Venkata Chari |
May 06, 2024 | 6:33 AM
ఈరోజు జరిగిన ఐపీఎల్ 53వ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 28 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్‌ను ఓడించి లీగ్‌లో 6వ విజయాన్ని నమోదు చేసుకుంది. చెన్నై నిర్దేశించిన 168 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన పంజాబ్ జట్టు 139 పరుగులకే ఆలౌటైంది.
ఈ మ్యాచ్ విజయం చెన్నై జట్టుకు ప్లేఆఫ్ పరంగా చాలా లాభించింది. కానీ, ఆ జట్టు స్టార్ బ్యాట్స్ మెన్ శివమ్ దూబే పేలవ ప్రదర్శన జట్టుకు తలనొప్పిగా మారింది. దూబే జీరో ప్రదర్శన సీఎస్‌కే జట్టునే కాకుండా భారత జట్టును కూడా షాక్‌కు గురి చేసింది.
ఎందుకంటే, త్వరలో జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు శివమ్ దూబే టీమ్ ఇండియాలో ఎంపికయ్యాడు. జట్టు మిడిల్ ఆర్డర్‌కు దూబే ప్రాణం అని కూడా భావిస్తున్నారు. కానీ, టీ20 ప్రపంచకప్ జట్టుకు ఎంపికైన తర్వాత దూబే మౌనంగా ఉన్నాడు.
దూబే ఆడిన రెండు వరుస మ్యాచ్‌ల్లోనూ తొలి బంతికే వికెట్ కోల్పోయాడు. అంటే, రెండు మ్యాచ్‌ల్లోనూ దూబే బ్యాట్ నుంచి ఒక్క పరుగు కూడా రాలేదు. దీంతో సెలక్షన్ బోర్డుకు కొత్త తలనొప్పి వచ్చింది.
అంతకుముందు పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో శివమ్ దూబే గోల్డెన్ డక్ కోసం పెవిలియన్‌కు చేరుకున్నాడు. ఇప్పుడు పంజాబ్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లోనూ తొలి బంతికే వికెట్ కోల్పోయాడు. రెండు మ్యాచ్‌ల్లోనూ దూబే స్పిన్నర్‌కు బలి కావడం దురదృష్టకరం. ఎందుకంటే, దూబే స్పిన్నర్లపై అద్భుతంగా బ్యాటింగ్ చేస్తాడు.
ఈ సీజన్‌లో ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడిన శివమ్ దూబే 11 ఇన్నింగ్స్‌ల్లో 350 పరుగులు చేశాడు. ఇందులో 3 అర్ధసెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్‌లో ఇప్పటివరకు 61 మ్యాచ్‌లు ఆడిన దూబే 1456 పరుగులు చేశాడు. లీగ్‌లో 9 అర్ధశతకాలు కూడా సాధించాడు.