Vaibhav Suryavanshi : అండర్-19 హీరో వైభవ్ సూర్యవంశీకి బంపర్ ఆఫర్.. అక్కడ 100 పరుగులు చేసినందుకేనా ?

భారత అండర్-19 క్రికెట్ జట్టుకు ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా పర్యటనలలో విజయాన్ని అందించడంలో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు వైభవ్‌ను బీహార్ రంజీ జట్టులోకి సెలక్ట్ చేయడమే కాక, ఏకంగా వైస్ కెప్టెన్ బాధ్యతలను అప్పగించారు. అండర్-19 స్థాయిలో మంచి ప్రదర్శన కనబరిచిన వైభవ్ సూర్యవంశీకి బీహార్ రంజీ జట్టులో వైస్ కెప్టెన్సీ లభించడం పెద్ద బాధ్యత.

Vaibhav Suryavanshi : అండర్-19 హీరో వైభవ్ సూర్యవంశీకి బంపర్ ఆఫర్.. అక్కడ 100 పరుగులు చేసినందుకేనా ?
Vaibhav Suryavanshi

Updated on: Oct 13, 2025 | 11:17 AM

Vaibhav Suryavanshi : భారత అండర్-19 క్రికెట్ జట్టుకు ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా పర్యటనలలో విజయాన్ని అందించడంలో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు వైభవ్‌ను బీహార్ రంజీ జట్టులోకి సెలక్ట్ చేయడమే కాక, ఏకంగా వైస్ కెప్టెన్ బాధ్యతలను అప్పగించారు. మరోవైపు, తన అరంగేట్రం మ్యాచ్‌లోనే ట్రిపుల్ సెంచరీ కొట్టి చరిత్ర సృష్టించిన సాకిబుల్ గనిని జట్టుకు కెప్టెన్‌గా నియమించారు.

అండర్-19 స్థాయిలో మంచి ప్రదర్శన కనబరిచిన వైభవ్ సూర్యవంశీకి బీహార్ రంజీ జట్టులో వైస్ కెప్టెన్సీ లభించడం పెద్ద బాధ్యత. అయితే, వైభవ్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ గణాంకాలను పరిశీలిస్తే.. ఈ నిర్ణయం కొందరికి ఆశ్చర్యం కలిగించవచ్చు. ఎందుకంటే లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ అయిన వైభవ్ సూర్యవంశీ ఇప్పటివరకు బీహార్ తరఫున కేవలం 5 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. ఆ 10 ఇన్నింగ్స్‌లలో 158 బంతులు ఎదుర్కొని కేవలం 100 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో 18 ఫోర్లు, 1 సిక్సర్ ఉన్నాయి. కేవలం 100 పరుగులు చేసినప్పటికీ, అతని అండర్-19 అనుభవం, కెప్టెన్సీ లక్షణాలను గుర్తించి, తొలిసారిగా వైస్ కెప్టెన్ బాధ్యతలను అప్పగించారు. వైభవ్ తన ఆరో ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ను ఉప-కెప్టెన్‌గా ఆడనున్నాడు.

బీహార్ రంజీ జట్టుకు కెప్టెన్‌గా నియమితులైన సాకిబుల్ గని అరుదైన రికార్డును సొంతం చేసుకున్న ఆటగాడు. సాకిబుల్ గని 2022లో బీహార్ తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. తన మొదటి మ్యాచ్‌లోనే ట్రిపుల్ సెంచరీ (341 పరుగులు) చేసి చరిత్ర సృష్టించాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ చరిత్రలో డెబ్యూ మ్యాచ్‌లోనే ట్రిపుల్ సెంచరీ సాధించిన మొట్టమొదటి ఆటగాడిగా సాకిబుల్ గని రికార్డు సృష్టించాడు. తన అద్భుతమైన ప్రదర్శన, నిలకడ కారణంగా ఇప్పుడు జట్టు కెప్టెన్సీ బాధ్యతలను స్వీకరించాడు.

రంజీ ట్రోఫీ 2025లో బీహార్ తన ప్రయాణాన్ని అక్టోబర్ 15 నుంచి ప్రారంభించనుంది. బీహార్‌కు తొలి మ్యాచ్ అరుణాచల్ ప్రదేశ్‌తో జరగనుంది. ఈ మ్యాచ్ పాట్నాలోని మొయిన్-ఉల్-హక్ స్టేడియంలో జరుగుతుంది. ఆ తర్వాత అక్టోబర్ 25 నుంచి మణిపూర్ జట్టును ఎదుర్కొనేందుకు బీహార్ జట్టు నాడియాడ్‎కు వెళ్లనుంది. ఈ రెండు మ్యాచ్‌లు ప్లేట్ గ్రూప్‎లో భాగంగా జరగనున్నాయి.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..