Vinod Kamblis wife Andria Key Comments On Sachin Tendulkar: కొద్ది రోజుల క్రితం మాజీ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, వినోద్ కాంబ్లీ ఇద్దరూ ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. కానీ, వినోద్ కాంబ్లి పరిస్థితి చూసి చాలా మంది కంటతడి పెట్టారు. ఆ తర్వాత వినోద్ కాంబ్లీ కూడా ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రిలో చేరారు. కొద్దిరోజుల తర్వాత డిశ్చార్జి అయిన ఆయన ఇప్పుడు చర్చనీయాంశంగా మారారు. అతని ఆరోగ్యం, తాగుడు వ్యసనం, పని లేకపోవడం, ఆర్థిక పరిస్థితి గురించి విపరీతంగా చర్చించారు. దీనిపై అనేక సార్లు వినోద్ కాంబ్లి వివరణ కూడా ఇచ్చారు. అయితే, వీటిపై రూమర్స్ ఆగలేదు. తాజాగా వినోద్ కాంబ్లీ భార్య ఆండ్రియా తన మౌనాన్ని వీడారు. తన వ్యక్తిగత జీవితం గురించి చాలా విషయాలు వెల్లడించారు. ఒక ఇంటర్వ్యూలో ఆండియా మాట్లాడుతూ.. తన వివాహం, ఆర్థిక సమస్యలు, కాంబ్లీ మద్యపానం తన జీవితాన్ని ఎలా ప్రభావితం చేసిందో చెప్పుకొచ్చారు.
ఆండ్రియా పేరుగాంచిన మోడల్. ఆమె మొదటిసారి వినోద్ కాంబ్లీని 2004లో కలుసుకుంది. ఆ సమయంలో వినోద్ తల్లి చనిపోవడంతో మానసికంగా కుంగిపోయి మద్యానికి బానిసయ్యాడు. ‘అతను మానసికంగా డిస్టర్బ్ అయ్యాడని, అందుకే తాగుతున్నాడని అనుకున్నాను. కొంత కాలం తర్వాత పెళ్లి గురించి అడిగాడు. అయితే, నువ్వు మద్యం మానేయాలని స్పష్టంగా చెప్పాను’ అని ఆండ్రియా తెలిపింది.
వినోద్ కాంబ్లీ, ఆండ్రియా 2006 లో వివాహం చేసుకున్నారు. అయితే మొదట్లో వారి ఆర్థిక పరిస్థితి చాలా కష్టంగా ఉంది. వినోద్ పెళ్లికి ముందు వేరే మహిళతో సంబంధం ఉండేది. సచిన్ టెండూల్కర్‌కి ఆ మహిళ అంటే పెద్దగా నచ్చలేదు. ఆండ్రియాను పెళ్లి చేసుకోమని వినోద్‌కు సలహా ఇచ్చాడని తెలిపింది.
2010లో వారి మొదటి బిడ్డ పుట్టినప్పుడు, ఆర్థిక సమస్యల కారణంగా కాంబ్లీ చాలా భయపడ్డాడు. ఆండ్రియా కుటుంబ బాధ్యతలను స్వీకరించింది. అనేక ఒప్పందాలపై సంతకం చేసింది. ఆ తర్వాత కాంబ్లీ పరిస్థితి మెరుగైంది. మద్యం మానేయమని ఆండ్రియా అతన్ని కోరింది. 6 సంవత్సరాలుగా వినోద్ మద్యం ముట్టుకోలేదు. కానీ, సిగరెట్ తాగేవాడు. తన ఆరోగ్యంలో ఈ మెరుగుదల చూసి సచిన్ కూడా ఆశ్చర్యపోయాడు. అయితే, కాలక్రమేణా అతను (వినోద్) మద్యానికి అలవాటు పడ్డాడని తెలిపింది.
2014లో తమ కూతురు పుట్టిన తర్వాత మద్యానికి బానిసైన కాంబ్లీని పునరావాసానికి పంపినట్లు ఆండ్రియా తెలిపింది. ‘ఇప్పటివరకు అతను 6-7 సార్లు పునరావాసం పొందాడు. కోవిడ్-19 సమయంలో పని ఆగిపోవడం పరిస్థితిని మరింత దిగజార్చింది. 2023లో, అతను మానసిక వైద్యుడి నుంచి సహాయం కోరాడు. కాంబ్లీ ఎన్నో మందులు వాడాడు. కానీ, అతను మద్యం సేవించడం కొనసాగించాడు. ఇది అతని మానసిక స్థితిని ప్రతికూలంగా ప్రభావితం చేసింది’ అంటూ ఆండ్రియా పేర్కొంది.
‘సచ్ కా సామ్నా షోలో కాంబ్లీ సచిన్ గురించి కొన్ని ప్రకటనలు చేశాడని, దాంతో పరిస్థితులు మరింత దిగజారాయని, ప్రతికూలంగా మారిందని ఆండ్రియా తెలిపింది. అయితే, ఒకప్పుడు సచిన్ తన పిల్లల స్కూల్ ఫీజు కోసం డబ్బు పంపాడు. కానీ, నేను దానిని తిరిగి ఇచ్చాను’ అని ఆండ్రియా పేర్కొంది.
‘ వినోద్‌కి తన సోదరులంటే ఇష్టం ఉండదు, మరోవైపు నా (ఆండ్రియా) కుటుంబం నుంచి కూడా ఒత్తిడి ఉంది. కానీ, నేను నా భర్తను ఎప్పటికీ విడిచిపెట్టలేదు’ అని ఆమె తేల్చి చెప్పింది. పరిస్థితి విషమించినప్పుడు కొన్ని సామాజిక సంస్థలు సహకరించాయని, త్వరలోనే పరిస్థితి మెరుగుపడుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..