పెంచడమే కాకుండా, సెలక్టర్ల దృష్టిని ఆకర్షించే అవకాశం ఉంది.

మొత్తంమీద, తన కౌంటీ ప్రయాణాన్ని ఒక అద్భుతమైన ఇన్నింగ్స్‌తో ప్రారంభించిన ఇషాన్ కిషన్, రాబోయే మ్యాచ్‌లలో కూడా ఇదే ఫామ్‌ను కొనసాగించి, త్వరలోనే భారత జట్టు జెర్సీలో కనిపించాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..