
IPL 2026 Most Talked Players: ఐపీఎల్ 2026 సీజన్ ముగింపు దశకు చేరుకుంటున్న తరుణంలో సోషల్ మీడియాలో అత్యధికంగా చర్చించుకుంటున్న ఆటగాళ్ల జాబితాను స్టార్ స్పోర్ట్స్ విడుదల చేసింది. విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో కొనసాగుతుండగా, ఈ జాబితాలో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ పేరు లేకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సీనియర్ ఆటగాళ్లు తమ ప్రాభవాన్ని చాటుకుంటూ నెట్టింట రచ్చ చేస్తున్నారు.
స్టార్ స్పోర్ట్స్ అందించిన వివరాల ప్రకారం, ఈ సీజన్లో 44 శాతం చర్చలతో విరాట్ కోహ్లీ మొదటి స్థానంలో నిలిచాడు. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో డకౌట్ అయినప్పటికీ, విరాట్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ప్రస్తుతం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండటానికి కోహ్లీ చేసిన 379 పరుగులు కీలక పాత్ర పోషించాయి. 163 స్ట్రైక్ రేట్‌తో ఆయన ఆడుతున్న తీరు అభిమానులను ఆకట్టుకుంటోంది.
ఈ జాబితాలో మహేంద్ర సింగ్ ధోనీ 21 శాతం చర్చలతో రెండో స్థానంలో నిలిచాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ధోనీ ఈ సీజన్లో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు, అయినా ఆయన కోసం వెతికే వారి సంఖ్య తగ్గలేదు. రోహిత్ శర్మ 18 శాతంతో మూడో స్థానంలో ఉండగా, సంజూ శాంసన్ (10%), కేఎల్ రాహుల్ (8%) తర్వాతి స్థానాల్లో నిలిచారు. చెన్నై తరపున ఆడుతున్న సంజూ శాంసన్ 53 సగటుతో 430 పరుగులు చేసి సత్తా చాటుతున్నారు.
ఈ సీజన్ లో తన మెరుపు బ్యాటింగ్ తో అందరినీ ఆకర్షించిన 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ పేరు ఈ జాబితాలో లేకపోవడం చర్చనీయాంశమైంది. బీహార్‌కు చెందిన ఈ యువ ఆటగాడు 13 ఏళ్లకే కోటి రూపాయల ఒప్పందం పొంది రికార్డు సృష్టించాడు. గత సీజన్లో కేవలం 35 బంతుల్లోనే శతకం బాదిన వైభవ్, ఈ ఏడాది కూడా 236 స్ట్రైక్ రేట్‌తో 440 పరుగులు చేశాడు. ఇంతటి అద్భుత ప్రదర్శన చేసినప్పటికీ టాప్ 5 జాబితాలో ఆయనకు చోటు దక్కలేదు.
కేవలం వైభవ్ మాత్రమే కాకుండా అభిషేక్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, శుభ్‌మన్ గిల్, హార్దిక్ పాండ్యా వంటి హేమాహేమీలు కూడా ఈ జాబితాలో నిలవలేకపోయారు. దీన్ని బట్టి చూస్తే సోషల్ మీడియాలో సీనియర్ ఆటగాళ్ల వ్యక్తిగత బ్రాండ్ విలువ, వారి చుట్టూ జరిగే చర్చలు ఇంకా బలంగా ఉన్నాయని స్పష్టమవుతోంది. లీగ్ దశ ముగిసే సమయానికి ఈ లెక్కలు మారుతాయేమో చూడాలి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..