IND vs ENG : వోక్స్.. నువ్వు గొప్పోడివి సామి.. గాయమైనా సింగిల్ హ్యాండ్‌తో బ్యాటింగ్..

ఓవల్ టెస్టులో మొదటి రోజు ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు బౌండరీ వద్ద క్రిస్ వోక్స్‌కు గాయమైంది. దీనితో ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) అతడిని ఐదో టెస్టు నుంచి తప్పించింది. అయితే, నాలుగో రోజు వోక్స్ డ్రెస్సింగ్ రూమ్‌లో కనిపించాడు. కానీ అతని చేతికి పట్టీ కట్టి ఉంది.

IND vs ENG : వోక్స్.. నువ్వు గొప్పోడివి సామి.. గాయమైనా సింగిల్ హ్యాండ్‌తో బ్యాటింగ్..
Chris Woakes

Updated on: Aug 04, 2025 | 4:38 PM

IND vs ENG : భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఐదో టెస్ట్ మ్యాచ్ చివరి రోజు చాలా ఉత్కంఠను రేపింది. ఇంగ్లాండ్‌కు గెలవడానికి కేవలం 35 పరుగులు అవసరం కాగా, భారత్‌కు 4 వికెట్లు కావాలి. ఇలాంటి సమయంలో అందరి దృష్టి క్రిస్ వోక్స్‌పై పడింది. చేతికి గాయమైనప్పటికీ, జట్టు గెలుపు కోసం అతను ఒక చేత్తో బ్యాటింగ్ చేయడానికి రావడమే ఈ మ్యాచ్‌లోని అతిపెద్ద సంచలనం. ఐదో టెస్ట్ మ్యాచ్ మొదటి రోజు బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు క్రిస్ వోక్స్‌కు ఎడమ భుజానికి గాయమైంది. ఆ తర్వాత అతను బౌలింగ్ చేయలేదు, ఫీల్డింగ్ కూడా చేయలేదు. దీంతో అతను టెస్ట్ నుంచి పూర్తిగా బయటపడ్డాడని అందరూ భావించారు. అయితే, జో రూట్ చెప్పినట్లుగానే వోక్స్ బ్యాటింగ్‌కు సిద్ధంగా ఉన్నాడు.

నాలుగో రోజు ఆట ముగిసిన తర్వాత జో రూట్ మాట్లాడుతూ.. “జట్టు కోసం వోక్స్ తన శరీరాన్ని పణంగా పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు” అని అన్నాడు. అతను చెప్పినట్లుగానే వోక్స్ గాయపడిన చేతికి స్లింగ్ వేసుకుని బ్యాటింగ్ చేయడానికి రావడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో జోష్ టంగ్‌ అవుట్ అయిన తర్వాత, చివరి వికెట్‌గా వోక్స్ బ్యాటింగ్ చేయడానికి వచ్చాడు. భారత బౌలర్లు చివరి వికెట్‌ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న తరుణంలో, వోక్స్ ఒక చేతితో బ్యాటింగ్ చేయడానికి రావడం చూసి క్రికెట్ అభిమానులు ఆశ్చర్యపోయారు. 1963 తర్వాత గాయంతో సింగిల్ హ్యాండ్‌తో బ్యాటింగ్ చేయడానికి వచ్చిన మొదటి ఆటగాడు వోక్స్. జో రూట్ మాట్లాడుతూ, “వోక్స్ తన జట్టు గెలుపు కోసం కట్టుబడి ఉన్నాడు. అతను బ్యాటింగ్‌కు సిద్ధంగా ఉండడం అతని అంకితభావాన్ని చూపిస్తుంది” అని చెప్పాడు.

ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత్ విజయం కోసం తీవ్రంగా పోరాడి గెలిచింది. మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ వంటి బౌలర్లు అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నారు. వోక్స్ లాంటి గాయపడిన ఆటగాడు వచ్చినా, చివరి వికెట్‌ను తొందరగా తీసి భారత్ విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్ గెలిచి సిరీస్‌ను 2-2తో సమం చేసింది.

 

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..