
India vs Zimbabwe 2022: వచ్చే నెలలో టీమిండియా జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. అక్కడ 3 వన్డేలు ఆడాల్సి ఉంది. ఆగస్టు 18 నుంచి యాత్ర ప్రారంభం కానుంది. అన్ని మ్యాచ్‌లు హరారే స్పోర్ట్స్ క్లబ్‌లో జరగాల్సి ఉంది. అయితే ఈ పర్యటనపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే ఈ విషయాన్ని జింబాబ్వే క్రికెట్ టెక్నికల్ డైరెక్టర్ లాల్‌చంద్ రాజ్‌పుత్ మాత్రం సోషల్ మీడియాలో ధృవీకరించారు.
భారత జట్టు ఆగస్టు 15న హరారే చేరుకుంటుంది. ఈ పర్యటన ICC ODI సూపర్ సిరీస్‌లో భాగంగా ఉండనుంది. జింబాబ్వేకు మాత్రం ఇది చాలా కీలకమైన సిరీస్. ఎందుకంటే వచ్చే ఏడాది ODI ప్రపంచకప్ ఆడాల్సి ఉంది. దీని పాయింట్లు వచ్చే ఏడాది జరిగే వన్డే ప్రపంచకప్‌కు అర్హత సాధించేందుకు లెక్కించనున్నారు. భారత్ ఇప్పటికే ప్రపంచకప్‌నకు అర్హత సాధించింది.
భారత్‌కు ఆతిథ్యమివ్వడం పట్ల మేం చాలా సంతోషిస్తున్నాం. ఈ పోటీలతోపాటు చిరస్మరణీయమైన సిరీస్ కోసం ఎదురు చూస్తున్నాం” అని జింబాబ్వే బోర్డు టెక్నికల్ డైరెక్టర్ ప్రకటించారు.
6 సంవత్సరాల తర్వాత జింబాబ్వే పర్యటన..
మొత్తంగా టీమిండియా 6 సంవత్సరాల తర్వాత తొలిసారి జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. 2016లో ఎంఎస్ ధోని నేతృత్వంలో టీమిండియా చివరిసారిగా జింబాబ్వేలో పర్యటించింది. ఆ సమయంలో 3 వన్డేలు, 3 టీ20 మ్యాచ్‌లు ఆడారు. ఈసారి టీ20 సిరీస్ మ్యాచ్‌లు జరగవు. ఎందుకంటే ఆగస్టు 27 నుంచి శ్రీలంకలో టీ20 ఆసియాకప్ జరగనుంది. ఈ సందర్భంలో రెండు టీంలను ఏర్పాటు చేసేందుకు భారత్ సిద్ధమైంది.
ఇంగ్లండ్, వెస్టిండీస్‌లో మూడు వన్డేల సిరీస్‌లో భారత్ తలపడాల్సి ఉంది. అయితే, రెండు సిరీస్‌లు సూపర్ లీగ్‌లో భాగం కాదు. ప్రస్తుతం ఇంగ్లండ్‌లో టీ20 సిరీస్ ఆడుతోంది. జట్టు 1-0 ఆధిక్యంలో ఉంది.