
IPL 2026 Playoffs : ఐపీఎల్ 2026 లీగ్ స్టేజ్ ముగింపు దశకు చేరుకోవడంతో.. అభిమానుల్లో టెన్షన్ పీక్స్‌కు చేరింది. టోర్నమెంట్‌లో ఇప్పటికే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), గుజరాత్ టైటాన్స్ (GT), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్లు ప్లేఆఫ్స్ లో తమ స్థానాలను ఖాయం చేసుకున్నాయి. ఇక మిగిలింది కేవలం ఒక్కటంటే ఒక్కటే స్లాట్. ఈ ఒక్క ఖాళీ సీటు కోసం ఏకంగా ఐదు జట్లు (రాజస్థాన్, పంజాబ్, కోల్‌కతా, చెన్నై, ఢిల్లీ) ప్రాణాలు పెట్టేందుకు సిద్ధమవుతున్నాయి. అయితే, ఈ ప్లేఆఫ్స్ రేసును శాసించే అసలైన సీక్రెట్ లాక్ మాత్రం కేవలం ఒక్క రాజస్థాన్ రాయల్స్ చేతిలోనే ఉండటం ఇప్పుడు నెట్టింట పెద్ద హాట్ టాపిక్‌గా మారింది.
మిగిలిన నాలుగు జట్లు గెలిచినా నో యూజ్
ఐపీఎల్ లీగ్ దశలో కేవలం 5 మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. పాయింట్ల పట్టికలోని సమీకరణాలు ఎంత గందరగోళంగా ఉన్నాయంటే.. రాజస్థాన్ రాయల్స్ మినహా మిగిలిన నాలుగు జట్లు తమ చివరి మ్యాచ్‌లలో భారీ తేడాతో గెలిచినా కూడా మే 24 (ఆదివారం) రాత్రి వరకు ప్లేఆఫ్స్ బెర్త్ ఖాయం చేసుకోలేవు. చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు ప్రస్తుతం పూర్తిగా ఇతర జట్ల ఓటములపై, నెట్ రన్ రేట్ (NRR) పైనే ఆధారపడి బతుకుతున్నాయి.
రాజస్థాన్ రాయల్స్ రూటే సెపరేటు..
ప్లేఆఫ్స్ రేసులో ఉన్న మిగిలిన 5 జట్లలో కేవలం రాజస్థాన్ రాయల్స్ (RR) మాత్రమే సొంత శక్తితో 16 పాయింట్ల మార్కును తాకగలదు. ప్రస్తుతం రాజస్థాన్ 13 మ్యాచ్‌లలో 14 పాయింట్లతో 4వ స్థానంలో సేఫ్‌గా ఉంది. మే 24న జరగబోయే తమ చివరి లీగ్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు ముంబై ఇండియన్స్‌ను ఓడించిందంటే చాలు.. ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా నేరుగా 16 పాయింట్లతో ప్లేఆఫ్స్ లోకి దూసుకెళ్తుంది. రాజస్థాన్ గెలిచిన మరుక్షణమే మిగిలిన నాలుగు జట్ల ఆశలపై అధికారికంగా నీళ్లు చల్లినట్లవుతుంది.
ఒకవేళ రాజస్థాన్ ఓడిపోతేనే..
ఒకవేళ మే 24 నాటి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ చేతిలో రాజస్థాన్ రాయల్స్ ఓడిపోతేనే.. మిగిలిన జట్లకు అదృష్టం తలుపు తడుతుంది.
పంజాబ్, కోల్‌కతా లెక్కింపు: ప్రస్తుతం పంజాబ్ కింగ్స్, కేకేఆర్ జట్లు 13 పాయింట్లతో ఉన్నాయి. తమ చివరి మ్యాచ్ గెలిస్తే ఇవి గరిష్టంగా 15 పాయింట్లకు చేరుకుంటాయి. రాజస్థాన్ ఓడిపోతే, ఈ రెండింటిలో మెరుగైన రన్ రేట్ ఉన్న జట్టు 4వ స్థానానికి వెళ్తుంది.
చెన్నై, ఢిల్లీల లెక్క: చెన్నై సూపర్ కింగ్స్ , ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు 12 పాయింట్లతో ఉన్నాయి. ఇవి తమ చివరి మ్యాచ్ గెలిచినా 14 పాయింట్ల వద్దే ఆగుతాయి. కాబట్టి రాజస్థాన్ భారీ తేడాతో ఓడిపోవాలి, అలాగే పంజాబ్, కేకేఆర్ కూడా తమ మ్యాచ్‌ల్లో ఓడిపోతేనే చెన్నై, ఢిల్లీలకు రన్ రేట్ ఆధారంగా కొద్దిపాటి అవకాశం ఉంటుంది.