Jerrssis Wadia : ఎవడు మమ్మీ వీడు..ఆరు బంతుల్లో 24 పరుగులు..మన ఇండియా వాడేనట నిజమేనా ?

Jerrssis Wadia : భారత సంతతి క్రికెటర్ జెర్సిస్ వాడియా బిగ్ బాష్ లీగ్‌లో సంచలనం సృష్టించాడు. అడిలైడ్ స్ట్రైకర్స్ తరపున ఆడుతూ ఒకే ఓవర్‌లో 24 పరుగులు బాదాడు. తన కెరీర్, బ్యాక్‌గ్రౌండ్ వివరాలు ఈ వార్తలో వివరంగా తెలుసుకుందాం.

Jerrssis Wadia : ఎవడు మమ్మీ వీడు..ఆరు బంతుల్లో 24 పరుగులు..మన ఇండియా వాడేనట నిజమేనా ?
Jerrssis Wadia

Updated on: Dec 29, 2025 | 3:20 PM

Jerrssis Wadia : ఆస్ట్రేలియా గడ్డపై జరుగుతున్న బిగ్ బాష్ లీగ్‎లో ఒక భారత సంతతి కుర్రాడు సంచలనం సృష్టిస్తున్నాడు. అడిలైడ్ స్ట్రైకర్స్ తరపున బరిలోకి దిగిన జెర్సిస్ వాడియా, బ్రిస్బేన్ హీట్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో సిక్సర్ల వర్షం కురిపించి అందరి దృష్టిని ఆకర్షించాడు. కేవలం 16 బంతుల్లోనే 34 పరుగులు చేసిన ఈ కుర్రాడు, ఒకే ఓవర్‌లో ఏకంగా 24 పరుగులు పిండుకుని మ్యాచ్‌నే మలుపు తిప్పాడు.

ఒకే ఓవర్లో ఊచకోత

బ్రిస్బేన్ హీట్ బౌలర్ జాక్ వైల్డర్‌ముత్ వేసిన 15వ ఓవర్‌లో జెర్సిస్ వాడియా తన విశ్వరూపం చూపించాడు. వరుసగా మూడు భారీ సిక్సర్లు, ఆపై ఒక ఫోర్ కొట్టి స్టేడియాన్ని హోరెత్తించాడు. ఒకే ఓవర్‌లో 24 పరుగులు రావడంతో అడిలైడ్ స్ట్రైకర్స్ స్కోరు బోర్డు పరుగులు తీసింది. ఎడమచేతి వాటం బ్యాటర్ కావడంతో పాటు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ కూడా అయిన జెర్సిస్, ఒక పర్ఫెక్ట్ ఆల్‌రౌండర్‌గా ఆస్ట్రేలియా క్రికెట్ అభిమానుల మనసు గెలుచుకున్నాడు.

ముంబైలో పుట్టి.. బరోడాలో పెరిగి..

జెర్సిస్ వాడియా నేపథ్యం వింటే ఆశ్చర్యపోవాల్సిందే. 2001, డిసెంబర్ 3న భారత్‌లో జన్మించిన జెర్సిస్, ముంబైలో పెరిగాడు. ఆ తర్వాత బరోడా తరపున ఏజ్ గ్రూప్ క్రికెట్ కూడా ఆడాడు. కోవిడ్-19 మహమ్మారికి ముందు అడిలైడ్ స్ట్రైకర్స్ అండర్-19 ప్రోగ్రామ్ కోసం ఆస్ట్రేలియా వెళ్ళాడు. అయితే లాక్‌డౌన్ కారణంగా విమాన సర్వీసులు నిలిచిపోవడంతో అక్కడే ఉండిపోయాడు. ఈ అనుకోని పరిస్థితి జెర్సిస్ కెరీర్‌ను మలుపు తిప్పింది. సౌత్ ఆస్ట్రేలియన్ ప్రీమియర్ లీగ్‌లో అద్భుత ప్రదర్శన చేస్తూ అంచెలంచెలుగా ఎదిగాడు.

అలెక్స్ క్యారీ స్థానంలో రాక

ప్రస్తుతం ఆస్ట్రేలియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ అలెక్స్ క్యారీ యాషెస్ సిరీస్ ఆడుతున్నాడు. ఆయన స్థానంలో లోకల్ రిప్లేస్‌మెంట్‌గా జెర్సిస్ వాడియాను అడిలైడ్ స్ట్రైకర్స్ జట్టులోకి తీసుకుంది. డిసెంబర్ 23న మెల్బోర్న్ స్టార్స్ మీద అరంగేట్రం చేసిన జెర్సిస్, మొదటి మ్యాచ్‌లో కేవలం 7 పరుగులే చేసి అవుటయ్యాడు. కానీ రెండో మ్యాచ్‌లోనే తన సత్తా ఏంటో ప్రపంచానికి చాటిచెప్పాడు. గతేడాది సౌత్ ఆస్ట్రేలియా లీగ్‌లో 680 పరుగులు చేయడమే కాకుండా 19 వికెట్లు కూడా పడగొట్టి తన ఆల్‌రౌండ్ టాలెంట్‌ను నిరూపించుకున్నాడు.

భవిష్యత్తు ఆశాకిరణం

భారతదేశంలో పుట్టి ఆస్ట్రేలియా దేశీవాళీ క్రికెట్‌లో రాణిస్తున్న జెర్సిస్ వాడియాను చూస్తుంటే, త్వరలోనే అంతర్జాతీయ స్థాయికి వెళ్తాడని విశ్లేషకులు భావిస్తున్నారు. ముంబైలో నివసిస్తున్న జెర్సిస్ తల్లిదండ్రులు తన కొడుకు సక్సెస్ చూసి ఎంతో గర్వపడుతున్నారు. బిగ్ బాష్ లాంటి పెద్ద వేదికపై ఇలాంటి మెరుపు ఇన్నింగ్స్ ఆడటం జెర్సిస్ కెరీర్‌కు మైలేజీనిస్తుందనడంలో సందేహం లేదు.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.