IND vs AUS : మహిళల క్రికెట్‌లో ఓనమాలు నేర్పిన భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్.. 10 కాదు, 12 కాదు.. రికార్డు స్థాయిలో సిక్సర్లు

ఈ మ్యాచ్‌లో ఓటమి కారణంగా టీమిండియాకు ఇది వరుసగా రెండో ఓటమి. గత మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు దక్షిణాఫ్రికా చేతిలో 3 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. వరుసగా రెండు ఓటముల తర్వాత భారత జట్టు పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి పడిపోయింది.

IND vs AUS : మహిళల క్రికెట్‌లో ఓనమాలు నేర్పిన భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్.. 10 కాదు, 12 కాదు.. రికార్డు స్థాయిలో సిక్సర్లు
Ind Vs Aus

Updated on: Oct 13, 2025 | 7:19 AM

IND vs AUS : విశాఖపట్నంలోని ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఐసీసీ మహిళల ప్రపంచ కప్ 2025 మ్యాచ్ ఒక అత్యంత థ్రిల్లింగ్ పోరుగా నిలిచింది. భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన ఈ హై-స్కోరింగ్ మ్యాచ్‌లో టీమిండియా ఓటమి పాలైనప్పటికీ, ఈ పోరు ఒక సంచలన ప్రపంచ రికార్డును నెలకొల్పింది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల ఆటగాళ్లు బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడ్డారు. ముఖ్యంగా ఈ మ్యాచ్‌లో పడిన సిక్సర్లు మహిళల వన్డే క్రికెట్ చరిత్రలోనే ఒక అరుదైన మైలురాయిని తాకాయి.

భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన ఈ మ్యాచ్ మహిళల వన్డే ప్రపంచ కప్ చరిత్రలో అత్యధిక సిక్సర్లు నమోదైన మ్యాచ్‌గా రికార్డు సృష్టించింది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు కలిసి మొత్తం 13 సిక్సర్లు కొట్టాయి. భారత్ బ్యాటర్లు మొత్తం 7 సిక్సర్లు బాదారు. ఇందులో స్మృతి మంధాన (80 పరుగులు) 3 సిక్సర్లు కొట్టగా, ప్రతికా రావల్ (75 పరుగులు) 1 సిక్సర్, హర్లీన్ డియోల్ 1 సిక్సర్, రిచా ఘోష్ 2 సిక్సర్లు కొట్టారు.

ఆస్ట్రేలియా బ్యాటర్లు మొత్తం 6 సిక్సర్లు కొట్టారు. కెప్టెన్ అలిస్సా హీలీ (142 పరుగులు) తన మెరుపు ఇన్నింగ్స్‌లో 3 సిక్సర్లు బాదగా, ఫోబ్ లిచ్‌ఫీల్డ్, ఎల్లీస్ పెర్రీ, ఆష్లే గార్డ్‌నర్ ఒక్కొక్కరు 1 సిక్సర్ కొట్టారు. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు కేవలం సిక్సర్ల రికార్డునే కాకుండా, మరో కీలకమైన ప్రపంచ రికార్డును కూడా నెలకొల్పింది. భారత్ నిర్దేశించిన 331 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించిన ఆస్ట్రేలియా, మహిళల వన్డే క్రికెట్ చరిత్రలోనే అత్యధిక సక్సెస్‌ఫుల్ రన్ ఛేజ్ రికార్డును సృష్టించింది.

అంతకుముందు, ఈ రికార్డు శ్రీలంక పేరిట ఉండేది. శ్రీలంక జట్టు 2024లో సౌతాఫ్రికాపై 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. ఈ ఓటమి భారత జట్టుకు టోర్నమెంట్‌లో వరుసగా రెండవది. గత మ్యాచ్‌లో కూడా హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత్, సౌత్ ఆఫ్రికా చేతిలో 3 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. వరుస ఓటముల కారణంగా భారత జట్టు పాయింట్స్ టేబుల్‌లో మూడో స్థానానికి పడిపోయింది. టీమిండియా తమ తదుపరి మ్యాచ్‌లో టోర్నమెంట్‌లో ఇప్పటివరకు అపజయం లేకుండా కొనసాగుతున్న ఇంగ్లాండ్ జట్టును ఎదుర్కోవాల్సి ఉంది. ఈ మ్యాచ్ భారత్‌కు ఒక కీలకమైన సవాలుగా నిలవనుంది.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..