
Jitesh Sharma Denied Entry by Security Officials At Lords: క్రికెట్ అభిమానులందరినీ ఆశ్చర్యపరిచిన సంఘటన ఇటీవల లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో చోటుచేసుకుంది. ఇంగ్లండ్, భారత్ మధ్య జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్ సందర్భంగా భారత క్రికెటర్ జితేష్ శర్మకు మైదానంలోకి ప్రవేశం నిరాకరించారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ఈ విషయం భారత క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
వివరాల్లోకి వెళ్తే, లార్డ్స్ టెస్టు చూసేందుకు వచ్చిన జితేష్ శర్మను సెక్యూరిటీ సిబ్బంది గేటు వద్ద ఆపినట్లు తెలుస్తోంది. జితేష్ తనను తాను భారత క్రికెటర్‌గా పరిచయం చేసుకున్నా, సెక్యూరిటీ సిబ్బంది అతన్ని గుర్తించలేదని, లోపలికి అనుమతించలేదని సమాచారం. దీంతో జితేష్ శర్మ కొంతసేపు మైదానం బయటే వేచి చూడాల్సి వచ్చింది.
ఈ క్రమంలో, లార్డ్స్‌లో వ్యాఖ్యాతగా ఉన్న భారత మాజీ వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ అక్కడికి వచ్చాడు. జితేష్ శర్మ కార్తీక్‌ని చూడగానే సహాయం కోసం పిలిచాడు. మొదట కార్తీక్ ఫోన్ మాట్లాడుతున్నందున జితేష్ మాట వినబడలేదు. అయితే, జితేష్ పదే పదే పిలవడంతో, చివరికి కార్తీక్ అతన్ని గుర్తించి, అక్కడికి వచ్చి సెక్యూరిటీ సిబ్బందితో మాట్లాడి జితేష్‌ను లోపలికి తీసుకెళ్లాడు.
ఈ మొత్తం సంఘటనను అక్కడున్న ఓ అభిమాని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, అది క్షణాల్లో వైరల్ అయ్యింది. ‘క్రికెట్ హోమ్’ గా పిలువబడే లార్డ్స్ వంటి ప్రతిష్టాత్మక మైదానంలో ఒక అంతర్జాతీయ క్రికెటర్‌ను గుర్తించకపోవడం, ప్రవేశాన్ని నిరాకరించడంపై అనేక మంది అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దినేష్ కార్తీక్ సమయానికి ఆదుకోవడంపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
— Out Of Context Cricket (@GemsOfCricket) July 16, 2025
జితేష్ శర్మ ఈ ఏడాది ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తరపున అద్భుతంగా రాణించి, జట్టు టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. దేశీయ క్రికెట్‌లో కూడా మంచి ప్రదర్శన చేస్తున్న జితేష్, భారత టీ20 జట్టులో కూడా స్థానం సంపాదించాడు. అలాంటి గుర్తింపు పొందిన క్రికెటర్‌కు ఈ విధంగా జరగడం పట్ల కొందరు అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటన లార్డ్స్ మైదానంలో భద్రతా ఏర్పాట్లు, సిబ్బంది అప్రమత్తతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఏదేమైనా, ఈ వైరల్ వీడియో ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారింది.
మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..