AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2027 : రాజస్థాన్ రాయల్స్‌లోకి హార్దిక్ పాండ్యా.. ముంబై జెర్సీలో కనిపించనున్న యశస్వి జైస్వాల్

IPL 2027 : ఐపీఎల్ 2027కు ముందు హార్దిక్ పాండ్యా రాజస్థాన్ రాయల్స్‌కు, యశస్వి జైస్వాల్ ముంబై ఇండియన్స్‌కు మారే అవకాశాలపై చర్చలు జోరందుకున్నాయి. రిషబ్ పంత్ ఢిల్లీ క్యాపిటల్స్‌కు రీఎంట్రీ, కేఎల్ రాహుల్ కెప్టెన్సీ, గంగూలీ-యువరాజ్ కోచింగ్ వార్తలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.

IPL 2027 : రాజస్థాన్ రాయల్స్‌లోకి హార్దిక్ పాండ్యా.. ముంబై జెర్సీలో కనిపించనున్న యశస్వి జైస్వాల్
Ipl 2027
Rakesh
|

Updated on: Jun 20, 2026 | 8:51 AM

Share

IPL 2027 : ఐపీఎల్ 2026 ముగిసిన తర్వాత కూడా క్రికెట్ అభిమానులకు ఎంటర్టైన్మెంట్ అస్సలు తగ్గడం లేదు. వచ్చే సీజన్ ఐపీఎల్ 2027కు ముందు రెండు పెద్ద ఫ్రాంచైజీల మధ్య ఆటగాళ్ల మార్పిడి (ట్రేడింగ్)కి సంబందించిన చర్చలు ఊపందుకున్నాయి. ముంబై ఇండియన్స్ స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, రాజస్థాన్ రాయల్స్ విధ్వంసకర ఓపెనర్ యశస్వి జైస్వాల్ స్థానాలను పరస్పరం మార్చుకోబోతున్నట్లు క్రీడా వర్గాల్లో గట్టి ప్రచారం సాగుతోంది. ఈ ఇద్దరు టాప్ ప్లేయర్లు జట్లు మారితే ఐపీఎల్ ఈక్వేషన్స్ పూర్తిగా మారిపోనున్నాయి.

ముంబై నుంచి తప్పుకున్న హార్దిక్ పాండ్యా

గుజరాత్ టైటాన్స్ జట్టుకు కెప్టెన్‌గా ఉండి టైటిల్ అందించిన హార్దిక్ పాండ్యా, మూడు సంవత్సరాల క్రితం భారీ ఆశలతో ముంబై ఇండియన్స్‌కు తిరిగి వచ్చాడు. రోహిత్ శర్మను కాదని యాజమాన్యం అతనికి కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది. అయితే ఐపీఎల్ 2026లో హార్దిక్ కెప్టెన్సీలో ముంబై ప్లేఆఫ్స్ కూడా చేరలేక ఘోరంగా విఫలమైంది. దీనికి తోడు ముంబై డ్రెస్సింగ్ రూమ్‌లో హార్దిక్‌కు జట్టులోని కొందరు సీనియర్ ఆటగాళ్ల నుంచి సరైన మద్దతు లభించలేదని సమాచారం. జట్టులో అంతర్గత సహకారం లోపించడంతోనే హార్దిక్ ముంబైని వీడి రాజస్థాన్ రాయల్స్ వైపు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు.

రాజస్థాన్ రాయల్స్‌ను వీడటానికి జైస్వాల్ కారణాలు

రాజస్థాన్ రాయల్స్ జట్టు తరఫున ఎన్నో అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడిన యశస్వి జైస్వాల్ ఆ జట్టు నుంచి విడిపోవడానికి కొన్ని బలమైన కారణాలు కనిపిస్తున్నాయి. రాజస్థాన్ జట్టులో జైస్వాల్ ప్రాధాన్యత మునుపటి కంటే కాస్త తగ్గినట్లు తెలుస్తోంది. సంజూ శాంసన్ తర్వాత జైస్వాల్ కెప్టెన్ అవుతాడని అందరూ భావించారు, కానీ మేనేజ్‌మెంట్ రియాన్ పరాగ్‌కు కన్నేసి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. అంతేకాకుండా ఐపీఎల్ 2026లో ఆరెంజ్ క్యాప్ గెలిచిన యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ రూపంలో రాజస్థాన్‌కు మరో పవర్‌ఫుల్ ఓపెనర్ దొరికాడు. వైభవ్ సూర్యవంశీ ఎంట్రీతో తన స్థానానికి ముప్పు వాటిల్లకుండా ఉండేందుకే జైస్వాల్ ముంబై ఇండియన్స్‌కు వెళ్లడానికి మొగ్గు చూపుతున్నాడు.

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో రీఎంట్రీ ఇవ్వనున్న రిషబ్ పంత్

మార్పులు కేవలం ముంబై, రాజస్థాన్ జట్లకే పరిమితం కాలేదు. ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లలో కూడా భారీ మార్పులు జరగబోతున్నాయి. గతంలో జట్టు మారిన వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ వచ్చే సీజన్‌లో తిరిగి ఢిల్లీ క్యాపిటల్స్ గూటికి చేరడం దాదాపు ఖాయమైంది. అలాగే ఢిల్లీ స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఆ జట్టును వీడి లక్నో సూపర్‌జెయింట్స్ జట్టు తరఫున ఆడబోతున్నట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

కేఎల్ రాహుల్ కెప్టెన్సీ.. కోచ్‌లుగా గంగూలీ, యువరాజ్ సింగ్

ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ తమ జట్టు మేనేజ్‌మెంట్‌ను కూడా పూర్తిగా ప్రక్షాళన చేయాలని భావిస్తోంది. లక్నో నుంచి తప్పుకోనున్న కేఎల్ రాహుల్‌ను ఢిల్లీ జట్టుకు కొత్త కెప్టెన్‌గా నియమించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో పాటు భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఢిల్లీ జట్టుకు హెడ్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా వ్యవహరించబోతున్నట్లు టాక్ నడుస్తోంది. ఈ మార్పులన్నీ అధికారికంగా ఖరారైతే ఐపీఎల్ 2027 మరింత రసవత్తరంగా మారడం ఖాయం.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us