India New Coach: టీమిండియా కొత్త కోచ్‌ కోసం దరఖాస్తులు.. నిబంధనలు ఎలా ఉన్నాయంటే?

|

Oct 17, 2021 | 6:29 PM

ప్రస్తుత భారత క్రికెట్ జట్టు కోచ్ రవిశాస్త్రి, సహాయక సిబ్బంది పదవీకాలం వచ్చే నెలతో ముగుస్తుంది. ఈ మేరకు బీసీసీఐ కొత్త కోచ్‌ల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది.

India New Coach: టీమిండియా కొత్త కోచ్‌ కోసం  దరఖాస్తులు.. నిబంధనలు ఎలా ఉన్నాయంటే?
Bcci
Follow us on

India New Coach: భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ కోసం అధికారిక ప్రక్రియ ప్రారంభమైంది. ఈ మేరకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) దరఖాస్తులను ఆహ్వానించింది. అక్టోబర్ 17 ఆదివారం టీమిండియా ప్రధాన కోచ్ పదవికి దరఖాస్తులను ఆహ్వానిస్తూ బీసీసీఐ ప్రకటన విడుదల చేసింది. ఈ పోస్ట్ కోసం పోటీదారులు తమ దరఖాస్తును బీసీసీఐకి అక్టోబర్ 26 సాయంత్రం 5 గంటలలోపు పంపాలి. అయితే రాహుల్ ద్రవిడ్‌ను కోచ్‌గా చేయడానికి బీసీసీఐ రాజ్యాంగం ప్రకారం లాంఛనాలు ప్రారంభమయ్యాయి. ప్రధాన కోచ్‌తో పాటు, సహాయక సిబ్బందిలో బౌలింగ్ కోచ్, బ్యాటింగ్ కోచ్, ఫీల్డింగ్ కోచ్ కోసం కూడా దరఖాస్తులు ఆహ్వానించింది.

బీసీసీఐ వివరాల మేరకు, ప్రధాన కోచ్, సహాయక సిబ్బంది పదవీకాలం రెండు సంవత్సరాలు ఉండనుంది. దీనితో పాటు, అర్హత ఉన్న అభ్యర్థి కోసం బోర్డు అనేక షరతులను కూడా విధించింది. దీని ప్రకారం ప్రధాన కోచ్ కోసం దరఖాస్తుదారు కనీసం 30 టెస్ట్ మ్యాచ్‌లు లేదా వన్డే అంతర్జాతీయ మ్యాచ్‌ల అనుభవం కలిగి ఉండాలి. ఐసీసీ లిస్టులో ఉన్న దేశాల టీంలకు కోచ్‌గా రెండు సంవత్సరాలు పనిచేసి ఉండాటని పేర్కొంది. లేదా 3 సంవత్సరాల పాటు ఏదైనా అసోసియేట్ టీమ్ లేదా ఐపీఎల్ టీమ్ లేదా ఇతర విదేశీ లీగ్ లేదా ఫస్ట్ క్లాస్ టీమ్ కోచ్‌గానైనా పనిచేసి ఉండాలని పేర్కొంది. లేదా బీసీసీఐ నుంచి లెవల్ -3 సర్టిఫికెట్ (కోచింగ్) పొందాలని తెలిపింది. వీటితోపాటు అపాయింట్‌మెంట్ సమయంలో సంబంధిత వ్యక్తి వయస్సు 60 ఏళ్లలోపు ఉండాలని పేర్కొంది.

సహాయక సిబ్బందికి షరతులు
ఇవన్నీ కాకుండా, బ్యాటింగ్, ఫీల్డింగ్, బౌలింగ్ కోచ్‌ల కోసం కూడా బోర్డు దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ మూడు పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ నవంబర్ 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సమయమిచ్చింది. మూడు పోస్టులకు దరఖాస్తు చేసుకునే వ్యక్తులు కనీసం 10 టెస్టులు లేదా 25 వన్డేల అనుభవం కలిగి ఉండాలి. ఇతర షరతులు ప్రధాన కోచ్ కోసం దరఖాస్తుదారులకు సమానంగా ఉండాలని పేర్కొంది. ఈ నాలుగు పోస్టులతో పాటు, నేషనల్ క్రికెట్ అకాడమీలో స్పోర్ట్స్ సైన్స్ అండ్ మెడిసిన్ చీఫ్ ఫిజియో కోసం కూడా దరఖాస్తులు ఆహ్వానించింది. ఈ పోస్టులకు నవంబర్ 3 లోపు దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుంది.

రవిశాస్త్రి పదవీకాలం..
భారత జట్టు ప్రధాన కోచ్ రవిశాస్త్రి, సహాయక సిబ్బందిలో బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్. శ్రీధర్, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ టీమిండియాతో చేసుకున్న ఒప్పందాలు వచ్చే నెల టీ 20 వరల్డ్ కప్ తర్వాత ముగుస్తాయి. రవిశాస్త్రి 2017 నుంచి టీమిండియా ప్రధాన కోచ్‌గా ఉన్నారు.

రాహుల్ ద్రవిడ్ నియామకానికి లాంఛనాలు సిద్ధం..
రవి శాస్త్రి స్థానాన్ని పూరించేందుకు దరఖాస్తులు ఆహ్వానించిన సంగతి తెలిసిందే. అయితే ఇది ఓ అధికారిక ప్రక్రియ మాత్రమే. ఎందుకంటే ఈ పాత్ర కోసం బోర్డు మాజీ అనుభవజ్ఞుడు, ప్రస్తుత ఎస్‌సీఏ చీఫ్ రాహుల్ ద్రవిడ్ పేరు దాదాపు ఖరారు అయినట్లేనని తెలుస్తోంది. అయితే, బోర్డు రాజ్యాంగం ప్రకారం, కోచ్ నియామకం కోసం దరఖాస్తు ప్రక్రియ, క్రికెట్ సలహా కమిటీ దరఖాస్తుదారుల ఇంటర్వ్యూ ప్రక్రియను అనుసరించాల్సి ఉంటుంది. ఈ విధంగా దీనిని ద్రవిడ్ నియామకం కోసం అధికారిక ప్రక్రియ అని పిలుస్తున్నారు.

Also Read: T20 World Cup 2021: టీ20 ప్రపంచకప్‌ ఫుల్ టైం టేబుల్, మ్యాచ్‌ల తేదీలు, వేదికల వివరాలు మీకోసం..!

T20 World Cup: తొలిసారి ప్రపంచకప్‌ బరిలో 7గురు భారత ఆటగాళ్లు.. పాకిస్తాన్ మ్యాచుతో 4గురి ప్రయాణం మొదలు.. వారెవరంటే?