Watch Video: ఫేస్ షీల్డ్‌తో బౌలింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ బౌలర్.. ఎందుకో తెలుసా?

Rishi Dhawan Mask: ఐపీఎల్ 2022 వేలంలో రిషి ధావన్‌ను పంజాబ్ కింగ్స్ రూ. 55 లక్షలకు కొనుగోలు చేసింది. విజయ్ హజారే ట్రోఫీ చివరి సీజన్‌లో హిమాచల్ ప్రదేశ్ టైటిల్ విజయంలో ధావన్ కీలక పాత్ర పోషించాడు.

Watch Video: ఫేస్ షీల్డ్‌తో బౌలింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ బౌలర్.. ఎందుకో తెలుసా?
Ipl 2022 Rishi Dhawan Mask
Follow us
Venkata Chari

|

Updated on: Apr 26, 2022 | 8:15 AM

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 38వ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) పంజాబ్ కింగ్స్ (PBKS)తో తలపడింది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఈ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ తరపున రిషి ధావన్ కూడా ఆడే అవకాశం లభించింది. విశేషమేమిటంటే ఆరేళ్ల తర్వాత ధావన్ ఐపీఎల్‌లో మ్యాచ్ ఆడేందుకు వచ్చాడు. అయితే, ఈ మ్యాచ్‌లో రిషి ధావన్ ముఖానికి మాస్క్ ధరించి కనిపించి, అందర్ని ఆకట్టుకున్నాడు. నెట్టింట్లో ఈ ఫేస్ మాస్క్‌పైనే చర్చ జరిగింది. ఈ ఫేస్ మాస్క్‌తో బౌలింగ్ చేయడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ పారదర్శక ముసుగు కారణంగా, ధావన్ ముక్కు, పై భాగం కప్పబడి ఉన్నాయి. ధావన్ ఇటీవల ముక్కు గాయం నుంచి కోలుకున్నాడు. అయితే, బౌలింగ్ చేస్తున్నప్పుడు తనను తాను రక్షించుకోవడానికి ఈ ఫేస్ మాస్క్ ధరించాడు. బౌలింగ్‌లో అద్భుత ప్రదర్శన చేసిన ధావన్ శివమ్ దూబేతోపాటు, చివర్లో ధోనీ పెవిలియన్ చేర్చి పంజాబ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.

రూ. 55 లక్షలకు దక్కించుకున్న పంజాబ్..

ఐపీఎల్ 2022 వేలంలో రిషి ధావన్‌ను పంజాబ్ కింగ్స్ రూ. 55 లక్షలకు కొనుగోలు చేసింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) కూడా వేలంలో ధావన్ బేస్ ధర రూ.50 లక్షలను కొనుగోలు చేసేందుకు బిడ్ చేసింది. గత సీజన్‌లో విజయ్ హజారే ట్రోఫీలో హిమాచల్ ప్రదేశ్ టైటిల్ విజయంలో ఆల్ రౌండ్ ప్రదర్శనతో ధావన్ వార్తల్లో నిలిచాడు. విజయ్ హజారే ట్రోఫీ 2021-22 సీజన్‌లో 458 పరుగులతో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా రిషి ధావన్ నిలిచాడు. అదే సమయంలో, ఎనిమిది మ్యాచ్‌ల్లో 17 వికెట్లు పడగొట్టి, అత్యధిక వికెట్లు తీయడంలో రెండో స్థానంలో నిలిచాడు. ధావన్ అంతర్జాతీయ స్థాయిలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు.

మ్యాచ్ ఫలితం..

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ 59 బంతుల్లో 9 ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో అజేయంగా 88 పరుగులు చేశాడు. భానుక రాజపక్సే కూడా 32 బంతుల్లో 42 పరుగుల ముఖ్యమైన సహకారం అందించాడు. చెన్నై సూపర్ కింగ్స్ తరపున డ్వేన్ బ్రావో రెండు వికెట్లు పడగొట్టాడు. 188 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై టీం కేవలం 6 వికెట్లు కోల్పోయి 176 పరుగులు మాత్రమే చేయగలిగింది. చెన్నై తరుపున అంబటి రాయుడు (78) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఐపీఎల్ చరిత్రలో తొలి 8 మ్యాచ్‌లు ఆడిన చెన్నై సూపర్ కింగ్స్ 6 మ్యాచ్‌ల్లో ఓటమిని చవిచూడడం ఇదే తొలిసారి. 8 మ్యాచ్‌ల్లో పీబీకేఎస్‌కు ఇది నాలుగో విజయం. ఇప్పటి వరకు ఆ జట్టు 4 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. అదే సమయంలో చెన్నై సూపర్ కింగ్స్‌కి 8 మ్యాచ్‌ల్లో ఇది ఆరో ఓటమి. ఇప్పటి వరకు ఆ జట్టు కేవలం 2 మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించింది.

Also Read: CSK vs PBKS IPL 2022 Match Result: ఫలించని ధోనీ మ్యాజిక్.. ఇద్దరు ధావన్‌ల ధాటికి ఓటమిపాలైన చెన్నై..

PBSK vs CSK Highlights, IPL 2022: 11 పరుగుల తేడాతో పంజాబ్ విజయం.. పోరాడి ఓడిన చెన్నై..