
Ravichandran Smaran: ఐపీఎల్ 2026 సీజన్ కు ముందు ప్రతి జట్టు తన వ్యూహాలను పదునుపెడుతోంది. ఈ క్రమంలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు అంతర్గతంగా రెండు జట్లుగా విడిపోయి ప్రాక్టీస్ మ్యాచ్ లను నిర్వహిస్తోంది. మార్చి 22న జరిగిన రెండో మ్యాచ్ లో ఎస్ఆర్ హెచ్ ఏ, ఎస్ఆర్ హెచ్ బీ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ ద్వారా ఆటగాళ్ల ఫామ్, కాంబినేషన్స్ ను పరీక్షించాలనే ఉద్దేశ్యం స్పష్టంగా కనిపించింది.
ఎస్ఆర్ హెచ్ ఏ జట్టు ముందుగా బ్యాటింగ్ చేసి 19.3 ఓవర్లలో 193 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్ గా వచ్చిన ఇషాన్ కిషన్ కేవలం మూడు బంతులకే క్యాచ్ ఔట్ అయ్యాడు. అతను నాలుగు పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. అయితే నితీశ్ రెడ్డి మాత్రం అద్భుతంగా ఆడి 40 బంతుల్లో 73 పరుగులు చేసి జట్టుకు బలమైన స్కోరు అందించాడు.
లక్ష్య ఛేదనలో ఎస్ఆర్ హెచ్ బీ జట్టు తరపున ఓపెనింగ్ కు వచ్చిన అభిషేక్ శర్మ మొదటి బంతికే ఔట్ కావడం ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే ఇది ప్రాక్టీస్ మ్యాచ్ కావడంతో అతనికి మరోసారి బ్యాటింగ్ చేసే అవకాశం లభించింది. ఈసారి అతను కేవలం 7 బంతుల్లో 21 పరుగులు చేసి తన స్ట్రైక్ రేట్ ను 300కు పైగా ఉంచి జట్టుకు ఉపయోగపడ్డాడు.
ఈ మ్యాచ్ లో అసలైన హీరోగా నిలిచింది 22 ఏళ్ల రవిచంద్రన్ స్మరణ్. అతను 39 బంతుల్లో అజేయంగా 70 పరుగులు చేసి జట్టును విజయానికి నడిపించాడు. ఎస్ఆర్ హెచ్ బీ జట్టు 194 పరుగుల లక్ష్యాన్ని కేవలం 14.4 ఓవర్లలోనే చేధించింది. స్మరణ్ తన దూకుడు ఆటతో జట్టు మేనేజ్ మెంట్ దృష్టిని ఆకర్షించాడు.
రవిచంద్రన్ స్మరణ్ కర్ణాటకకు చెందిన యువ ఆటగాడు. అతని తండ్రి మెకానికల్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు. గత సీజన్ లో అతను జట్టులోకి రీప్లేస్ మెంట్ గా వచ్చి తన ప్రతిభను నిరూపించుకున్నాడు. ఈ సీజన్ కోసం ఎస్ఆర్ హెచ్ అతన్ని 30 లక్షల రూపాయలకు కొనసాగించింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..