క్రికెట్‌లో బ్యాటర్లకు పాత్ర ఎంత ఉంటుందో.. బౌలర్లకు కూడా అదే వంతు పాత్రను పోషిస్తారు. భారీ స్కోర్లు సాధించి జట్టును పటిష్ట స్థితిలో ఉంచడం బ్యాటర్ల వంతైతే.. ఆ స్కోర్‌ను దాటకుండా ప్రత్యర్ధులను కట్టడి చేయడం బౌలర్లు పోషించే పాత్ర. అంతేకాదు వైడ్స్, నోబాల్ రూపంలో బౌలర్లు.. ప్రత్యర్ధి జట్టుకు ఎక్స్‌ట్రాల రూపంలో సమర్పించకూడదు. ఈ మధ్య చాలామంది బౌలర్లు వైడ్స్, నోబాల్స్ ఇస్తూ ప్రత్యర్ధులకు అదనపు పరుగులు ఇస్తున్నారు. అయితే ఇంతవరకూ ఒక్క నోబాల్ కూడా వేయని బౌలర్లు చాలామంది ఉన్నారు. వారిలో ఒకరే టీమిండియా బౌలర్. అతడెవరో కాదు భారత జట్టుకు మొదటి వరల్డ్ కప్ అందించిన ఆల్‌రౌండర్ కపిల్ దేవ్.
కపిల్ దేవ్ కెరీర్ విషయానికొస్తే.. 1978-94 వరకు 16 ఏళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్ ఆడిన అతడు.. తన కెరీర్‌లో ఒక్క నోబాల్ కూడా వేయలేదు. ఫాస్ట్ బౌలరైన కపిల్ దేవ్.. ఎప్పుడూ లైన్ అండ్ లెంగ్త్‌తో గీత క్రీజు దాటకుండా బంతులు వేశాడు. తద్వారా ఒక్క నోబాల్ కూడా వేయని అపూర్వ రికార్డు సాధించిన ఏకైక బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. కపిల్ దేవ్‌తో పాటు వెస్టిండీస్ మాజీ క్రికెటర్ లాన్స్ గిబ్స్, ఆస్ట్రేలియన్ ఫాస్ట్ బౌలర్ డెన్నిస్ లిల్లీ, ఇంగ్లండ్ వెటరన్ ఆల్‌రౌండర్ ఇయాన్ బోథమ్, పాకిస్థాన్ మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ కూడా తమ క్రికెట్ కెరీర్‌లో ఒక్క నోబాల్ కూడా వేయలేదు.
1983లో భారత్‌కు తొలి ప్రపంచకప్‌ను అందించిన కెప్టెన్ కపిల్ దేవ్. కపిల్ భారత్ తరఫున 131 టెస్టులు, 225 వన్డేలు ఆడాడు. బ్యాట్‌తో టెస్టుల్లో 5248 పరుగులు, వన్డేలలో 3783 పరుగులు చేశాడు. అలాగే బౌలింగ్ విషయానికొస్తే.. టెస్టుల్లో 434 వికెట్లు, వన్డేలలో 253 వికెట్లు పడగొట్టాడు.