IPL 2027: ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ రద్దు..? ఐపీఎల్‌ ఛైర్మన్ కీలక వ్యాఖ్యలు..!

IPL Impact Player Rule: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (Indian Premier League) తదుపరి సీజన్‌కు సంబంధించి రెండు అత్యంత కీలకమైన అంశాలపై స్పష్టత వచ్చింది. వివాదాస్పదంగా మారిన ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనపై సమీక్ష చేపట్టేందుకు బీసీసీఐ సిద్ధమవుతుండగా, గత మూడేళ్లుగా విదేశాల్లో సాగుతున్న వేలం పాటను ఈసారి స్వదేశానికి తీసుకురావాలని లీగ్ గవర్నింగ్ కౌన్సిల్ ప్రణాళికలు రచిస్తోంది.

IPL 2027: ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ రద్దు..? ఐపీఎల్‌ ఛైర్మన్ కీలక వ్యాఖ్యలు..!
Ipl Impact Player Rule

Updated on: Sep 16, 2026 | 7:55 PM

Indian Premier League: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2027 సీజన్ కోసం జరగబోయే ఆటగాళ్ల వేలం పాటను భారతదేశంలోనే నిర్వహించాలని చూస్తున్నట్లు లీగ్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ (Arun Dhumal) వెల్లడించారు. గత మూడేళ్ల కాలంలో జరిగిన వేలం ప్రక్రియలు వరుసగా దుబాయ్ (Dubai), మెగా వేలం జరిగిన జెడ్డా (Jeddah), అలాగే అబుదాబి (Abu Dhabi) నగరాల్లో పూర్తయ్యాయి. ప్రతిసారీ స్వదేశంలోనే ఈ కార్యక్రమం చేపట్టాలని ప్రయత్నిస్తున్నప్పటికీ, ఆ సమయంలో ఉండే పెళ్లిళ్ల సీజన్ దృష్ట్యా సరైన వేదిక దొరకడం కష్టంగా మారుతోందని ఆయన వివరించారు. రాబోయేది చిన్న వేలం కావడంతో వేదిక దొరికే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని, బీసీసీఐ ప్రాధాన్యతను బట్టి ఆతిథ్య నగరాన్ని ఎంపిక చేస్తామని స్పష్టం చేశారు.

ఇదే సమయంలో లీగ్‌లో ఎంతో చర్చకు దారితీసిన ఇంపాక్ట్ ప్లేయర్ (Impact Player) నిబంధన భవితవ్యంపై గవర్నింగ్ కౌన్సిల్ తాజా సమావేశంలో చర్చ జరిగింది. మ్యాచ్ సాగుతున్న ఏ దశలోనైనా ఒక ఆటగాడి స్థానంలో మరొకరిని మార్చుకునేందుకు వీలు కల్పించే ఈ విధానం 2027 వరకు కొనసాగాల్సి ఉంది. దీనిపై ఫ్రాంచైజీల తాజా అభిప్రాయాలను సైతం బోర్డు కోరింది.

భారత వన్డే, టెస్టు జట్టు సారథి శుభ్‌మన్ గిల్ (Shubman Gill), మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma), స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya), అక్షర్ పటేల్ (Axar Patel) ఇప్పటికే ఈ నిబంధన పట్ల తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ విధానం కారణంగా జట్లలో ఆల్‌రౌండర్ల పాత్ర తగ్గిపోతోందన్నది వారి ప్రధాన అభ్యంతరం. గత 2026 సీజన్‌కు ముందే ఎక్కువమంది కెప్టెన్లు తమ వ్యతిరేకతను బోర్డు దృష్టికి తీసుకెళ్లారు.

ఈ నిబంధనను సమీక్షించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సిద్ధంగా ఉందని అరుణ్ ధుమాల్ స్పష్టం చేశారు. భాగస్వాములందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న తరువాతే అంతిమ నిర్ణయం తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. సెప్టెంబర్ 18న జరగనున్న బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఐపీఎల్ ఛైర్మన్‌గా అరుణ్ ధుమాల్, గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడిగా ఖైరుల్ మజుందార్ (Khairul Majumdar) తిరిగి ఎన్నిక కానున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us