IPL 2027 : ఐపీఎల్ 2027 రిటెన్షన్ కోసం చావో రేవో తేల్చుకోనున్న స్టార్స్.. అక్కడ ఫెయిల్ అయితే కెరీర్ క్లోజ్

IPL 2027 : ఐపీఎల్ 2026 లో నిరాశపరిచిన నికోలస్ పూరన్, ట్రెంట్ బౌల్ట్, షిమ్రాన్ హెట్‌ మైర్ వంటి స్టార్ ఆటగాళ్లకు మేజర్ లీగ్ క్రికెట్ 2026 కీలకంగా మారింది. ఎంఎల్‌సీలో రాణిస్తేనే ఐపీఎల్ 2027 రిటెన్షన్ అవకాశాలు మెరుగుపడనున్నాయి.

IPL 2027 : ఐపీఎల్ 2027 రిటెన్షన్ కోసం చావో రేవో తేల్చుకోనున్న స్టార్స్.. అక్కడ ఫెయిల్ అయితే కెరీర్ క్లోజ్
Ipl 2027

Updated on: Jun 18, 2026 | 3:50 PM

IPL 2027 : ప్రపంచ క్రికెట్‌లో మరో క్రేజీ టి20 లీగ్ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. అమెరికా వేదికగా జరుగుతున్న మేజర్ లీగ్ క్రికెట్(MLC) నాలుగో సీజన్ జూన్ 19, శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. మొత్తం ఆరు జట్లు ఈ టోర్నమెంట్‌లో టైటిల్ కోసం తలపడనున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఎమ్‌ఐ న్యూయార్క్ బరిలోకి దిగుతోంది. ఈ లీగ్ యువ ఆటగాళ్లకు మంచి వేదిక మాత్రమే కాదు.. ఫామ్ లేక ఇబ్బంది పడుతున్న సీనియర్ ఆటగాళ్లకు ఒక సంజీవని లాంటిది. ముఖ్యంగా ఐపీఎల్ 2026 లో ఘోరంగా విఫలమైన కొందరు స్టార్ ప్లేయర్లు, ఐపీఎల్ 2027 మెగా వేలానికి ముందు తమ ఫ్రాంచైజీలను ఇంప్రెస్ చేయడానికి ఈ లీగ్‌ను వాడుకోనున్నారు.

1. షిమ్రాన్ హెట్‌మైర్ (రాజస్థాన్ రాయల్స్)

రాజస్థాన్ రాయల్స్ జట్టు మిడిల్ ఆర్డర్ బ్యాటర్ షిమ్రాన్ హెట్‌మైర్‌కు ఐపీఎల్ 2026 ఒక పీడకల లాంటిదని చెప్పాలి. రూ.11 కోట్ల భారీ శాలరీ తీసుకుంటున్న ఈ వెస్టిండీస్ పవర్‌హౌస్, ఆ ధరకు అస్సలు న్యాయం చేయలేకపోయాడు. ఈ సీజన్‌లో ఆడిన 7 ఇన్నింగ్స్‌లలో కేవలం 13.00 సగటుతో 78 పరుగులు మాత్రమే చేశాడు. ఒక్క మ్యాచ్‌లో కూడా కనీసం 30 పరుగులు కూడా దాటలేదు. దీంతో వచ్చే ఏడాది మెగా వేలానికి ముందే రాజస్థాన్ రాయల్స్ అతడిని విడుదల చేయడం ఖాయంగా కనిపిస్తోంది. కాబట్టి ఎమ్‌ఎల్‌సీ 2026 లో రాణించి రాయల్స్ మేనేజ్‌మెంట్‌ను మెప్పించడం హెట్‌మైర్‌కు చాలా అవసరం.

