
2024 ఐపీఎల్ మినీ వేలానికి ముందు తరచూ వార్తల్లో నిలిచిన గుజరాత్ టైటాన్స్ జట్టుకు మెగా టోర్నీ ప్రారంభానికి ముందే గట్టి షాక్ తగిలేలా ఉంది. జట్టులోని ముగ్గురు స్టార్ ప్లేయర్లు గాయాలతో బాధపడుతున్నారు. జట్టుకు మూలస్తంభాలైన ఈ ఆటగాళ్లు ఐపీఎల్‌కు అందుబాటులో లేకుంటే మాత్రం గుజరాత్ జట్టు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. నిజానికి, ఐపీఎల్ వేలానికి ముందు, గుజరాత్ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ జట్టుకు వెళ్లిపోయాడు. దీంతో ఆ జట్టు కెప్టెన్సీని శుభమన్ గిల్‌కు అప్పగించారు. ఆ తర్వాత వేలంలోకి అడుగుపెట్టిన ఫ్రాంచైజీ అక్కడ ఏ స్టార్ క్రికెటర్‌ను కూడా కొనుగోలు చేయలేదు. ఇప్పటికే జట్టులో ఉన్న వారి నుంచే అద్భుత ప్రదర్శనను రాబట్టడమే లక్ష్యంగా పెట్టుకుంది గుజరాత్ జట్టు. అయితే ఇప్పుడు ఆటగాళ్ల గాయాలు గిల్ టీమ్ ను ఆందోళనకు గురిచేస్తున్నాయి. గుజరాత్‌కు చెందిన కేన్ విలియమ్సన్, మహమ్మద్ షమీ, రషీద్ ఖాన్ ప్రస్తుతం తీవ్ర గాయాలతో ఇబ్బంది పడుతున్నారు. గత ఎడిషన్‌లో గుజరాత్ జట్టుకు వైస్ కెప్టెన్‌గా వ్యవహరించిన రషీద్ ఖాన్ ప్రస్తుతం గాయంతో బాధపడుతున్నాడు. వన్డే ప్రపంచకప్ తర్వాత అతను జట్టుకు దూరమయ్యాడు. ఇటీవల భారత్‌తో జరిగిన సిరీస్‌కు కూడా దూరమయ్యాడు.
ప్రపంచకప్ తర్వాత టీమిండియా, గుజరాత్ టైటాన్స్ స్టార్ బౌలర్ మహ్మద్ షమీ కూడా మైదానంలోకి దిగలేదు. ప్రస్తుతం ఆఫ్ఘనిస్థాన్‌తో టీ20 సిరీస్‌కు దూరమైన షమీ.. ఇంగ్లండ్‌తో జరిగే తొలి రెండు టెస్టులకు కూడా ఎంపిక కాలేదు. ఇప్పుడు కేన్ విలియమ్సన్ రూపంలో ఆ జట్టుకు మరో ఎదురు దెబ్బ తగిలింది. గాయం సమస్య కారణంగా విలియమ్సన్ ఇప్పుడు పాకిస్థాన్ సిరీస్‌కు దూరమైనట్లు తెలుస్తోంది. 2023 ఐపీఎల్ తొలి మ్యాచ్‌లో కేన్ గాయపడి ఆ తర్వాత ఐపీఎల్ మొత్తానికి దూరమయ్యాడు. ఆ తర్వాత మోకాలికి శస్త్రచికిత్స జరిగింది. కోలుకుని 2023 ప్రపంచ కప్‌లో జట్టులో కనిపించాడు. ఇప్పుడు పాకిస్థాన్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో రెండో టీ20లో కేన్ మళ్లీ గాయపడ్డాడు.
రాబోయే మ్యాచ్‌ల్లో కేన్ ఆడడం అనుమానంగానే ఉంది. ఎందుకంటే ఈ ఏడాది జూన్ 1 నుంచి ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్‌లో విలియమ్సన్ తనను తాను ఫిట్‌గా ఉంచుకోవడంపై ఆందోళన చెందుతున్నాడు. అందుకే ముందుజాగ్రత్త చర్యగా ఐపీఎల్ 2024 నుంచి తన పేరును ఉపసంహరించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో పాకిస్థాన్ సిరీస్ తర్వాత దక్షిణాఫ్రికా పర్యటనలో ఆడుతాడా లేదా అనేదానిపై ఉత్కంఠ నెలకొంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..