IRE Vs NZ: చేయాల్సింది 20 పరుగులు.. చేతిలో 1 వికెట్.. 6 బంతుల్లో నరాలు తెగ ఉత్కంఠ.. సీన్ కట్ చేస్తే!

|

Jul 11, 2022 | 10:19 AM

క్రికెట్ చరిత్రలో ఉత్కంఠభరితమైన క్షణాలు ఎన్నో ఉన్నాయి. అసాధ్యం కాని టార్గెట్స్‌ను సుసాధ్యం చేసి చూపించారు పలువురు బ్యాటర్లు..

IRE Vs NZ: చేయాల్సింది 20 పరుగులు.. చేతిలో 1 వికెట్.. 6 బంతుల్లో నరాలు తెగ ఉత్కంఠ.. సీన్ కట్ చేస్తే!
Bracewell
Follow us on

క్రికెట్ చరిత్రలో ఉత్కంఠభరితమైన క్షణాలు ఎన్నో ఉన్నాయి. అసాధ్యం కాని టార్గెట్స్‌ను సుసాధ్యం చేసి చూపించారు పలువురు బ్యాటర్లు. ఐర్లాండ్, న్యూజిలాండ్ మధ్య జరిగిన మొదటి వన్డేలో థ్రిల్లింగ్ ఫినిష్‌ను చూశారు అభిమానులు. లాస్ట్ ఓవర్‌లో కివీస్ గెలిచేందుకు 20 పరుగులు అవసరం కాగా.. అప్పుడు క్రీజులో బ్యాటింగ్ చేస్తోన్న బ్రేస్‌వెల్ బ్యాట్‌తో మ్యాజిక్ చేశాడు. అసాధ్యం అనుకున్న టార్గెట్‌ను సుసాధ్యం చేసి జట్టుకు అద్భుత విజయాన్ని అందించడంలో సహాయపడ్డాడు.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ న్యూజిలాండ్‌కు 301 పరుగుల లక్ష్యచేధనను నిర్దేశించింది. ఇక ఆ టార్గెట్‌ను చేధించే క్రమంలో కివీస్ జట్టు ధీటుగా బదులిచ్చింది. కాని ఆ టీం విజయం సాధించేందుకు చివరి ఓవర్‌లో 20 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో 1 వికెట్ మాత్రమే ఉంది. ఇంతటి అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించాడు కివీస్ బ్యాటర్ బ్రేస్‌వెల్(103). ఇప్పటివరకు వన్డే క్రికెట్‌ చరిత్రలో ఏ జట్టు కూడా 50వ ఓవర్‌లో 20 పరుగులను చేధించలేదు. అయితే ఆ అసాధ్యమైన ఫీట్ మైకేల్ బ్రేస్‌వెల్ సుసాధ్యమయ్యేలా చేయడమే కాకుండా.. న్యూజిలాండ్‌కు అద్భుత విజయాన్ని అందించాడు.

చివరి ఓవర్‌లో నరాలు తెగే ఉత్కంఠ..

6 బంతుల్లో చేయాల్సింది 20 పరుగులు.. చేతిలో ఉన్నది 1 వికెట్.. క్రీజులో బ్రేస్‌వెల్.. రన్ తీస్తే ఎక్కడ వికెట్ పోతుందనుకున్నాడో.. ఏమో.. ఈ కివీస్ బ్యాటర్ చివరి ఓవర్‌లో చితక్కొట్టాడు. తొలి బంతికి ఫైన్‌ లెగ్‌ ద్వారా ఫోర్‌.. ఆ తర్వాత బంతికి ఫైన్ లెగ్, స్క్వేర్ లెగ్ మధ్య నుంచి మరో ఫోర్.. మూడో బంతికి డీప్ మిడ్ వికెట్ ద్వారా అద్భుతమైన సిక్స్.. నాలుగో బంతిని డీప్ స్క్వేర్ లెగ్ వైపుగా బౌండరీకి మళ్లించాడు.. 5వ బంతికి లాంగ్ ఆన్‌లో సిక్స్ కొట్టడంతో.. న్యూజిలాండ్‌ అద్భుత విజయాన్ని అందుకుంది. కాగా, 82 బంతుల్లో 7 సిక్సర్లు, 10 ఫోర్లతో 127 పరుగులతో అజేయంగా నిలిచిన మైకేల్ బ్రేస్‌వెల్‌ హీరో ఆఫ్‌ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.