2. టిమ్ సీఫెర్ట్ (కోల్‌కతా నైట్ రైడర్స్)

టి20 వరల్డ్ కప్‌లో అద్భుత ప్రదర్శన ఇచ్చిన రికార్డుతో కేకేఆర్ జట్టులోకి వచ్చిన న్యూజిలాండ్ ఓపెనర్ టిమ్ సీఫెర్ట్ ఐపీఎల్ లో ఘోరంగా ఫెయిల్ అయ్యాడు. అజింక్య రహానేతో కలిసి ఇన్నింగ్స్ ఓపెన్ చేసిన అతడికి కేకేఆర్ 3 మ్యాచ్‌లలో అవకాశం ఇవ్వగా.. కేవలం 19 పరుగులు మాత్రమే చేసి, అందులో రెండు సార్లు డకౌట్ అయ్యాడు. దీంతో అతడి స్థానంలో వచ్చిన మరో కివీస్ ప్లేయర్ ఫిన్ అలెన్ సెంచరీతో అదరగొట్టాడు. ఇప్పుడు సీఫెర్ట్ తన పరువు కాపాడుకోవడానికి ఎమ్‌ఎల్‌సీ లో సీయాటిల్ ఓర్కాస్ జట్టు తరపున బరిలోకి దిగుతున్నాడు.

3. ట్రెంట్ బౌల్ట్ (ముంబై ఇండియన్స్)

ప్రపంచంలోనే అత్యుత్తమ లెఫ్ట్ ఆర్మ్ పేసర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ట్రెంట్ బౌల్ట్‌కు ఈ ఐపీఎల్ సీజన్ అస్సలు కలిసిరాలేదు. ముంబై ఇండియన్స్ తరపున ఆడిన బౌల్ట్, 5 ఇన్నింగ్స్‌లలో కేవలం 2 వికెట్లు మాత్రమే తీసి తీవ్రంగా నిరాశపరిచాడు. అతడి స్ట్రైక్ రేట్ ఏకంగా 48.00 గా నమోదైంది. దీంతో ముంబై మేనేజ్‌మెంట్ అతడిని చాలా మ్యాచ్‌ల్లో ప్లేయింగ్ ఎలెవన్ నుంచి పక్కన పెట్టింది. 36 ఏళ్ల బౌల్ట్‌ను ముంబై నెక్స్ట్ సీజన్ కోసం వదిలేసే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అందువల్ల ఎమ్‌ఐ న్యూయార్క్ జట్టు తరపున ఆడుతున్న బౌల్ట్‌కు ఈ లీగ్ చాలా కీలకం కానుంది.

4. రొమారియో షెపర్డ్ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు)

ఐపీఎల్ 2026 సీజన్ ఫైనల్లో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించి రజత్ పటిదార్ కెప్టెన్సీలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) టైటిల్ డిఫెండ్ చేసుకుని సరికొత్త చరిత్ర సృష్టించింది. ఆర్‌సీబీ జట్టుకు ఇది ఒక పర్‌ఫెక్ట్ సీజన్ అయినప్పటికీ, వెస్టిండీస్ ఆల్‌రౌండర్ రొమారియో షెపర్డ్ మాత్రం జట్టులో ఒక బలహీనమైన లింక్‌గా మిగిలిపోయాడు. బ్యాటింగ్‌లో 7 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 83 పరుగులు మాత్రమే చేసిన షెపర్డ్, బౌలింగ్‌లో 13 ఇన్నింగ్స్‌లు ఆడి కేవలం 7 వికెట్లు మాత్రమే తీశాడు. ఆర్‌సీబీలో కొనసాగాలంటే ఎమ్‌ఎల్‌సీ లో ఇతడు సంచలన ప్రదర్శన చేయాల్సిందే.

5. నికోలస్ పూరన్ (లక్నో సూపర్ జాయింట్స్)

ఈ లిస్ట్‌లో అందరినీ ఆశ్చర్యపరిచిన పేరు నికోలస్ పూరన్. లక్నో సూపర్ జాయింట్స్ జట్టు ఇతడికి ఏకంగా రూ.21 కోట్ల భారీ ధరను చెల్లిస్తోంది. అయితే ఐపీఎల్ 2026లో 14 ఇన్నింగ్స్ ఆడిన పూరన్, కేవలం 18.00 సగటుతో 234 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇంత భారీ ధర తీసుకుంటూ ఇలాంటి ప్రదర్శన ఇవ్వడం వల్ల ఎల్‌ఎస్‌జీ ఫ్రాంచైజీ ఇతడిని వచ్చే సీజన్ లో రిటైన్ చేసుకునే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం ఎమ్‌ఐ న్యూయార్క్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న పూరన్‌కు.. లక్నో మేనేజ్‌మెంట్ దృష్టిని ఆకర్షించడానికి ఇదే చివరి, బెస్ట్ ఛాన్స్.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us