
టీ20 వరల్డ్ కప్‌లో మోస్ట్ అవైటెడ్ మ్యాచ్ ..భారత్ వర్సెస్ పాకిస్తాన్ . ఈ రెండు జట్లు ఎప్పుడు మైదానంలోకి అడుగుపెట్టినా అది ఓ యుద్ధన్నే తలపిస్తుంది. దాయాదుల సమరాన్ని చూసేందుకు ప్రపంచంలోని క్రికెట్ లవర్స్ తీవ్ర ఉత్కంఠగా ఎదురుచూస్తుంటారు. ఇటు ఈ రెండు జట్లు కూడా గెలుపు కోసం హోరాహోరీగా సర్వశక్తులు ఒడ్డడం ఖాయం. టీ20 వరల్డ్‌కప్‌లో భారత్, పాకిస్తాన్ మధ్య ఇప్పటి వరకు జరిగిన మ్యాచుల్లో భారత్ పైచేయిగా నిలిచింది. ఈ రెండు టీమ్‌లు ఇప్పటి వరకు టీ20ల్లో 16 మ్యాచుల్లో తలపడగా, భారత్ 13 సార్లు గెలుపొందింది. పాకిస్తాన్ 3 మ్యాచుల్లో మాత్రమే విజయం సాధించింది. దీంతో ఈసారి కూడా పాకిస్తాన్‌ను ఓడించడం ఖాయమని సూర్యకుమార్‌యాదవ్ సారధ్యంలోని టీమ్ ధీమా వ్యక్తం చేస్తోంది. దానికి తగ్గట్టే టీమిండియా జట్టులోని కీలక ఆటగాళ్లంతా ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. ఓపెనర్ అభిషేక్‌శర్మ నుంచి అక్షర్‌పటేల్ వరకు బ్యాటింగ్ లైనప్ బలంగా ఉంది. ఒకవేళ మొదట బ్యాటింగ్ చేయాల్సి వస్తే.. ఇప్పుడున్న ఫామ్ ప్రకారం 250కి పైగా పరుగులు చేసే అవకాశం ఉంది. కెప్టెన్ సూర్యకుమార్‌యాదవ్, ఇషాన్‌కిషన్, హార్డిక్ పాండ్యా లాంటి బ్యాటర్లు భీకర ఫామ్‌లో ఉన్నారు. దీంతో కొలంబోలో పరుగుల వరద పారించేందుకు టీమిండియా టీమ్ రెడీ అంటోంది. బుమ్రా, కుల్‌దీప్, వరుణ్ చక్రవర్తి, అర్షదీప్‌సింగ్ లాంటి బౌలర్లు.. పాకిస్తాన్ బ్యాటర్లను బెంబేలెత్తించడానికి సిద్ధంగా ఉన్నారు.
ఇక పాకిస్తాన్ కూడా గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డేందుకు సిద్ధమైంది. గతంలో ట్రాక్ రికార్డ్ చూస్తే భారత్ పైచేయిగా ఉన్నా.. ఈసారి మాత్రం గెలుపు మాదే అంటున్నాడు పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్. తమ బౌలర్ తారిఖ్ బౌలింగ్‌పై వచ్చిన విమర్శలను కూడా పట్టించుకోబోమన్నాడు సల్మాన్. ఇప్పటికే ఐసీసీ క్లీన్‌చిట్ ఇచ్చిందని గుర్తు చేశాడు. ఇప్పుడు తమ ఫోకస్ అంతా గెలుపు మీదే ఉందన్నాడు. అంతేకాదు ఈ మ్యాచ్‌లో టాస్ ముఖ్యం కాదు.. ఆట మాత్రమే ముఖ్యం అని కామెంట్ చేశాడు సల్మాన్. అల్టిమేట్‌గా ఎవరు మంచి క్రికెట్ ఆడితే గెలుపు వాళ్లదే అని ధీమా వ్యక్తం చేశాడు. పాకిస్తాన్ టీమ్‌లో బాబర్ ప్రధాప బ్యాట్స్‌మెన్, ఓపెనర్ ఫకార్ జమాన్‌తో పాటు కెప్టెన్ సల్మాన్ అఘా ఆల్‌రౌండర్.. ఇక బౌలింగ్‌లో ఉస్మాన్ తారిఖ్ వారి ప్రధాన బలం. చాలా చర్చలు జరిగిన తర్వాత ఈ మ్యాచ్ ఆడేందుకు పాకిస్తాన్ అంగీకరించింది. అంతకుముందు భారత్‌తో జరగాల్సిన మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేస్తున్నట్టు