IPL 2026 : ఐపీఎల్‌లో క్షుద్రపూజల కలకలం..వివాదంపై లలిత్ మోడీ ఏమన్నారంటే..?

IPL 2026 : ఐపీఎల్ 2026 సీజన్ కేవలం ఆటతోనే కాదు, అనూహ్యమైన వివాదాలతోనూ వార్తల్లో నిలుస్తోంది. తాజా వివాదం మైదానంలో ఆటగాళ్ల ప్రతిభ గురించి కాదు, ఏకంగా క్షుద్రపూజల(Black Magic) గురించి కావడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. ఐపీఎల్ మాజీ బాస్ లలిత్ మోదీ చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో పెను దుమారాన్ని రేపుతున్నాయి.

IPL 2026 : ఐపీఎల్‌లో క్షుద్రపూజల కలకలం..వివాదంపై లలిత్ మోడీ ఏమన్నారంటే..?
Ipl Black Magic Controversy

Updated on: Apr 21, 2026 | 1:10 PM

IPL 2026 : హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా ఒక వింత సంఘటన చోటు చేసుకుంది. సీఎస్‌కే బ్యాటర్ అవుట్ కావడానికి సరిగ్గా కొన్ని సెకన్ల ముందు, ఒక ఎస్‌ఆర్‌హెచ్ అభిమాని నిమ్మకాయతో ఏదో తంత్రం చేస్తున్నట్టుగా ఉన్న వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది. ఇది చూసిన క్రికెట్ ఫ్యాన్స్ షాక్ అయ్యారు. దీనిపై చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం బీసీసీఐకి అధికారికంగా ఫిర్యాదు చేసినట్టు ఒక లేఖ కూడా బయటకు వచ్చింది. అయితే, ఆ లేఖ AI సృష్టించిన ఫేక్ లెటర్ అని తేలినా, చర్చ మాత్రం ఆగలేదు.

లలిత్ మోదీ సంచలన వ్యాఖ్యలు

ఈ వివాదంపై ఐపీఎల్ వ్యవస్థాపక చైర్మన్ లలిత్ మోదీ స్పందిస్తూ ఒక పెద్ద బాంబు పేల్చారు. సీఎస్‌కే లేఖ ఫేక్ కావొచ్చు కానీ, ఐపీఎల్‌లో క్షుద్రపూజలు జరగడం మాత్రం పచ్చి నిజమని ఆయన ట్వీట్ చేశారు. “గతంలో ఒక టీమ్ ఓనర్ ప్రత్యర్థి జట్టు డ్రెస్సింగ్ రూమ్‌లో ఇలాంటి పూజలు చేయించిన విషయం నాకు తెలుసు. 2011 సీజన్‌లోనే దీనిపై ఆధారాలతో సహా సదరు టీమ్ ఓనర్లను హెచ్చరించాను” అని మోదీ పేర్కొన్నారు. అంతేకాదు, ఈ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడింది ఎవరో త్వరలో తాను తీయబోయే సినిమా లేదా టీవీ సిరీస్‌లో బయటపెడతానని ఒక క్లిఫ్ హ్యాంగర్ ఇచ్చారు.

— Lalit Kumar Modi (@LalitKModi) April 19, 2026

పాయింట్ల పట్టికలో ప్రస్తుత పరిస్థితి

క్షుద్రపూజల గోల ఇలా ఉంటే, మైదానంలో ఆట మాత్రం జోరుగా సాగుతోంది. శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని పంజాబ్ కింగ్స్ ప్రస్తుతం 11 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆరు మ్యాచ్‌ల్లో ఐదు విజయాలతో వారు దుమ్మురేపుతున్నారు. ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆరు మ్యాచ్‌ల్లో మూడు గెలిచి నాలుగో స్థానంలో ఉండగా.. ఐదుసార్లు ఛాంపియన్ అయిన ముంబై ఇండియన్స్ కేవలం ఒకే విజయంతో పట్టికలో అట్టడుగున ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us