Jasprit Bumrah: చివర్లో బుమ్రా ఎందుకు బౌలింగ్‌ వేయలేదు? గాయం కారణమా? రెండో టెస్ట్‌కు దూరం..!

ఇంగ్లాండ్ తొలి టెస్టులో ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. బుమ్రా ఒక్క వికెట్ కూడా తీయలేకపోవడం, చివరి దశలో ఆడకపోవడం ఆందోళన కలిగించింది. కెప్టెన్ గిల్ నిర్ణయాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బుమ్రా గాయంపై అనుమానాలు, అతని ఫిట్‌నెస్ గురించి చర్చ జరుగుతోంది. తదుపరి టెస్ట్‌లో అతని పాత్ర అనిశ్చితంగా ఉంది.

Jasprit Bumrah: చివర్లో బుమ్రా ఎందుకు బౌలింగ్‌ వేయలేదు? గాయం కారణమా? రెండో టెస్ట్‌కు దూరం..!
Jasprit Bumrah

Updated on: Jun 25, 2025 | 10:54 AM

ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా మంగళవారం ముగిసిన తొలి టెస్టులో ఇంగ్లాండ్‌ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఎన్నో ఆశలతో ఇంగ్లాండ్‌ గడ్డపై అడుగుపెట్టిన యంగ్‌ టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. అయితే.. ఈ ఓటమి తర్వాత కొత్త కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ తీసుకున్న నిర్ణయాలపై అనుమానాలు తలెత్తుతున్నాయి. అవేంటంటే.. 371 టార్గెట్‌తో రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన ఇంగ్లాండ్‌ను భారత బౌలర్లు నిలవరించలేకపోయారు. ముఖ్యంగా టీమిండియాకు ప్రధాన బౌలర్‌ అయిన బుమ్రా ఒక్కటంటే ఒక్క వికెట్‌ కూడా తీయలేకపోయాడు. అది జట్టుపై తీవ్ర ప్రభావం చూపింది. అలాగే ఆట చివరి రోజు టీమిండియా కొత్త బంతి తీసుకున్న తర్వాత బుమ్రా బౌలింగ్‌ చేయలేదు.

అంతకంటే ముందు భుజానికి మసాజ్  చేయించుకుంటూ కనిపించాడు. దీంతో.. బుమ్రా గాయంతో ఆటకు దూరం అవుతాడా అని క్రికెట్‌ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 80వ ఓవర్ తర్వాత టీమిండియాకొత్త బంతి తీసుకున్నప్పటికీ బుమ్రా బౌలింగ్‌ వేయలేదు. కెప్టెన్‌ శుబ్‌మాన్ గిల్.. మహమ్మద్ సిరాజ్‌తో బౌలింగ్‌ వేయించాడు. ఆ నిర్ణయం ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. విజయానికి కేవలం 21 పరుగులు మాత్రమే అవసరమైనప్పుడు, ఇంగ్లాండ్ వికెట్ కీపర్ జామీ స్మిత్ ఎటువంటి తడబాటు లేకుండా మ్యాచ్‌ను ఫినిష్‌ చేశాడు. జడేజా ఓవర్‌లో ఏకంగా 18 పరుగులు కొల్లగొట్టాడు స్మిత్‌. ఆతిథ్య జట్టుకు చిరస్మరణీయమైన విజయాన్ని అందించాడు. 371 పరుగుల లక్ష్యాన్ని సాధించి ఇంగ్లాండ్‌ టెస్ట్ చరిత్రలో రెండవ అత్యధికం ఛేజింగ్‌ రికార్డును నమోదు చేసింది.

అయితే.. నిర్ణయాత్మక చివరి దశలో బుమ్రా దాడికి దూరంగా ఉండటం అభిమానులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. టీమిండియా రెండవ కొత్త బంతిని తీసుకోవడానికి కొన్ని క్షణాల ముందు, బుమ్రా మైదానంలో భుజం మసాజ్ చేయించుకోవడం కనిపించింది. ఇది భారత్‌ నుంచి అద్భుత ముగింపు కోసం చివరి ప్రయత్నం జరుగుతుందనే ఆశలను రేకెత్తించింది. కానీ ఇంగ్లాండ్ లక్ష్యానికి దగ్గరగా వచ్చేసరికి, బుమ్రా బంతిని తీసుకోకుండా మైదానంలోనే ఉండిపోయాడు. దీంతో బుమ్రా ఫిట్‌నెస్ సమస్యపై ఊహాగానాలకు ఆజ్యం పోసింది.

అయితే బుమ్రా ఫిట్‌నెస్‌పై ఉన్న ఆందోళనలను గిల్ తోసిపుచ్చాడు. బుమ్రా పూర్తిగా ఫిట్‌గా ఉన్నాడని అన్నాడు. ఇంగ్లాండ్‌కు కొన్ని పరుగులు మాత్రమే అవసరం కావడంతో ఇతర బౌలర్లతో వేయించినట్లు గిల్‌ పేర్కొన్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసిన బుమ్రా రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ తీయలేకపోయాడు. ఇక ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగే తదుపరి టెస్ట్‌కు భారత ప్రధాన ఫాస్ట్ బౌలర్ బుమ్రా ఆడతాడా? లేదా అనేది అనుమానంగా మారింది. దీనిపై గిల్‌ స్పందిస్తూ.. బర్మింగ్‌హామ్‌కు వెళ్లి వికెట్ చూసిన తర్వాత బుమ్రా ఆడేది లేనిది నిర్ణయం తీసుకుంటామని అన్నాడు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి