MS Dhoni : ధోనీకి ఈసారి చుక్కలు కనిపిస్తాయా? సీఎస్కే లెజెండ్‌పై ఆకాష్ చోప్రా షాకింగ్ కామెంట్స్

MS Dhoni : చెన్నై సూపర్ కింగ్స్ అభిమానుల్లో ఒకవైపు ఉత్సాహం, మరోవైపు ఆందోళన కనిపిస్తోంది. దానికి కారణం తలా మహేంద్ర సింగ్ ధోనీ. ఈ సీజన్లో రెండు వారాల పాటు దూరం కానున్నాడు. అలాగే ఈ ఏడాది జూలైలో 45వ వసంతంలోకి అడుగుపెట్టనున్నాడు ధోనీ.

MS Dhoni : ధోనీకి ఈసారి చుక్కలు కనిపిస్తాయా? సీఎస్కే లెజెండ్‌పై ఆకాష్ చోప్రా షాకింగ్ కామెంట్స్
Ms Dhoni

Updated on: Mar 28, 2026 | 11:35 AM

MS Dhoni : ఐపీఎల్ 2026 (IPL 2026) రణరంగం సిద్ధమవుతున్న వేళ, చెన్నై సూపర్ కింగ్స్ (CSK) అభిమానుల్లో ఒకవైపు ఉత్సాహం, మరోవైపు ఆందోళన కనిపిస్తోంది. దానికి కారణం తలా మహేంద్ర సింగ్ ధోనీ. ఈ ఏడాది జూలైలో 45వ వసంతంలోకి అడుగుపెట్టనున్న ధోనీ, తన 19వ ఐపీఎల్ సీజన్‌కు సిద్ధమవుతున్నాడు. అయితే, ధోనీ వయసు, ఫిట్‌నెస్‌పై మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాష్ చోప్రా ధోనీ గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “ధోనీకి ఈ సీజన్ చాలా కష్టంగా ఉండబోతోంది. ఎందుకంటే అతను 40 ఏళ్ల మైలురాయిని దాటేశాడు. ఏడాదిలో 10 నెలల పాటు ఏ విధమైన పోటీ క్రికెట్ ఆడకుండా, నేరుగా ఐపీఎల్ లోకి వచ్చి రాణించడం ఎవరికైనా సాధ్యం కాదు. పైగా అతను చివర్లో వచ్చి 10-12 బంతులు మాత్రమే ఆడుతున్నాడు. దీనికి తోడు 20 ఓవర్ల పాటు కీపింగ్ చేయడం, అది కూడా మోకాలి గాయంతో.. ఇది ప్రపంచంలోనే అత్యంత కష్టమైన పని” అని చోప్రా విశ్లేషించారు. 2025 సీజన్‌లో ధోనీ 196 పరుగులు చేసినా, అతని స్ట్రైక్ రేట్, సగటు గతంలో కంటే తగ్గాయన్న విషయాన్ని గుర్తుచేశారు.

సీఎస్కే కొత్త వ్యూహం

గత సీజన్‌లో పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్, ఈసారి తమ డాడ్స్ ఆర్మీ అనే ముద్రను చెరిపేయాలని చూస్తోంది. అందులో భాగంగానే రాజస్థాన్ రాయల్స్ నుంచి సంజూ శాంసన్‌ను ట్రేడింగ్ ద్వారా దక్కించుకుంది. ఇతని కోసం ఏకంగా రూ.14.20 కోట్లు వెచ్చించింది. సంజూ రాకతో ధోనీపై ఉన్న ఒత్తిడి కొంత తగ్గే అవకాశం ఉంది. అలాగే ప్రశాంత్ వీర్, కార్తీక్ శర్మ వంటి కుర్రాళ్లను జట్టులోకి తీసుకుని భవిష్యత్తు కోసం పునాదులు వేస్తోంది సీఎస్కే మేనేజ్‌మెంట్.

ధోనీ లేని మొదటి రెండు వారాలు?

మరోవైపు, ఐపీఎల్ 2026 ప్రారంభ మ్యాచ్‌లకు ధోనీ అందుబాటులో ఉండకపోవచ్చని వార్తలు వస్తున్నాయి. తన మోకాలి గాయం నుంచి కోలుకోవడానికి మరింత సమయం పడుతుందని, అందుకే మొదటి రెండు వారాల పాటు అతను బెంచ్‌కే పరిమితమయ్యే అవకాశం ఉందని సీఎస్కే వర్గాలు హింట్ ఇచ్చాయి. ధోనీ లేకుండా చెన్నై జట్టు మైదానంలోకి దిగితే ఆ లోటును భర్తీ చేయడం కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌కు పెద్ద సవాల్‌గా మారుతుంది.

సక్సెస్ మళ్ళీ సాధ్యమేనా?

ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన చెన్నై, మళ్ళీ ఆ పాత వైభవాన్ని తెచ్చుకోవాలని పట్టుదలతో ఉంది. ధోనీ కేవలం ప్లేయర్‌గా మాత్రమే కాకుండా, జట్టుకు ఒక మెంటార్‌లా వెన్నంటి ఉంటాడు. ధోనీ బ్యాటింగ్ ఆర్డర్‌లో ఎక్కడ వస్తాడు? కీపింగ్ గ్లోవ్స్ సంజూకి ఇస్తాడా లేదా తనే కంటిన్యూ చేస్తాడా? అనే ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే ఐపీఎల్ మొదలవ్వాల్సిందే. అభిమానులు మాత్రం తమ ప్రియతమ ఆటగాడిని చివరిసారిగా మైదానంలో చూసేందుకు సిద్ధమవుతున్నారు.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us