ప్రకటించింది. తమ ప్రభుత్వం ఆదేశాల ప్రకారం మ్యాచ్‌కు దూరంగా ఉంటామని ప్రకటించింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్. ఆ తర్వాత ఐసీసీ రంగంలోకి దిగడంతో తోక ముడిచింది. ఐసీసీ, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు మధ్య జరిగిన చర్చలు సఫలం కావడంతో భారత్‌తో మ్యాచ్ ఆడేందుకు పాకిస్తాన్ క్రికెట్ టీమ్ ఓకే చెప్పింది. ఒకవేళ ఈ మ్యాచ్ ఆడకుంటే, ఐసీసీ భారీ జరిమానాలు విధించే అవకాశం ఉండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో మ్యాచ్ ఆడేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు.
ప్రపంచంలోని కోట్లాది మంది క్రికెట్ లవర్స్ ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఈ మ్యాచ్ విషయంలో నిరాశకు గురి చేసే అంశం కూడా ఒకటి ఉంది. ఈ మ్యాచ్‌కి వరుణ గండం పొంచి ఉంది. ఇవాళ కొలంబోలో వర్షం కురిసే అవకాశం ఉందని అక్కడి వాతావరణశాఖ అధికారులు ఇచ్చిన సమాచారం. ఇది క్రికెట్ అభిమానుల ఆశలపై నీళ్లు చల్లే కబురు.. దీంతో అక్కడ వర్షం పడకూడదని క్రికెట్ లవర్స్ కోరుకుంటున్నారు. కొలంబోలో వరద వద్దని, ప్రేమదాస క్రికెట్ స్టేడియంలో పరుగుల వరద మాత్రమే పారాలని ఆకాంక్షిస్తున్నారు అభిమానులు. బౌండరీల మోత మోగే ఆ మ్యాచ్ కోసం యావత్ క్రికెట్ ప్రేమికులంతా నరాలు తెగే ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో రాత్రి 7 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్ శివరాత్రి రోజు కావడంతో అంతా 2003లో జరిగిన మ్యాచ్‌ను గుర్తు చేసుకుంటున్నారు. 2003లో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ పై మ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ చెలరేగిపోయాడు. ఏకంగా 75 బంతుల్లో 98 పరుగులు చేసి భారత్‌ను గెలిపించాడు. పాకిస్తాన్ బౌలర్లపై రెచ్చిపోయి.. బ్యాటింగ్‌లో శివతాండవం చేసిన సచిన్ ఇన్నింగ్స్‌ని క్రికెట్ అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. ఈ శివరాత్రి రోజు పాకిస్తాన్‌పై శివతాండవం చేసే ఈ బ్యాట్స్‌మెన్ ఎవరనే అంచనాలో మునిగితేలుతున్నారు.
భారత్ (ప్రాబబుల్ XI): అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్) , శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్ దీప్ సింగ్
పాకిస్థాన్ (ప్రాబబుల్ XI): సయీమ్ అయూబ్, సాహిబ్జాదా ఫర్హాన్, సల్మాన్ అలీ అఘా (కెప్టెన్), బాబర్ ఆజం, ఉస్మాన్ ఖాన్ (వికెట్ కీపర్), షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్, షాహీన్ అఫ్రిది, ఉస్మాన్ తారిఖ్, అబ్రార్ అహ్మద్