
Irfan Pathan:టీమ్ ఇండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్, ఇటీవల ఒక ఇంటర్వ్యూలో సంచలన విషయాలు వెల్లడించారు. ఐపీఎల్ 2025 కామెంటరీ ప్యానెల్ నుంచి తనను తొలగించడం వెనుక ఉన్న అసలు కారణం రోహిత్ శర్మ లేదా విరాట్ కోహ్లీ కాదని ఆయన స్పష్టం చేశారు. ఒక ఆటగాడిని నిర్మొహమాటంగా విమర్శించినందుకే తాను ప్యానెల్ నుంచి తొలగించబడ్డానని ఇర్ఫాన్ పఠాన్ తెలిపారు. ఆ ఆటగాడు మరెవరో కాదు, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా అని ఇర్ఫాన్ వెల్లడించారు.
ది లల్లన్‌టాప్ అనే వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇర్ఫాన్ పఠాన్ ఐపీఎల్ 2025 కామెంటరీ ప్యానెల్ నుంచి తనను తీసివేయడం వెనుక హార్దిక్ పాండ్యా హస్తం ఉండవచ్చని సూచించారు. ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా మొదటి సీజన్‌లోనే అతని ప్రదర్శనపై ఇర్ఫాన్ పఠాన్ విమర్శలు చేశారు. ఇవే హార్దిక్ అహంకారాన్ని దెబ్బతీసి ఉండవచ్చని ఇర్ఫాన్ అభిప్రాయపడ్డారు. ఒక కామెంటేటర్‌గా, ఆటగాళ్ల ఆటను నిష్పక్షపాతంగా విశ్లేషించడం తన బాధ్యత అని ఇర్ఫాన్ స్పష్టం చేశారు. “నేను 14 మ్యాచ్‌లలో 7 మ్యాచ్‌లలో విమర్శిస్తున్నానంటే, నేను చాలా మర్యాదగా ఉన్నట్లే. ఇదే మా పని” అని ఆయన అన్నారు. క్రికెట్‌లో విమర్శలు సహజం అని కూడా చెప్పారు.
ఇర్ఫాన్ పఠాన్, హార్దిక్ పాండ్యాల మధ్య వ్యక్తిగతంగా ఎలాంటి వైరం లేదని ఇర్ఫాన్ పఠాన్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. “నా తర్వాత బరోడా నుంచి వచ్చిన ఆటగాళ్లు – దీపక్ హుడా, కృనాల్ పాండ్యా లేదా హార్దిక్ పాండ్యా.. వీరిలో ఎవరూ ఇర్ఫాన్-యూసుఫ్ తమకు సహాయం చేయలేదని చెప్పలేరు,” అని ఇర్ఫాన్ వివరించారు. గతంలో హార్దిక్‌కు సపోర్టుగా నిలిచిన సందర్భాలను కూడా ఆయన గుర్తు చేసుకున్నారు. ముంబై ఇండియన్స్ కెప్టెన్సీని కోల్పోయిన తర్వాత రోహిత్ శర్మ అభిమానులు హార్దిక్‌పై విమర్శలు చేసినప్పుడు, ఇర్ఫాన్ పఠాన్ అతనికి మద్దతుగా మాట్లాడారు.
“ఒక ఆటగాడిని విమర్శించడంలో తప్పు లేదు. మీరు ఆడితే, ఇవన్నీ భరించాల్సి ఉంటుంది. ఇది సునీల్ గవాస్కర్, దిగ్గజం సచిన్ టెండూల్కర్‌కు కూడా జరిగింది. కానీ వారు ఎప్పుడూ తమను ఆట కంటే గొప్పగా భావించుకోలేదు” అని ఇర్ఫాన్ అన్నారు. ” అయితే, హార్దిక్‌పై ఉపయోగించిన అసభ్య పదజాలానికి నేను వ్యతిరేకం” అని ఆయన అన్నారు. ఇర్ఫాన్ పఠాన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు క్రికెట్ వర్గాలలో పెద్ద చర్చకు దారితీశాయి.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..