MI vs RCB : గ్రౌండ్‌లోనే బూతులు తిట్టుకున్న తిలక్, నమన్ ధీర్.. క్రునాల్ పాండ్యా క్యాచ్‌ వల్లేనా ఇదంతా?

MI vs RCB : ఐపీఎల్ 2026లో ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో క్యాచ్ మిస్సింగ్ విషయంలో తిలక్ వర్మ, నమన్ ధీర్ మధ్య గొడవ జరిగింది. ఈ ఓటమితో ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకుంది. అసలే ఓటమి భయంతో ఉన్న ముంబైకి, ఈ ఆటగాళ్ల మధ్య గొడవ మరింత తలనొప్పిగా మారింది.

MI vs RCB : గ్రౌండ్‌లోనే బూతులు తిట్టుకున్న తిలక్, నమన్ ధీర్.. క్రునాల్ పాండ్యా క్యాచ్‌ వల్లేనా ఇదంతా?
Tilak Varma Naman Dhir

Updated on: May 11, 2026 | 9:22 AM

MI vs RCB : ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ పరిస్థితి మూడు ఓటములు ఆరు గొడవలు అన్నట్లుగా తయారైంది. రాయ్‌పూర్‌లో ఆర్‌సీబీతో జరిగిన కీలక పోరులో ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు తిలక్ వర్మ, నమన్ ధీర్ మధ్య జరిగిన గొడవ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కేవలం ఒక్క క్యాచ్ మిస్ అవ్వడం వల్ల మైదానంలోనే ఒకరినొకరు తిట్టుకుంటూ అసహనం వ్యక్తం చేశారు. అసలే ఓటమి భయంతో ఉన్న ముంబైకి, ఈ ఆటగాళ్ల మధ్య గొడవ మరింత తలనొప్పిగా మారింది.

అసలేం జరిగింది? ఆ క్యాచ్ గొడవేంటి?

ఆర్‌సీబీ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో 167 పరుగుల లక్ష్య ఛేదనలో క్రునాల్ పాండ్యా ఒంటరి పోరాటం చేస్తున్నాడు. 18వ ఓవర్లో అల్లా గజన్‌ఫర్ వేసిన బంతిని క్రునాల్ సిక్సర్‌గా మలిచేందుకు ప్రయత్నించాడు. బౌండరీ లైన్ వద్ద ఉన్న నమన్ ధీర్ అద్భుతంగా క్యాచ్ అందుకున్నాడు కానీ, బ్యాలెన్స్ కోల్పోయి బౌండరీ అవతలికి వెళ్తూ బంతిని లోపల ఉన్న తిలక్ వర్మ వైపు విసిరాడు. అయితే, తిలక్ వర్మ ఆ బంతిని అంచనా వేయడంలో విఫలమయ్యాడు. దీంతో చేతికి చిక్కాల్సిన క్యాచ్ కాస్తా నేలపాలైంది.

మైదానంలోనే మాటల యుద్ధం

క్యాచ్ మిస్ అవ్వగానే నమన్ ధీర్ సహనం కోల్పోయాడు. అంత కష్టపడి బంతిని లోపలికి విసిరితే ఎందుకు పట్టుకోలేదని తిలక్ వర్మపై కేకలు వేశాడు. తిలక్ కూడా వెనక్కి తగ్గకుండా ధీటుగా సమాధానమివ్వడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం పెరిగింది. క్రునాల్ పాండ్యా వికెట్ అప్పట్లో మ్యాచ్‌కు చాలా కీలకం కాబట్టి, ఆ ఒత్తిడిలో ఇద్దరూ గొడవకు దిగారు. కాసేపటి తర్వాత సర్దుకున్నా, ఈ సీన్ చూసిన నెటిజన్లు మాత్రం ముంబై టీంలో అసలు యూనిటీ ఉందా? అని ప్రశ్నిస్తున్నారు.

తప్పు దిద్దుకున్న తిలక్.. కానీ ఫలితం దక్కలేదు

గొడవ జరిగిన కాసేపటికే తిలక్ వర్మ ఒక అద్భుతమైన క్యాచ్‌తో క్రునాల్ పాండ్యాను (73 పరుగులు) అవుట్ చేశాడు. లాంగ్ ఆన్ వద్ద సూర్యకుమార్ యాదవ్ స్టైల్లో గాలిలోకి ఎగిరి మరీ క్యాచ్ పట్టాడు. ఈ క్యాచ్‌తో క్రునాల్ వెనుదిరిగినా, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. చివరి ఓవర్లో రాజ్‌ అంగద్ బావా 15 పరుగులు డిఫెండ్ చేయలేకపోవడంతో ఆర్‌సీబీ చివరి బంతికి గెలిచింది. ఈ ఓటమితో ముంబై ఇండియన్స్ ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ రేసు నుండి అధికారికంగా తప్పుకుంది.

మళ్ళీ అదే ఫెయిల్యూర్

ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్, గత ఐదేళ్లుగా ట్రోఫీ లేక ఇబ్బంది పడుతోంది. చివరిసారిగా 2020లో టైటిల్ గెలిచిన ఈ టీమ్, ఆ తర్వాత మళ్ళీ ఆ స్థాయి ప్రదర్శన చేయలేకపోయింది. 2008 నుంచి 2012 మధ్య ఉన్న గడ్డు కాలాన్ని మళ్ళీ ఇప్పుడు చూస్తున్నట్టుగా అనిపిస్తోంది. ఐపీఎల్ 2026లో ముంబై ప్రస్థానం ఇలా గొడవలు, ఓటములతో ముగియడం అభిమానులను నిరాశకు గురిచేస్తోంది.

Follow Us