
Deepti Sharma world record: చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో మ్యాచ్ అంటేనే మైదానంలో ఉండే సెగ వేరు. అలాంటి హై-వోల్టేజ్ పోరులో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ విశ్వరూపం ప్రదర్శించింది. బౌలింగ్‌లో ఐదు వికెట్లతో చెలరేగి పాక్ బ్యాటింగ్ వెన్నువిరిచిన దీప్తి, భారత్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించడమే కాకుండా అంతర్జాతీయ టీ20 క్రికెట్ చరిత్రలోనే అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ప్రపంచ రికార్డును తన పేరిట లిఖించుకుంది.
మహిళల టీ20 ప్రపంచ కప్ 2026 వేదికగా బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో ఆదివారం జరిగిన ఈ రసవత్తర పోరులో భారత మహిళల జట్టు 64 పరుగుల తేడాతో పాకిస్తాన్‌పై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత్, దీప్తి శర్మ విలువైన పరుగుల సాయంతో గౌరవప్రదమైన స్కోరు సాధించింది. అయితే అసలు సిసలైన వినోదం పాక్ బ్యాటింగ్ సమయంలో మొదలైంది. లక్ష్యచేధనకు దిగిన పాకిస్తాన్‌ను దీప్తి శర్మ తన అద్భుతమైన ఆఫ్ స్పిన్‌తో ఊపిరి సలపకుండా చేసింది. కేవలం నాలుగు ఓవర్ల కోటాలో 10 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టి పాక్ జట్టును కుప్పకూల్చింది.
ఈ మ్యాజిక్ స్పెల్‌తో 28 ఏళ్ల దీప్తి శర్మ అంతర్జాతీయ మహిళల టీ20 క్రికెట్లో ఒక అద్భుతమైన మైలురాయిని అందుకుంది. ఇప్పటివరకు థాయిలాండ్‌కు చెందిన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ తిపాచా పుత్తవాంగ్ పేరిట ఉన్న ప్రపంచ రికార్డును దీప్తి బద్దలు కొట్టింది. ఈ ఐదు వికెట్లతో కలిపి దీప్తి శర్మ అంతర్జాతీయ టీ20ల్లో మొత్తం 166 వికెట్లతో ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన బౌలర్‌గా అగ్రస్థానానికి దూసుకెళ్లింది.
దీప్తి శర్మ (భారత్): 166 వికెట్లు
తిపాచా పుత్తవాంగ్ (థాయిలాండ్): 165 వికెట్లు
హెన్రియెట్ ఇషిమ్వే (రువాండా): 160 వికెట్లు
మేగాన్ షట్ (ఆస్ట్రేలియా): 152 వికెట్లు
దీప్తి శర్మ కేవలం టీ20ల్లోనే కాదు, మొత్తంగా అంతర్జాతీయ మహిళల క్రికెట్ చరిత్రలోనే అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా రికార్డు సృష్టించింది. భారత దిగ్గజ ఫాస్ట్ బౌలర్ ఝులన్ గోస్వామి సాధించిన 355 వికెట్ల ఆల్‌టైమ్ రికార్డుకు దీప్తి ఇప్పుడు కేవలం ఒక్క వికెట్ దూరంలో (354 వికెట్లు) ఉంది. త్వరలోనే ఆమె ఈ రికార్డును కూడా అధిగమించి ప్రపంచంలోనే నంబర్ వన్ బౌలర్‌గా అవతరించడం ఖాయంగా కనిపిస్తోంది.