
Royal Challengers Bengaluru: ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టుకు, ఆ జట్టు అభిమానులకు ఒక గొప్ప వార్త అందింది. బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో అంతర్జాతీయ క్రికెట్, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) మ్యాచ్‌లను నిర్వహించడానికి కర్ణాటక ప్రభుత్వం అధికారికంగా అనుమతి మంజూరు చేసింది. గత ఏడాది జరిగిన ఒక చేదు ఘటన నేపథ్యంలో ఈ స్టేడియంపై కొన్ని పరిమితులు విధించగా, ఇప్పుడు ప్రభుత్వం వాటిని తొలగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియం అంటేనే ఆర్‌సీబీ అభిమానుల కోలాహలం. అయితే, ఐపీఎల్ 2026లో ఆర్‌సీబీ తన హోమ్ గ్రౌండ్‌లో ఆడుతుందా లేదా అన్న అనుమానాలకు ఇప్పుడు తెరపడింది. కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (KSCA) ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా భద్రతా ఏర్పాట్లు చేస్తామని హామీ ఇవ్వడంతో ప్రభుత్వం మ్యాచుల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఐపీఎల్ 2025లో ఆర్‌సీబీ చారిత్రాత్మక విజయాన్ని సాధించి, తొలిసారి ట్రోఫీని గెలుచుకుంది. ఈ విజయాన్ని పురస్కరించుకుని జూన్ 4, 2025న బెంగళూరులో భారీ విజయోత్సవ ఊరేగింపు నిర్వహించారు. ఈ వేడుకను చూసేందుకు లక్షలాది మంది అభిమానులు చిన్నస్వామి స్టేడియం వద్దకు చేరుకున్నారు. మేనేజ్‌మెంట్ లోపాల వల్ల అక్కడ తొక్కిసలాట జరిగి 11 మంది ప్రాణాలు కోల్పోగా, డజన్ల కొద్దీ గాయపడ్డారు. ఈ విషాద ఘటన తర్వాత స్టేడియంలో పెద్ద మ్యాచుల నిర్వహణపై స్టే విధించారు.
ప్రస్తుతం ఆర్‌సీబీ డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతోంది. తమ హోమ్ గ్రౌండ్ చిన్నస్వామి స్టేడియంలో మ్యాచులు జరగడం జట్టుకు మానసికంగా ఎంతో బలాన్నిస్తుంది. కేఎస్‌సీఏ ఇప్పటికే ఎక్స్‌పర్ట్ రివ్యూ కమిటీకి ఒక రోడ్‌మ్యాప్‌ను సమర్పించింది. భద్రత, క్రౌడ్ మేనేజ్‌మెంట్ విషయంలో అత్యున్నత ప్రమాణాలు పాటిస్తామని ప్రభుత్వం ముందు స్పష్టం చేసింది.
ఈ స్టేడియంపై నిషేధం కారణంగానే టీ20 ప్రపంచకప్ 2026 వేదికల జాబితాలో బెంగళూరుకు చోటు దక్కలేదు. ప్రపంచకప్ షెడ్యూల్ ముందే ఖరారు కావడంతో ఇక్కడ ఇంటర్నేషనల్ క్రికెట్ పునఃప్రారంభం కావడానికి అభిమానులు మరికొంత కాలం వేచి చూడాల్సి రావచ్చు. కానీ, ఐపీఎల్ మ్యాచులకు అనుమతి లభించడం ఆర్‌సీబీ ఫ్యాన్స్‌కు పెద్ద ఊరట.