
టీ20 ప్రపంచ కప్ సూపర్ 8 దశకు చేరుకుంది. ఆదివారం అహ్మదాబాద్ వేదికగా జరగనున్న సూపర్-8 తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో భారత్ తలపడనుంది. గత రెండు నెలల్లో ఈ రెండు జట్లు తలపడటం ఇది ఆరోసారి కావడం విశేషం. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న టీమిండియాకు ఈ మ్యాచ్ అత్యంత కీలకం కానుంది. లీగ్ దశలో భారత్ వరుస విజయాలు సాధించినప్పటికీ, టాప్ ఆర్డర్ ఫామ్ ఆందోళన కలిగిస్తోంది. ఓపెనర్ ఇషాన్ కిషన్ 202 స్ట్రైక్ రేట్‌తో దూసుకుపోతుండగా, మిగిలిన ముగ్గురు టాప్ ఆర్డర్ బ్యాటర్లు తడబడుతున్నారు.
మూడు డకౌట్లతో అభిషేక్ శర్మ ఫామ్ లేమితో సతమతమవుతున్నాడు. ముఖ్యంగా ఆఫ్ స్పిన్నర్ల బౌలింగ్‌లో అతను బలహీనతను ప్రోటీస్ కెప్టెన్ మార్క్రామ్ క్యాష్ చేసుకునే అవకాశం ఉంది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మలు తమ సహజసిద్ధమైన దూకుడును పక్కనపెట్టి యాంకర్ పాత్ర పోషిస్తున్నారు. తిలక్ వర్మ స్ట్రైక్ రేట్ అతని కెరీర్ సగటు కంటే తక్కువగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. భారత జట్టు భారీ స్కోర్లు సాధించాలంటే బ్యాక్ ఎండ్‌లో హార్దిక్ పాండ్యా, శివం దుబే అందించే విధ్వంసకర బ్యాటింగ్ పైనే జట్టు ఆశలు పెట్టుకుంది. జిగటగా ఉండే పిచ్‌లపై వీరిద్దరి ఫామ్ భారత్‌కు ఎంతో అవసరం.
బ్యాటింగ్ నెమ్మదించినా, భారత బౌలింగ్ విభాగం ప్రత్యర్థులకు సింహస్వప్నంగా మారింది. వరుణ్ చక్రవర్తి 4 మ్యాచ్‌ల్లో 9 వికెట్లు పడగొట్టి, కేవలం 5.16 ఎకానమీతో అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. బుమ్రా ఎప్పటిలాగే పిసినారి బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేస్తున్నాడు. దక్షిణాఫ్రికా జట్టు రబాడ, ఎన్గిడి, మార్కో జాన్సెన్, కేశవ్ మహారాజ్ వంటి టాప్ క్లాస్ బౌలర్లతో సిద్ధంగా ఉంది. బ్యాటింగ్‌లో డి కాక్, ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ మిల్లర్ వంటి పవర్‌ఫుల్ ప్లేయర్లు ఉండటంతో భారత బౌలర్లకు గట్టి పరీక్ష ఎదురుకానుంది.
నల్లటి నేల పిచ్ కావడంతో భారత్ అక్షర్ పటేల్‌ను తిరిగి జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. అలాగే కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్‌లో ఎవరిని ఎంపిక చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. దక్షిణాఫ్రికా జట్టులోకి జాన్సెన్, ఎన్గిడి, మహారాజ్ తిరిగి రానున్నారు. వరల్డ్ కప్ రేసులో భారత్ తన ఆధిపత్యాన్ని చాటుకోవాలంటే, ఈ మ్యాచ్‌లో టాప్ ఆర్డర్ పుంజుకోవడం తప్పనిసరి. అహ్మదాబాద్ గడ్డపై సూర్య ప్రతాపం ఎలా ఉంటుందో చూడాలి..