IPL 2023: ‘నోరు మూయండి’.. ఆర్‌సీబీ అభిమానులకు కోపం తెప్పించిన గంభీర్..! నెట్టింట మొదలైన ట్రోల్స్..

|

Apr 11, 2023 | 6:20 AM

మ్యాచ్‌ ముగిసిన తర్వాత లక్నో టీమ్ మెంటర్ గౌతమ్ గంభీర్ చేసిన పని ఇప్పుడు బెంగళూరు టీమ్ అభిమానులకు కోపం తెప్పించింది. అవును, మ్యాచ్ తర్వాత గంభీర్ తన భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోయాడు. ఈ క్రమంలో అతను ఆర్‌సీబీ అభిమానులను ‘నోరు మూయండి’ అన్నట్లుగా..

IPL 2023: ‘నోరు మూయండి’.. ఆర్‌సీబీ అభిమానులకు కోపం తెప్పించిన గంభీర్..! నెట్టింట మొదలైన ట్రోల్స్..
Gautham Gambhir And Virat Kohli
Follow us on

సోమవారం అంటే నిన్న రాత్రి జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో ఆర్‌సీబీపై లక్నో సూపర్ జెయింట్స్ 1 వికెట్ తేడాతో విజయం సాధించింది. ఇక బెంగళూరు వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌ చూసేందుకు.. హోమ్ టీమ్ ఆర్‌సీబీ అభిమానులు ఎక్కువగా వస్తారన్న విషయం తెలిసిందే. అయితే మ్యాచ్‌ ముగిసిన తర్వాత లక్నో టీమ్ మెంటర్ గౌతమ్ గంభీర్ చేసిన పని ఇప్పుడు బెంగళూరు టీమ్ అభిమానులకు కోపం తెప్పించింది. అవును, మ్యాచ్ తర్వాత గంభీర్ తన భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోయాడు. ఈ క్రమంలో అతను ఆర్‌సీబీ అభిమానులను ‘నోరు మూయండి’ అన్నట్లుగా సైగా చేశాడు. ఇక దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

బెంగళూరు, లక్నో జట్ల మధ్య జరిగిన ఈ మ్యాచ్‌కి ముందు కూడా ఆర్‌సీబీ ఆటగాళ్లపై గంభీర్ విమర్శలు గుప్పించాడు. ఆ క్రమంలోనే తాజాగా మ్యాచ్ అనంతరం చిన్నస్వామి స్టేడియంలోని ఆర్‌సీబీ అభిమానులకు కోపం తెప్పించేలా ప్రవర్తించాడు. దీంతో ఆ టీమ్ ఫ్యాన్స్, అలాగే క్రికెట్ అభిమానులు కూడా గంభీర్‌ని ట్విట్టర్ వేదికగా ట్రోల్ చేస్తున్నారు. ‘కింగ్ కోహ్లీని , ఆయన అభిమానులతో తప్పుగా ప్రవర్తించినవారికి అదే రీతిలో సమాధానం లభిస్తుంది. ఇది నీ రోజు, మా రోజు వచ్చినప్పుడు 5 రెట్లు స్పీడుతో తిరిగి చెల్లిస్తామ’ని కొందరు నెటిజన్లు అంటున్నారు. మరికొందరైతే ‘గౌరవనీయమైన ఎంపీ పదవిలో ఉండి కూడా గంభీర్ ఇలా చేయడం నచ్చలేదు. ఒకప్పటి గంభీర్ ఇలా లేడు. మేము అప్పటి గంభీర్‌నే ఇష్టపడుతున్నాము. ఇతను మాకు నచ్చట్లేద’ని రాసుకొచ్చారు.

కాగా, సోమవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ ప్లేయర్లు అద్భుతంగా రాణించారు. టీమ్ తరఫున క్రీజులోకి వచ్చిన ముగ్గురు టాప్-ఆర్డర్ బ్యాటర్లు అర్ధశతకాలు బాదడంతో RCB 20 ఓవర్లలో 212/2 స్కోరు చేసింది. విరాట్ కోహ్లీ(61), కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్(79), గ్లెన్ మాక్స్‌వెల్(59) పరుగులు చేశారు. దినేష్ కార్తిక్ ఒక్క బంతినే ఆడి 1 పరుగు చేశాడు. అనంతరం లక్నో టీమ్ లక్ష్యాన్ని చేదించే క్రమంలో వెంటవెంటనే వికెట్లను కోల్పోయింది. అయితే మార్కస్ స్టోయినిస్ 65, నికోలస్ పూరన్ 62, ఆయుష్ బదోని 30, కేఎల్ రాహుల్ 18 పరుగులతో రాణించారు. అలాగే చివరి బంతి వరకు ఉత్కంఠబరితంగా సాగిన ఈ ఆటలో టెయిలెండర్లు తెలివిగా ఆడి తమ టీమ్‌ని విజయ తీరాలకు చేర్చారు. ఇక ఇది ఆర్‌సీబీకి ఈ టోర్నీలో వరుసగా రెండో ఓటమి, అలాగే లక్నోకి హ్యాట్రిక్ విజయం.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..