IND vs SA 5th T20I : అహ్మదాబాద్‌లో మన రికార్డు చూస్తేనే దక్షిణాఫ్రికా ప్లేయర్లు ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకుంటారేమో!

IND vs SA 5th T20I : భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న ఉత్కంఠభరితమైన టీ20 సిరీస్ ఇప్పుడు క్లైమాక్స్‌కు చేరుకుంది. ఈరోజు (డిసెంబర్ 19, 2025) అహ్మదాబాద్‌లోని ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం, నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఐదో, చివరి టీ20 మ్యాచ్ జరగబోతోంది.

IND vs SA 5th T20I : అహ్మదాబాద్‌లో మన రికార్డు చూస్తేనే దక్షిణాఫ్రికా ప్లేయర్లు ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకుంటారేమో!
Ind Vs Sa

Updated on: Dec 19, 2025 | 5:35 PM

IND vs SA 5th T20I : భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న ఉత్కంఠభరితమైన టీ20 సిరీస్ ఇప్పుడు క్లైమాక్స్‌కు చేరుకుంది. ఈరోజు (డిసెంబర్ 19, 2025) అహ్మదాబాద్‌లోని ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం, నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఐదో, చివరి టీ20 మ్యాచ్ జరగబోతోంది. ప్రస్తుతం ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో టీమిండియా 2-1 ఆధిక్యంలో ఉంది. లక్నోలో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్ పొగమంచు కారణంగా రద్దు కావడంతో, ఈరోజు జరిగే మ్యాచ్ సిరీస్ విజేతను నిర్ణయించనుంది. ఒకవేళ ఈరోజు భారత్ గెలిస్తే సిరీస్ మన సొంతమవుతుంది. ఒకవేళ దక్షిణాఫ్రికా గెలిస్తే సిరీస్ 2-2తో డ్రాగా ముగుస్తుంది.

రికార్డుల పరంగా చూస్తే దక్షిణాఫ్రికా కంటే టీమిండియాదే పైచేయిగా కనిపిస్తోంది. ఇప్పటివరకు భారత్, దక్షిణాఫ్రికా జట్లు టీ20 ఫార్మాట్‌లో 35 సార్లు తలపడగా, అందులో భారత్ 20 సార్లు విజయం సాధించింది. దక్షిణాఫ్రికా 13 మ్యాచ్‌ల్లో మాత్రమే నెగ్గింది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. అహ్మదాబాద్ స్టేడియంలో టీమిండియాకు తిరుగులేని రికార్డు ఉంది. ఇక్కడ ఆడిన 5 టీ20 మ్యాచ్‌ల్లోనూ భారత్ అజేయంగా నిలిచింది. ఈ హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ సూర్యకుమార్ సేనకు ప్లస్ పాయింట్ కానుంది.

ఇక పిచ్, వాతావరణం విషయానికి వస్తే లక్నోలో లాగా ఇక్కడ పొగమంచు బెడద ఉండే అవకాశం లేదు. ఆకాశం మేఘావృతం కాకుండా ప్రశాంతంగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. అహ్మదాబాద్ పిచ్ ఎప్పుడూ బ్యాటర్లకు స్వర్గధామంలా ఉంటుంది. ఇక్కడ సగటు స్కోరు 183 పరుగులుగా ఉంది. కాబట్టి ఈరోజు పరుగుల వరద పారడం ఖాయం. అయితే సెకండ్ ఇన్నింగ్స్‌లో మంచు ప్రభావం చూపే అవకాశం ఉన్నందున, టాస్ గెలిచిన జట్టు మొదట బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. ప్రారంభంలో ఫాస్ట్ బౌలర్లకు స్వింగ్ లభించినా, ఆ తర్వాత బ్యాటర్లదే రాజ్యం.

టీమ్ ఇండియా విషయానికి వస్తే.. స్టార్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ కాలివేలి గాయం కారణంగా ఈ మ్యాచ్‌కు దూరం కావచ్చు, అతని స్థానంలో సంజూ శాంసన్ ఓపెనర్‌గా వచ్చే అవకాశం ఉంది. అలాగే వ్యక్తిగత కారణాలతో గత మ్యాచ్‌కు దూరమైన స్పీడ్ స్టార్ జస్‌ప్రీత్ బుమ్రా తిరిగి జట్టులోకి రావడం భారత్‌కు పెద్ద ఊరట. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన ఫామ్ కోసం ఎదురుచూస్తున్నాడు, ఈ కీలక మ్యాచ్‌లో అతను చెలరేగి ఆడితే దక్షిణాఫ్రికాకు కష్టాలు తప్పవు. మరోవైపు దక్షిణాఫ్రికా జట్టులో క్వింటన్ డి కాక్, డేవిడ్ మిల్లర్ వంటి పవర్‌ఫుల్ బ్యాటర్లు ఉండటంతో పోటీ హోరాహోరీగా ఉండబోతోంది.

ప్రస్తుత ఫామ్, గణంకాలను బట్టి చూస్తే భారత్‌కు గెలిచే అవకాశాలు 60% ఉండగా, దక్షిణాఫ్రికాకు 40% ఛాన్స్ ఉంది. సొంత గడ్డపై మన కుర్రాళ్ళు మరో సిరీస్‌ను తమ ఖాతాలో వేసుకుంటారని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు రాత్రి 7 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమరంలో విజేత ఎవరో తేలిపోనుంది.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..