IPL 2026: చించేస్తారని కెప్టెన్ పోస్ట్ ఇస్తే.. ఫ్రాంచైజీలకే వెన్నుపోటు పోడిచిన ముగ్గురు..!

IPL Captaincy Changes: ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రస్తుత సీజన్ ముగింపు దశకు చేరుకుంటున్న వేళ కొన్ని జట్లలో పెను మార్పులు చోటుచేసుకోనున్నాయి. వరుస పరాజయాలతో కుంగిపోతున్న మూడు ప్రధాన జట్లు తమ నాయకత్వ బాధ్యతల నుంచి ప్రస్తుత కెప్టెన్లను తప్పించే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ జాబితాలో టీమ్ ఇండియా స్టార్ ఆటగాళ్లు ఉండటం గమనార్హం.

IPL 2026: చించేస్తారని కెప్టెన్ పోస్ట్ ఇస్తే.. ఫ్రాంచైజీలకే వెన్నుపోటు పోడిచిన ముగ్గురు..!
Ipl Captains

Updated on: May 14, 2026 | 3:36 PM

IPL Captaincy Changes: ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ పలువురు కెప్టెన్లకు అగ్నిపరీక్షగా మారింది. ముఖ్యంగా రిషబ్ పంత్, అజింక్యా రహానే, అక్షర్ పటేల్ తమ జట్లను ప్లేఆఫ్స్ దశకు చేర్చడంలో ఘోరంగా విఫలమయ్యారు. లక్నో సూపర్ జెయింట్స్ ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించగా, కోల్‌కతా, ఢిల్లీ జట్లు కూడా దాదాపు అదే బాటలో ఉన్నాయి. వరుసగా రెండు సీజన్ల పాటు ఆశించిన ఫలితాలు రాబట్టలేకపోవడమే వీరి పదవులకు గండంలా మారింది.

పంత్ కెప్టెన్సీపై అసంతృప్తి..

లక్నో సూపర్ జెయింట్స్ సారథి రిషబ్ పంత్ ఆటతీరు ఈసారి తీవ్ర విమర్శలకు గురైంది. భారీ ధర వెచ్చించి కొనుగోలు చేసినప్పటికీ, కెప్టెన్సీ ఒత్తిడిలో పంత్ తన సహజ సిద్ధమైన దూకుడును కోల్పోయాడు. 11 మ్యాచ్‌ల్లో కేవలం 251 పరుగులు మాత్రమే చేయడం, అందులోనూ సిక్సర్ల సంఖ్య భారీగా తగ్గడం ఫ్రాంచైజీ యజమాని సంజీవ్ గోయెంకాకు ఆగ్రహం తెప్పించినట్లు తెలుస్తోంది. జట్టు కూర్పులో పంత్ తీసుకున్న నిర్ణయాలు కూడా జట్టును దెబ్బతీశాయి.

అక్షర్ పటేల్ నాయకత్వానికి బ్రేక్..?

ఢిల్లీ క్యాపిటల్స్ తాత్కాలిక సారథిగా బాధ్యతలు చేపట్టిన అక్షర్ పటేల్ అటు బ్యాటింగ్‌లో, ఇటు బౌలింగ్‌లోనూ రాణించలేకపోయాడు. నాయకుడిగా జట్టును ముందుండి నడిపించడంలో విఫలమవడమే కాకుండా, కీలక సమయాల్లో తనను తాను తక్కువగా ఉపయోగించుకోవడం విస్మయానికి గురిచేసింది. వచ్చే ఏడాది ఢిల్లీ యాజమాన్య బాధ్యతలలో మార్పులు రానున్న నేపథ్యంలో, అక్షర్ స్థానంలో కొత్త సారథిని నియమించే అవకాశం ఉంది.

రహానే బాధ్యతల నుంచి విముక్తి..?

కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు నాయకత్వం వహిస్తున్న అజింక్యా రహానే, టీ20 ఫార్మాట్‌కు అవసరమైన వేగంతో ఆడలేకపోతున్నాడు. సీనియర్ ఆటగాడిగా అనుభవం ఉన్నప్పటికీ, ఆధునిక క్రికెట్ డిమాండ్‌ను అందుకోవడంలో ఆయన వెనుకబడ్డాడు. స్ట్రైక్ రేట్ విషయంలో వస్తున్న విమర్శలను ఆయన తోసిపుచ్చినప్పటికీ, ఫ్రాంచైజీ మాత్రం యువ రక్తాన్ని కెప్టెన్‌గా నియమించాలని భావిస్తోంది.

వచ్చే ఏడాది మెగా వేలం జరగనున్న నేపథ్యంలో, ఈ ముగ్గురు ఆటగాళ్లు తమ కెప్టెన్సీని కోల్పోవడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. కేవలం ఆటగాళ్లుగా కొనసాగుతారా లేదా కొత్త జట్లను వెతుక్కుంటారా అనేది వేచి చూడాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us